గత రెండు రోజులుగా ఇక్కడి నుంచి జెడ్డాకు వెళ్లిన 644 మంది యాత్రికులు
మూడో విమానంలో 48 మంది ప్రయాణం
సహకరించిన అధికారులకు ప్రశంసా పత్రాలు
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులతో చివరి విమానం బుధవారం బయలుదేరింది. గత రెండు రోజులుగా ఇక్కడి నుంచి 644 మంది హజ్ యాత్రకు వెళ్లగా, మూడవ విమానంలో 48 మంది యాత్రికులు వెళ్లారు.
తొలుత వీరందరూ ఉదయం 7.10 గంటలకు ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఈద్గా జామా మసీదు వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో అంతర్జాతీయ టెర్మినల్‌కు చేరుకున్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ తర్వాత స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు యాత్రికులు బయలుదేరి వెళ్లారు. వీరికి విమానాశ్రయంలో హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, కమిటీ సభ్యులు గౌస్ పీర్, పలువురు అధికారులు వీడ్కోలు పలికారు.
రాష్ట్ర హజ్ కమిటీ కృతజ్ఞతలు
హజ్–2024 యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. దుర్గాపురంలో ఈద్గా జామా మసీదు ఆవరణలో క్యాంప్ వద్ద సాయంత్రం హజ్‌యాత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ..రాష్ట్ర హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయడం వల్లే హజ్ యాత్ర విజయవంతంగా ప్రారంభమైందన్నారు.
హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం హర్షవర్ధన్‌ను హజ్ కమిటీ సభ్యులు సత్కరించారు.
హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదిర్, సభ్యులు అలీంబాషా, గౌస్ పీర్, మస్తాన్‌వలీ, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎంఎల్‌కే రెడ్డి, డీఎస్పీలు వెంకటరత్నం, గుప్తా, జయసూర్య, సెంట్రల్ హజ్ కమిటీ సభ్యులు బిలాల్ అన్సారి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment