Hajyatra
-
హజ్‌యాత్రకు బయలుదేరిన చివరి విమానం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులతో చివరి విమానం బుధవారం బయలుదేరింది. గత రెండు రోజులుగా ఇక్కడి నుంచి 644 మంది హజ్ యాత్రకు వెళ్లగా, మూడవ విమానంలో 48 మంది యాత్రికులు వెళ్లారు. తొలుత వీరందరూ ఉదయం 7.10 గంటలకు ఎయిర్పోర్ట్ సమీపంలోని ఈద్గా జామా మసీదు వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో అంతర్జాతీయ టెర్మినల్‌కు చేరుకున్నారు. అనంతరం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ తర్వాత స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు యాత్రికులు బయలుదేరి వెళ్లారు. వీరికి విమానాశ్రయంలో హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, కమిటీ సభ్యులు గౌస్ పీర్, పలువురు అధికారులు వీడ్కోలు పలికారు. రాష్ట్ర హజ్ కమిటీ కృతజ్ఞతలు హజ్–2024 యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. దుర్గాపురంలో ఈద్గా జామా మసీదు ఆవరణలో క్యాంప్ వద్ద సాయంత్రం హజ్‌యాత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ..రాష్ట్ర హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయడం వల్లే హజ్ యాత్ర విజయవంతంగా ప్రారంభమైందన్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం హర్షవర్ధన్‌ను హజ్ కమిటీ సభ్యులు సత్కరించారు. హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదిర్, సభ్యులు అలీంబాషా, గౌస్ పీర్, మస్తాన్‌వలీ, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి, డీఎస్పీలు వెంకటరత్నం, గుప్తా, జయసూర్య, సెంట్రల్ హజ్ కమిటీ సభ్యులు బిలాల్ అన్సారి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారంలాంటి ఉపవాసం
‘‘సమాధిలో కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. హాజీసాబ్ కు ఏమీ అర్థంకాక తలపట్టుకుని కూర్చున్నారు. అంతలో ఒక దైవదూత వచ్చి ‘‘హాజీ సాబ్ మీరు చేసిన నమాజులు, సత్కార్యాలేమీ మీ మన్నింపుకోసం సరితూగడం లేదు.’’ అంది.‘‘నా జీవితంలో మూడు సార్లు హజ్ యాత్ర చేశాను గదా’’ అన్నాడు.‘‘అందులో రెండు హజ్లు మీ సొంత డబ్బుతో చేయలేదు. ఒక హజ్ మాత్రం లోపభూయిష్టంగా ఉంది’’ అంది దైవదూత. దైవదూత చెప్పిన ఈ మాటలకు హాజీసాబ్ లో ఆందోళన మరింత ఎక్కువయ్యింది. ‘‘మీ దగ్గర ఉపవాసాలేమైనా ఉన్నాయా?’’ అని దైవదూత ప్రశ్న.‘‘నా దగ్గర మొత్తం నలభైఏళ్ల పాటు పాటించిన ఉపవాసాలున్నాయి’’ అని ఎంతో ఆతృతతో చెప్పారు హాజీసాబ్. దైవదూతఒక్కో ఉపవాసాన్ని పరిశీలనగా చూసింది. 40 ఏళ్లపాటు పాటించిన ఉపవాసాల్లో ఒక్క ఉపవాసమూ లోపరహితంగా లేదని తేలింది.‘ఉపవాసంలో చాడీలు, పరనింద, అబద్ధం మానుకోలేకపోయానని. నలభైఏళ్లపాటు పాటించిన ఉపవాసాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని’ అప్పటికే కుమిలిపోతున్నారు హాజీసాబ్.‘‘హాజీ సాబ్ మీకు శుభాకాంక్షలు..’’ అంటూ దైవదూత సంతోషంగా అభినందనలు అని చెప్పడంతో హాజీసాబ్కు ప్రాణం లేచి వచ్చినట్లయింది.‘‘నా దగ్గర ఉన్న రికార్డును తీక్షణంగా పరిశీలిస్తే మీ కర్మల చిట్టానుంచి బంగారపు ఉపవాసం ఒకటి కనబడింది’’ అంది దైవదూత. ‘‘బంగారపు ఉపవాసమా? నేనెప్పుడూ దాన్ని పాటించలేదే’’ అని హాజీసాబ్ దైవదూత వైపు ఏమీ అర్థం కానట్లు చూశారు.‘మీరు ఏటా రమజాన్‌లో ఒక నిరుపేద ఉపవాసికి ఇఫ్తార్ చేయించే వారు. అదే ఆ బంగారపు ఉపవాసం అనిపించుకుంది’’ అని దైవదూత సమాధానం ఇచ్చింది.ఎంతో ప్రచారంలో ఉన్న ఈ కథ కల్పితమే కావచ్చు. అబద్ధాలు, చాడీలు, దుర్భాషలు, చెడుచూపు, అవినీతి సొమ్ము సంపాదించడం లాంటి వాటిని మానుకోకుండా ఉపవాసాలు పాటించే వారికి ఆకలిదప్పులు తప్ప మరేమీ ప్రాప్తించవని ప్రవక్త (స) పరోక్షంగా హెచ్చరించారు. – ముహమ్మద్ ముజాహిద్ -
నాణేల కాలువ
‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని అన్నారు జుబేదా! హారూన్ రషీద్ అనే చక్రవర్తి పరిపాలనా కాలం అది. ఇరాక్ నుంచి మక్కా వెళ్లే మార్గంలో మంచినీటి కటకటతో బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. హజ్ యాత్రకు వెళ్లేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న మంచినీరు అయిపోతే బాటసారులతోపాటు ఒంటెలు, గుర్రాలు దప్పికతో అల్లాడిపోయేవి, మృత్యువాతపడేవి. ప్రజలు, జంతువులు నీటికోసం అల్లాడుతున్నారన్న విషయం ఖలీఫా సతీమణి జుబేదాకు తెలిసి ఆమె హృదయం చలించిపోయింది. ఎడారి ప్రాంతంలో మంచినీటి కాలువ ప్రవహింపజేయాలి అనే యోచనను తన భర్త ఖలీఫా ముందుంచింది. దీనికి ఖలీఫా కూడా సానుకూలంగా స్పందించారు. కాలువ నిర్మాణం కోసం రాజ్యంలో ఉన్న సాంకేతిక నిపుణుల్ని అందరినీ ఆహ్వానించి, హజ్ యాత్రికుల నీటి ఎద్దడిని దూరం చేసేందుకు ఉపాయం ఏమిటో యోచించాలని ఆదేశించిందామె. ఏమాత్రం ఆలస్యం చేయక ప్రయత్నాలు మొదలెట్టారు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ గాలించారు. నీటి వనరులున్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. పథకాలు తయారు చేశారు. ‘‘అమ్మా! సమస్యకు పరిష్కారం గోచరించింది. తాయిఫ్ లోయలో చక్కటి సెలయేరు ఉంది. అది హునైన్ కొండ వైపునకు ప్రవహిస్తుంది. ఆ నీళ్లు అమృతతుల్యంగా ఉన్నాయి. కాని దాన్ని మక్కాకు మళ్లించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎన్నో కొండలు, గుట్టలు, బండరాళ్లు మార్గంలో అడ్డుపడుతున్నాయి. ఈ అవరోధాన్ని తొలగించి కాలువ కట్టవలసి ఉంటుంది. అయితే అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని, బోలెడంత ఖర్చు అవుతుంది’’ అని విన్నవించుకున్నారు. ‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని తన దాతృత్వాన్ని చాటుకుంది. నిపుణులు తాయిఫ్ లోయలో పుట్టిన ఊటను మక్కాకు చేర్చేందుకు కాలువ తవ్వించారు. దారిలో వచ్చిన ఎన్నో చిన్న చిన్న ఊటల్ని ఈ కాలువలో కలుపుకుంటూ వచ్చారు. కాలువ రానురాను నదిగా మారి మక్కాకు చేరింది. నీటి పథకం పూర్తయి ప్రజలకు మంచి నీటి వసతి కలిగింది. జుబేదా సంకల్పం నెరవేరింది. ఒకరోజు మంత్రి ‘‘రాణి గారూ! కాలువ నిర్మాణానికి మొత్తం 17 లక్షల బంగారు నాణేల ఖర్చయ్యింది’’ అని చెప్పి ఖర్చు వివరాల కాగితాలను ఆమెకు అందించాడు. ఆమె చిరునవ్వుతో ఖర్చు వివరాల కాగితాలను కాలువలో పడేశారు. నేటికీ అక్కడి ప్రజలకు, లక్షలాది సంఖ్యలో ఏటా వచ్చే హజ్ యాత్రికులకు నీరు సరఫరా చేస్తోంది జుబేదా కాలవ. ముహమ్మద్ ముజాహిద్ -
తల్లి రుణం
‘‘ప్రవక్తా వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్ యాత్ర చేశాను. మా అమ్మ రుణాన్ని తీర్చుకున్నట్లేనా’’ అని అతడు అడిగాడు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (సఅసం) తన సహచరులతో ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు. అటుగా ఒక మహిళ ప్రవక్త (స) వారి సమక్షంలోకి వచ్చింది. వెంటనే ప్రవక్త (స) లేచి నిలబడి తన భుజంపై ఉన్న దుప్పటిని తీసి పరిచి ఆమెను కూర్చోబెట్టారు. ఆమెతో ఎంతో గౌరవభావంతో మాట్లాడారు. ఒక సహచరుడు అక్కడున్న వారితో ఆమె ఎవరా అని అడగ్గా ప్రవక్త (స)కు పాలుపట్టిన తల్లి అని మరో సహచరుడు చెప్పారు. ప్రవక్త (స) మాతృమూర్తి ఆయన బాల్యంలోనే కన్నుమూశారు. ఆయనను దాయీ హలీమా అనే మహిళ పాలు పట్టి పెద్దచేశారు. పాలుపట్టిన తల్లిని చూడగాలే లేచి నిలబడటం, ఆమెకు తన భుజంపై దుప్పటిని తీసి పర్చి కూర్చోబెట్టడం ఎంతో ఆదర్శనీయం.ఒకసారి ప్రవక్త (స) సమక్షంలోకి ఆయన అనుచరుడు వచ్చి ‘‘ప్రవక్తా వృద్ధాప్య భారంతో నడవలేక మంచానికే పరిమితమైన మా అమ్మను నా భుజాలపై కూర్చోబెట్టుకుని హజ్ యాత్ర చేశాను. మా అమ్మ రుణాన్ని తీర్చుకున్నట్లేనా’’ అని అడిగాడు. దానికి ప్రవక్త ‘‘మీ అమ్మ నిన్ను ప్రసవిస్తున్నప్పుడు బాధ భరించలేక పెట్టిన ఒక్క కేక రుణం కూడా తీరలేదు’’ అని చెప్పి పంపారు.పై రెండు సంఘటనలతో తల్లి స్థానం ఎంత గొప్పదో బోధపడుతుంది.ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) సతీమణి హజ్రత్ ఆయిషా (రజి) దగ్గరికి ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను వెంటపెట్టుకొని వచ్చింది. ఎన్నో రోజులుగా పస్తులున్నామని, తన ఆకలి బాధను తెలియజేసిందా మహిళ. అప్పుడు ఆయిషా (రజి) ఇంట్లో తినడానికి ఏమీలేవు ఒకే ఒక్క ఖర్జూరం పండు తప్ప. ఆ ఖర్జూరాన్ని ఆయిషా (రజి) ఆమెకు అందించారు. ఆ మహిళ ఆ ఖర్జూరాన్ని అందుకొని రెండు సమాన భాగాలు చేసి తన ఇద్దరు కూతుళ్లకు పంచి తాను మాత్రం పస్తులుండిపోయింది. ఈ వృత్తాంతాన్ని ఆయిషా (రజి) ఆమె భర్త ముహమ్మద్ (స) ఇంటికి రాగానే వినిపించారు. అప్పుడు ప్రవక్త (స) ఆ మహిళ త్యాగాన్ని ఎంతగానో ప్రశంసించారు. ‘‘తాను పస్తులుండి తన ఆడ పిల్లల ఆకలి తీర్చిన ఆ మహిళకు ఆ ఆడ పిల్లలే నరకానికి అడ్డుగోడలవుతారు. స్వర్గానికి బాటలవుతార’ని ప్రవక్త చెప్పారు. ముహమ్మద్ ముజాహిద్ -
హైదరాబాద్ నుంచే ఇరు రాష్ట్రాల హజ్ యాత్ర
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2018కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీల ద్వారా ఎంపికైన యాత్రికులు హైదరాబాద్ నుంచే మక్కాకు బయలుదేరనున్నట్లు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్, ప్రత్యేక అధికారి ఎస్ఎ.షుకూర్ తెలిపారు. సోమవారం నాంపల్లి హజ్‌హౌస్‌లో ఇరు రాష్ట్రాల హజ్ కమిటీల చైర్మన్లు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. 2018 హజ్ యాత్రకు ఆంధ్రా యాత్రికు లు కూడా హైదరాబాద్ నుంచే వెళ్లనున్నట్లు అధికా రులు చెప్పారు. ఆగస్టు 1 నుంచి 16 వరకు మూడు రాష్ట్రాల వారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. 1 నుంచి 9 వరకు 4,500 మంది తెలంగాణ యాత్రికులు, 10 నుంచి 14 వరకు 2,300 మంది ఆం్ర«ధా యాత్రికులు, 15న కర్ణాటకు చెందిన 800 మంది, చివరి రోజులో మిగిలిన, వెయిటింగ్ లిస్టు ద్వారా ఎంపికైన 3 ప్రాంతాల యాత్రికులు వెళతారన్నారు. తెలంగాణ హజ్ కమిటీ ద్వారా యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు. హైదరా బాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా యాత్రికులకు మూడ్రోజుల పాటు నాంపల్లి హజ్‌హౌస్‌లో ఆస్రా ఆసుపత్రి సౌజన్యంతో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామరు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 17 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందన్నారు. -
ఆగస్టు 17 నుంచి హజ్‌యాత్ర
సాక్షి, హైదరాబాద్: పవిత్ర హజ్‌యాత్ర-2015కు తెలంగాణ హజ్ కమిటీ సిద్ధమైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హజ్‌హౌస్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు దరఖాస్తుల జారీ ప్రక్రియను ప్రారంభించి షెడ్యూలు విడుదల చేయనున్నారు. ఈ యాత్ర కోసం పూర్తి చేసిన దరఖాస్తులను సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు స్వీకరించనున్నారు. ఈసారి కొత్తగా ‘ఆన్లైన్’లో దరఖాస్తుల స్వీకరణ, ఈ-పేమెంట్ సదుపాయం కల్పించారు. దరఖాస్తులను www.hajcommittee.comవెబ్‌సైట్‌కు పంపవచ్చు. అదేవిధంగా ఈ పేమెం ట్ను ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. అంతర్జాతీయ పాస్‌పోర్టు కలిగి 2016 మార్చి, 20వ తేదీ వరకు గడువు ఉన్నవారే హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వుడ్ కేటగిరి కింద 70 ఏళ్ల వయస్సు పైబడినవారు, నాలుగు పర్యాయాలు దరఖాస్తు చేసుకొని ఈ యాత్రకు ఎంపిక కానీ వారిని పరిగణనలోనికి ఏ, బీ కేటగిరీలుగా తీసుకుంటారు. మార్చిలో యాత్రికుల ఎంపిక: హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఎంపిక మార్చి రెండోవారంలో జరగనుంది. రాష్ట్రానికి కేటాయించి కోటాను జిల్లా ముస్లిం జనాభావారీగా విభజించి లాటరీ పద్ధతిలో ఎంపికను నిర్వహిస్తారు. ఎంపికైనవారు తమ ఒరిజినల్ పాస్‌పోర్టుతోపాటు పే స్లిప్‌లను ఏప్రిల్ 23లోగా సమర్పిం చాల్సి ఉంటుంది. ఆగస్టు 17న హజ్‌యాత్ర కోసం తొలి ఫ్లైట్ బయలుదేరనుంది. -
హజ్ యాత్రపై డాలర్ దెబ్బ!
సాక్షి, విజయవాడ : హజ్‌యాత్రకు రూపాయి సెగ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజురోజుకి పతనమవుతుండటం, డాలర్ విలువ పెరుగుతుండడం హజ్ యాత్ర ప్రయాణికులకు భారంగా మారింది. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్‌యాత్ర చేసి మక్కాను సందర్శించాలనే అకాంక్ష ఈ ఏడాది లక్షలు ఖర్చు పెడితే కాని తీరేలా లేదు. కేంద్రప్రభుత్వమే తీసుకెళ్లే ప్యాకెజీ భారీగా పెరగటంతో మిగిలిన ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. రూపాయి మారకం విలువ పతనం అవడంతో ఈ ఏడాది హజ్ యాత్రకు రూ.18 వేలకు పైగా అదనంగా ఖర్చు కానుంది. ఈ నెలాఖరు నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈఏడాది జిల్లాలో హజ్ యాత్ర నిర్వహణకు రాష్ట్ర హజ్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి షెడ్యూల్‌ను ప్రకటించింది. గత ఏడాదితో పోలీస్తే ఈఏడాది జిల్లాకు కోటా పెరిగింది. యాత్రకు వెళ్లేవారి నుంచి రాష్ట్ర హజ్‌కమిటీ దరఖాస్తుల్ని స్వీకరించింది. జిల్లా నుంచి మొత్తం 500 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 270 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. 70 ఏళ్లు పైబడిన వారికి లాటరీతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోగానే యాత్రకు అనుమతిస్తారు. ఈ ఏడాది అలా 32 మంది సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకోవటంతో జిల్లా కోటా పెరిగింది. గత ఏడాది సుమారు 500 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 198 మందిని యాత్రకు తీసుకెళ్లారు. గత ఏడాది ఒక్కొకరికీ 1.64 లక్షలు యాత్ర ప్యాకేజ్‌గా ధర ఉండగా... ఈ ఏడాది అది 1.82 లక్షలకు చేరింది. అరబ్దేశాల్లో అక్కడి కరెన్నీ చెలామణితో పాటు విదేశీయుల రాకతో డాలర్ చెలామణి బాగా పెరిగింది. దీంతో అన్ని అంశాలపై ఈ ప్రభావం చూపుతుంది. వాస్తవానికి ప్రభుత్వమే రాయితీలపై హజ్‌యాత్రకు భక్తుల్ని పంపాల్సి ఉంటుంది. దీనికి మైనార్టీ కార్పొరేషన్ అర్థికంగా సహకరించాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మెనార్టీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది. ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే సెంట్రల్, రాష్ట్ర హజ్ కమిటీలు ప్రసుత్తం యాత్ర వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం 40 నుంచి 45 రోజుల పాటు సాగే యాత్రకు సంబంధించి అనేక జాగ్రత్తలతో పాటు ప్రత్యేక వసతుల్ని విదేశాల్లో ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అక్కడి వాతవరణ పరిస్థితులు, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా యాత్రకు వెళ్లే వారందరికీ వ్యాక్సిన్ ఇస్తారు. 17వ తేదీన విజయవాడ నగరంలోని వన్ టౌన్లో ఉన్న ముసాఫీర్ ఖానాలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తం 1.82 లక్షల ప్యాకెజ్‌లో విమానం టికెట్లతో పాటు అక్కడ రవాణ సౌకర్యాలు, బస ఖర్చు అన్నీ కలిసి ఉంటాయి. 40 రోజులకు పైగా అరబ్ దేశాలో యాత్ర కావటంతో ప్రభుత్వమే హజ్ కమిటీ ద్వారా యాత్రలో భక్తులకు అవసరమైన వసతుల్ని రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. 25వ తేదీ నుంచి వరుసగా 20 రోజులపాటు యాత్రికులకు విమానాలు నేరుగా ఉంటాయి. జిల్లా నుంచి వెళ్లే270 మందిని విడతల వారీగా పంపనున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోజూ మూడు విమానాలు వెళుతుంటాయి. 30వ తేదీ తర్వాత నుంచి విమాన సర్వీసులు రెట్టింపు అవుతాయి. ఈ ఏడాది యాత్ర ఖర్చు రూ.18 వేలు అదనం కానుందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యురాలు మల్లికా బేగం సాక్షికి తెలిపారు.