వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
అమ్మే వారికి, కొనే వారికి ప్రభుత్వమే గ్యారంటీ.. బీమా రక్షణ
మరొక పక్క అసైన్డ్, షరతులు, చుక్కల భూములపై హక్కుల కల్పన
ఇలా లక్షలాది మందికి మంచి చేస్తే అవినీతి ఎలా అవుతుంది?
రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఎన్నికల ముందు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం నుంచి బయట పడటానికి చట్టాన్ని రద్దు చేశారు. ల్యాండ్ రిఫారŠమ్స్ చేపట్టే రాష్ట్రాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ఎన్నికల ముందు చేసింది దుష్ప్రచారంఅని చెప్పడానికి ఇంతకంటే రుజువుఏం కావాలి? – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘భూముల రీసర్వే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు.. ఇదొక గొప్ప సంస్కరణ. ఈ చట్టం ద్వారా భూములు కొనుగోలు చేసే వాళ్లకే కాదు.. అమ్మే వాళ్లకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. ఇన్సూ్యరెన్స్ కూడా కల్పిస్తుంది. టైటిల్స్‌ను వెరిఫై చేసి భూ యజమానుల సమక్షంలోనే సరిహద్దు రాళ్లు పాతి.. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం.
ఇలాంటి చట్టంపై ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు దారుణంగా తప్పుడు ప్రచారం చేశారు. దాన్నుంచి బయట పడేందుకు ఇప్పుడు పాట్లు పడుతున్నారు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. శ్వేతపత్రం పేరిట ఈ చట్టంపై చంద్రబాబు చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఫ్యాక్ట్ పేపర్ పేరిట వైఎస్ జగన్ శుక్రవారం తిప్పికొట్టారు. ‘రీ సర్వే కోసం సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఈ ప్రాజెక్టు కోసం నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు 9.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ప్రతి ఒక్కరూ ఒరిజినల్ డాక్యుమెంట్లే పొందారు. ఇలా రిజిస్ట్రేషన్ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. అయినా సరే పనిగట్టుకొని ఈ చట్టంపై ఎన్నికల్లో దుర్మార్గంగా ప్రచారం చేశారు. లేని పోని అపోహలు, భయాందోళనలకు గురిచేశారు. పదేపదే చెప్పిన అబద్ధాలు.. దుష్ప్రచారం నుంచి బయట పడేందుకు అసెంబ్లీలో ఆ చట్టాన్ని రద్దు చేశారు. తీరా ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్‌ను ముందుకు తీసుకెళ్లే రాష్ట్రాలకు ఇన్సెంటివ్‌గా 50 ఏళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో రీ సర్వేపై మళ్లీ యూ టర్న్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
రికార్డులన్నీ అప్‌గ్రేడ్
అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా ల్యాండ్ టైటిల్ వివాదాలు విన్పించవు. క్రయవిక్రయాల సందర్భంగా ఎక్కడా భూ వివాదాలు తలెత్తవు. కారణం అక్కడ టైటిల్స్ పక్కాగా ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ఈరోజు భూములు కొనుక్కోవాలంటే భయపడే పరి స్థితి. రేప్పొద్దున మీ భూమికి ఓనర్ తామే అంటూ ఎవరో ఒకరు వస్తారని కొనే వాళ్లకు భయం. ఈ పరిస్థితి లేకుండా చేసేందుకే ల్యాండ్ టైట్లింగ్ యాక్టును తీసుకొచ్చాం.
ఈ యాక్టు ద్వారా కొనే వారికి, అమ్మే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. బీమా ఇస్తుంది. ఇందు కోసం 15వేల మంది సర్వేయర్లను నియామకంతో పాటు రోవర్స్, సరిహద్దు రాళ్లు పెట్టాం. రికార్డులన్నీ అప్‌గ్రేడ్ చేశాం. మ్యూటేషన్ పూర్తి చేశాం. సబ్ డివిజన్ చేశాం. ప్రతి రికార్డును సచివాలయంలోనే అందుబాటులో ఉంచాం. టెటిల్స్ వెరిఫై చేసి మీ సమక్షంలోనే సరిహద్దు రాళ్లు పాతి గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాటు చేశాం.
ఒక్క ఫిర్యాదు రాలేదు
రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలుంటే వాటిలో 8 వేల గ్రామాలలో రీ సర్వే పూర్తి చేశాం. ఇప్పటికే 9.50 లక్షల మంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇచ్చాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచే కాకుండా, రీ సర్వే పూర్తయిన గ్రామాల నుంచి కూడా ఏ ఒక్కరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలాంటి ఈ యాక్టుపై ప్రజల్లో అపోహలు సృష్టించి చేసి ఓ మంచి కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు. ఆ దుష్ప్రచారం నుంచి బయటపడలేక అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది.
అసైన్డ్, షరతులు, చుక్కల భూముల విషయంలో దశాబ్దాలుగా ఇబ్బందులు పడిన రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మేలు చేసింది. 97 వేల మందికి.. 2,06,171 ఎకరాల చుక్కల భూములపై హక్కులు కల్పించింది. 35 వేల ఎకరాల షరతులు కలిగిన భూములను 22ఏ నుంచి తొలగించి 22వేల మంది రైతులకు మేలు చేస్తే అవినీతి అన్నారు. 20 ఏళ్లు పూర్తయిన 27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై 15,21,160 మంది దళితులు, పేద రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తే అవినీతి, అన్యాయమంటూ దుష్ప్రచారం చేశారు.
మా ప్రభుత్వంలో 42,397 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేశాం. 1.54 లక్షల మంది గిరిజనులకు 3.26 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశాం. విలేజ్ సర్వీస్ ఇనాం ల్యాండ్స్ కింద 1.58 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించి, 1.61లక్షల మంది రైతులకు మంచి చేశాం.
చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లక్షల మందికి మంచి చేస్తే ప్రశంసించాల్సింది పోయి దాన్ని తమకు అనుకూలంగా వక్రభాష్యం చెప్పగలిగినó నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. భూముల విషయంలో ఆయన ఆలోచన విధానం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఇవన్నీ ఎందుకు చేయనీయకుండా అడ్డుకుంటున్నాడో ఆలోచించాలి. బహుశా.. ఈ భూములపై హక్కులను తమ వాళ్ల పేరిట మార్చుకొనేందుకు అవకాశం కల్పించేందుకే చంద్రబాబు అడ్డుకుంటున్నాడా.. అని ప్రజలు ఆలోచించాలి. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాగే కొనసాగించి, తన మనుషులతో తక్కువ రేటుకు కాజేయాలని అడ్డుకుంటున్నాడేమో అనిపిస్తుంది. పేదలకు వాళ్ల భూములు వాళ్లు అమ్ముకునే స్వేచ్చ ఉండకూడదు. అప్పుడే తక్కువ రేటుకు కాజేయొచ్చన్న ఆలోచన చంద్రబాబుది.
Comments
Please login to add a commentAdd a comment