సాక్షి, విజయవాడ : హజ్‌యాత్రకు రూపాయి సెగ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ రోజురోజుకి పతనమవుతుండటం, డాలర్ విలువ పెరుగుతుండడం హజ్ యాత్ర ప్రయాణికులకు భారంగా మారింది. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్‌యాత్ర చేసి మక్కాను సందర్శించాలనే అకాంక్ష ఈ ఏడాది లక్షలు ఖర్చు పెడితే కాని తీరేలా లేదు. కేంద్రప్రభుత్వమే తీసుకెళ్లే ప్యాకెజీ భారీగా పెరగటంతో మిగిలిన ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. రూపాయి మారకం విలువ పతనం అవడంతో ఈ ఏడాది హజ్ యాత్రకు రూ.18 వేలకు పైగా అదనంగా ఖర్చు కానుంది. ఈ నెలాఖరు నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది.
ఈఏడాది జిల్లాలో హజ్ యాత్ర నిర్వహణకు రాష్ట్ర హజ్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి షెడ్యూల్‌ను ప్రకటించింది. గత ఏడాదితో పోలీస్తే ఈఏడాది జిల్లాకు కోటా పెరిగింది. యాత్రకు వెళ్లేవారి నుంచి రాష్ట్ర హజ్‌కమిటీ దరఖాస్తుల్ని స్వీకరించింది. జిల్లా నుంచి మొత్తం 500 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 270 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. 70 ఏళ్లు పైబడిన వారికి లాటరీతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోగానే యాత్రకు అనుమతిస్తారు. ఈ ఏడాది అలా 32 మంది సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకోవటంతో జిల్లా కోటా పెరిగింది.
గత ఏడాది సుమారు 500 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 198 మందిని యాత్రకు తీసుకెళ్లారు. గత ఏడాది ఒక్కొకరికీ 1.64 లక్షలు యాత్ర ప్యాకేజ్‌గా ధర ఉండగా... ఈ ఏడాది అది 1.82 లక్షలకు చేరింది. అరబ్‌దేశాల్లో అక్కడి కరెన్నీ చెలామణితో పాటు విదేశీయుల రాకతో డాలర్ చెలామణి బాగా పెరిగింది. దీంతో అన్ని అంశాలపై ఈ ప్రభావం చూపుతుంది. వాస్తవానికి ప్రభుత్వమే రాయితీలపై హజ్‌యాత్రకు భక్తుల్ని పంపాల్సి ఉంటుంది. దీనికి మైనార్టీ కార్పొరేషన్ అర్థికంగా సహకరించాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మెనార్టీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది.
ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే సెంట్రల్, రాష్ట్ర హజ్ కమిటీలు ప్రసుత్తం యాత్ర వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం 40 నుంచి 45 రోజుల పాటు సాగే యాత్రకు సంబంధించి అనేక జాగ్రత్తలతో పాటు ప్రత్యేక వసతుల్ని విదేశాల్లో ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అక్కడి వాతవరణ పరిస్థితులు, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా యాత్రకు వెళ్లే వారందరికీ వ్యాక్సిన్ ఇస్తారు. 17వ తేదీన విజయవాడ నగరంలోని వన్ టౌన్‌లో ఉన్న ముసాఫీర్ ఖానాలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తం 1.82 లక్షల ప్యాకెజ్‌లో విమానం టికెట్లతో పాటు అక్కడ రవాణ సౌకర్యాలు, బస ఖర్చు అన్నీ కలిసి ఉంటాయి.
40 రోజులకు పైగా అరబ్ దేశాలో యాత్ర కావటంతో ప్రభుత్వమే హజ్ కమిటీ ద్వారా యాత్రలో భక్తులకు అవసరమైన వసతుల్ని రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. 25వ తేదీ నుంచి వరుసగా 20 రోజులపాటు యాత్రికులకు విమానాలు నేరుగా ఉంటాయి. జిల్లా నుంచి వెళ్లే270 మందిని విడతల వారీగా పంపనున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోజూ మూడు విమానాలు వెళుతుంటాయి. 30వ తేదీ తర్వాత నుంచి విమాన సర్వీసులు రెట్టింపు అవుతాయి. ఈ ఏడాది యాత్ర ఖర్చు రూ.18 వేలు అదనం కానుందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యురాలు మల్లికా బేగం సాక్షికి తెలిపారు.
హజ్ యాత్రపై డాలర్ దెబ్బ!
Published Fri, Sep 6 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement