బాబు సీఎంగా ఉన్నప్పుడే పెరిగిన హెరిటేజ్ షేర్లు
సహకార రంగాన్ని పథకం ప్రకారం చంద్రబాబు ఖూనీ చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వ డైయిరీలను ఏపీ మ్యాక్స్ కిందకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ షేరు లాభాలు పెరుగుతాయని తెలిపారు. ‘2014లో వంద రూపాయలు ఉన్న హెరిటేజ్ 2017లో 827 రూపాయలకు పెరిగింది. 2020 మార్చి నాటికి మళ్లీ 200 రూపాయలకు పడిపోయింద’ని సీఎం వివరించారు. చిత్తూరు డైయిరీని మూసేయించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ప్రైవేటు డైయిరీలు అనుసరించిన అనైతిక చర్యల వల్ల సహకార డైయిరీలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. అమూల్‌తో తమ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో పాల్ప ఉత్పత్తి దారుల సామాజిక, ఆర్థిక ఉన్నతి సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
సూచనలు ఇస్తారనుకుంటే...
ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తారనుకుంటే, నానా యాగీ చేసి సభ నుంచి వెళ్లిపోయారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఏపీ-అమూల్ భాగస్వామ్యంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వైఖరిని తప్పుబట్టారు. ప్రభుత్వ డైయిరీలను ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. హెరిటేజ్ డెయిరీతో వేల కోట్ల రూపాయలు సంపాదించారని తెలిపారు. రాష్ట్రంలో సంవత్సరానికి 76,650 కోట్ల రూపాయల పాల వ్యాపారం జరుగుతోందన్నారు. డైరీకి సంబంధించి 6 శాతం జీడీపీలో భాగంగా ఉందని వెల్లడించారు. ప్రైవేటు డైయిరీలకు లీటర్ పాలపై 35 రూపాయల వరకు లాభం వస్తోందని తెలిపారు. 27 లక్షల మంది మహిళలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం: సీఎం జగన్
అమూల్‌తో ఒప్పందంతో మహిళలకు మేలు జరుగుతుందని, పాల రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... అమూల్‌పై చర్చ సందర్భంగా చంద్రబాబు సభలో ఉంటారని తాము ఆశించామని, ఆయన మాత్రం స్వప్రయోజనాలు చూసుకున్నారని అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని, సభ నుంచి సస్పెండ్ చేయించుకుని ఎల్లోమీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాలో తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జులై 8న రూ.2,250 నుంచి రూ.2500లకు పింఛన్ పెంచుతామని హామీయిచ్చారు. 2023 జులై 8న రూ.2,750 నుంచి రూ.3వేలకు పింఛన్ పెంచుతామని ప్రకటించారు.
టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి బయటకు పంపించారు. నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, అశోక్, రామరాజులను సస్పెండ్ చేశారు. వీరితో పాటు చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అమూల్‌పై చర్చ జరుగుతుండగా చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం.
బీఏసీలో ఎందుకు పెట్టలేదు: బొత్స
శాసనమండలిలో విపక్షాల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. అమరావతిపై చర్చించాలని అనుకున్నప్పుడు బీఏసీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీఏసీలోని ప్రతీ అంశంపై చర్చించడానికిసిద్దంగా ఉన్నామని ప్రకటించారు. పబ్లిసిటీ కోసం టీడీపీ అమరావతి అంటోందని, అమరావతి గురించి చర్చించడానికి తమకు భయం లేదన్నారు. ‘టీడీపీకి రాజకీయ లబ్దికావాలి. సమస్య పరిష్కారం కాదు. ఏ విషయంపైన అయినా చర్చించడానికి సిద్దంగా ఉన్నామ’ని మంత్రి తెలిపారు.
టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ
శాసనమండలి సమావేశాలు ఐదో రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. రాజధానిగా అమరావతి కొనసాగాలని టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. అమరావతిపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేశారు. కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందని చైర్మన్ వివరించినా వినిపించుకోలేదు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
టీడీపీ సభ్యుల గందరగోళం
సభ ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. గట్టిగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయని, సహకరించాలని స్పీకర్ కోరినా టీడీపీ సభ్యులు వినలేదు. విపక్ష సభ్యుల గందరగోళం నడుమ పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం తప్పుబట్టింది. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల నేపథ్యంలో 15 నిమిషాల పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు.
స్పీకర్ స్థానాన్ని అవమానిస్తున్న టీడీపీ
విలువైన సమయాన్ని ప్రతి రోజు వృధా చేస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్ స్థానాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చెప్పిన ప్రతి అంశాన్ని చర్చిస్తున్నా ఈవిధంగా సభా కార్యకలాపాలను అడ్డుకోవడం తగదన్నారు. కేవలం బురద చల్లాలనే ప్రయత్నంతోనే ఏదోరకంగా సభను ఆటంకపరచాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ఐదో రోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పాడిపరిశ్రమ అభివృద్ధి - అమూల్‌తో భాగస్వామ్యంపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు. కరోనా నివారణ, ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కూడా శాసనసభలో చర్చ జరుగుతుంది. నేడు శాసన మండలిలో ఐదు బిల్లులపై చర్చ జరగనుంది. పోలవరం, టిడ్కో, స్కూళ్లల్లో నాడు-నేడుపై శాసనమండలిలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment