సైకిల్‌పై కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తున్న సుదర్శన్
బేల్దారి పనులతో మా అమ్మ ఎంతో కష్టపడుతోంది. కరోనా కారణంగా పనిలేకుండా పోయింది. కష్టాలు చుట్టుముట్టాయి. ఇల్లు గడవటం కష్టంగా మారింది. అందుకే అమ్మకు సాయంగా ఉంటున్నా.. ఇది నాకు ఏమాత్రం కష్టం కాదు. – ఓ పదకొండేళ్ల కుర్రాడు చెప్పిన జీవిత పాఠం
ఆ చిన్నారికి నిండా పదకొండేళ్లు లేవు. తన వయస్సు పిల్లలంతా టీవీ చూడ్డమో.. సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవడమో చేస్తుంటారు. కానీ ఆ బడతడు ఆటలకు దూరమయ్యాడు. తండ్రి దూరమై తల్లడిల్లుతున్న తల్లికి తోడయ్యాడు. కరోనా కష్టకాలంలో కుటుంబ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. ఇళ్లిళ్లూ తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. తల్లి, ఇద్దరు అక్కలకు ఆర్థిక ఆసరానిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. వయస్సులో చిన్నోడయినా బాధ్యత నెత్తికెత్తుకోవడంలో అందరికన్నా మిన్న. అందుకే అందరూ శభాష్ సుదర్శనా అంటున్నారు. ఎవరీ చిన్నారి..ఏమా కష్టం..తెలుసుకుందాం.. స్ఫూర్తి పొందుదాం.
గుత్తి: గుత్తి పట్టణంలోని గాంధీ నగర్ కాలనీలో వెంకటేష్, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి యశోద, వెంకట లక్ష్మి, రమణి, పద్మావతి, సుదర్శన్ అనే ఐదుగురు సంతానం. ఈ దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. విధి వక్రించడంతో ఆరేళ్ల క్రితం వెంకటేష్ మరణించాడు. దీంతో సుజాత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించింది. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కూడా చేసింది. ఈ క్రమంలో కుటుంబం గడవడం కష్టంగా మారగా... పదకొండేళ్ల కుమారుడు సుదర్శన్ తల్లికి తోడుగా నిలిచాడు. మూడు సంవత్సరాలుగా తల్లితో పాటు శ్రమిస్తున్నాడు. తల్లి తయారు చేసిన దోశలు, ఇడ్లీలు, వడలు బకెట్లో పెట్టుకుని ఊరంతా తిరుగుతూ విక్రయిస్తూ వచ్చిన కొద్దిపాటి మొత్తంతో కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తున్నాడు. మరోపక్క చదువు కూడా కొనసాగించాడు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబానికి కొత్త కష్టం వచ్చి పడింది.
సుదర్శన్ వద్ద ఆకుకూరలు కొంటున్న మహిళలు..
కరోనా కష్టాలతో జీవితం తలకిందులు..
కరోనా కారణంగా ఐదు మాసాలుగా లాక్‌డౌన్ విధించగా...వీరి జీవితం తలకిందులైంది. దోశలు, వడలు, ఇడ్లీలు విక్రయించడం కష్టమైంది. ఆర్థిక పరిస్థితి దిగజారగా ఇళ్లు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో సుదర్శన్ నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు విక్రయించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఓ సైకిల్లో ఆకుకూరలు, కూరగాయల బుట్ట పెట్టుకుని ఊరంతా తిరుగుతూ విక్రయిస్తున్నాడు. రోజూ రూ.150 నుంచి రూ.200 దాకా సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా...రేపు పాఠశాలలు తిరిగి తెరిస్తే సుదర్శన్ జీవితం ప్రశ్నార్థంగా మారనుంది. కుటుంబ బాధ్యతా..? భవిష్యత్ వైపు అడుగులా తేల్చుకోలేని కష్టం ఎదురుకానుంది. మనసున్న మనుషులు కాస్త చేయూతనిస్తే ఇంటిపెద్దగా మారిన ఈ చిన్నారి జీవితం ఒడ్డునపడుతుంది.
నాన్న చనిపోవడం బాధించింది..
మేము ఐదుగురు సంతానం. అనారోగ్యంతో నాన్న చనిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. అప్పుడు నా వయస్సు ఐదేళ్లు. ఏడవద్దని అమ్మను మేమంతా ఓదార్చాం. అమ్మ ఎంతో కష్టపడి ముగ్గురు అక్కలకు పెళ్లిళ్లు చేసింది. మూడు సంవత్సరాల క్రితం నుంచి అమ్మకు తోడుగా నేనూ చిరు వ్యాపారం చేస్తున్నా. అమ్మచేసే ఇడ్లీలు, వడలు, దోశలు ఊరంతా తిరిగి అమ్ముతున్నా. కరోనా వల్ల వ్యాపారం లేక... బుట్టలో కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకొని విక్రయిస్తున్నా. నేను బరువు మోయలేనని అమ్మ ఈ మధ్యనే చిన్న సైకిల్ కొనిచ్చింది. నేను చిన్న పిల్లోడిని కావడంతో అందరూ నా వద్దే కొంటున్నారు. ప్రస్తుతం నేను కోట ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా. బడి తెరిచినా..కూరగాయలు విక్రయించడం కష్టమవుతుందేమో...అయినా అమ్మ కోసం అన్నీ ఇష్టంగానే చేస్తా.
సాయం చేయాలనుకుంటే..
సుజాత, సుదర్శన్
జాయింట్ అకౌంట్
అకౌంట్ నెం.31262250092754
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : SYNB0003126
సిండికేట్ బ్యాంకు, గుత్తి అర్బన్
Comments
Please login to add a commentAdd a comment