ప్రాజెక్టులోకి 3.71 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
దిగువకు 1.08 లక్షల క్యూసెక్కులు విడుదల
సాక్షి, అమరావతి/అచ్చంపేట /విజయపురిసౌత్ /శ్రీశైలం ప్రాజెక్ట్ : నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలు పెద్ద మొత్తంలో వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టు సగం నిండింది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పులిచింతల గేట్లు ఎత్తి, ప్రకాశం బ్యారేజికి నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ దిగువకు 1,08,895 క్యూసెక్కులను వదిలేస్తున్నారు.
ఇక్కడ మంగళవారం ఉదయం 6 గంటలకు 10.65 టీఎంసీలున్న నిల్వ సాయంత్రం 6 గంటలకు 22.74 టీంసీలకు చేరింది. అంటే 12 గంటల్లోనే 12 టీఎంసీలకు పైగా జలాలు ప్రాజెక్టులోకి వచ్చాయి. సాగర్ నుంచి వరద కొనసాగుతుండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లు కూడా బుధవారం ఎత్తివేయనున్నారు. బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను సముద్రంలోకి వదిలేయనున్నారు.
సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు
సాగర్ ఆయకట్టుకు నీరందించే కుడి ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంలోకి 3.71 లక్షల క్యూసెక్కులు
శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 3.71 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 883.2 అడుగుల్లో 205.66 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి, కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 3.72 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 254 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.400 క్యూసెక్కులు వదిలారు. సాగర్‌లోకి 3.14 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 585.10 అడుగుల్లో 297.72 టీఎంసీలను నిల్వ చేస్తూ 22 గేట్లను పది అడుగుల మేర ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 3.36 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment