ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం
నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో కాలయాపన
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం పొందింది. ఈ నెలాఖరుతో ఈ గడువు పూర్తి కానుంది. సాధారణంగా అధికారంలోకి రాగానే కొత్త ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాయి.
అయితే కూటమి సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా తప్పించుకునేందుకు పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సన్నద్ధమైనట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టగా ఈ నెల 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.
రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసాధారణ పరిస్థితులేమీ లేవు. పైగా కేంద్రం నుంచి రాబడులు, రాష్ట్ర ఆదాయాలు ఎంతనేవి స్పష్టంగా ఉన్నాయి. కేంద్ర తరహాలో రాష్ట్ర బడ్జెట్‌లో పన్నులు వేయడాలు లాంటివి ఉండవు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపనకు సిద్ధమైనట్లు వెల్లడవుతోంది.
కేటాయింపులు చేయకుండా హామీలకు ఎగనామం
గత ప్రభుత్వంపై నిందలు మోపి బురద చల్లేందుకే చంద్రబాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎత్తుగడ వేశారనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్నికల హామీలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.నాలుగు వేల చొప్పున ఇస్తానని చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో ప్రకటించారు. ఇప్పుడు ఆ ఊసే మరిచారు.
తల్లికి వందనం, దీపం, ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువగళం లాంటి పథకాలకు కేటాయింపులు చేయకుండా ఉండేందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు ఎక్సైజ్, ఆర్ధిక, శాంతి భద్రతలపై శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా విడుదల చేయడం ద్వారా వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడానికి వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఐదు రోజులు పాటు సమావేశాలను నిర్వహించాలని, ఈ నెల 25 లేదా 26వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
సీసీ కెమెరాలన్నీ పని చేయాలి
శాసన సభ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు కల్పించాలని స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు, శాసన మండలి అధ్యక్షుడు కె.మోషేన్ రాజు ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం అసెంబ్లీ భవనంలో పోలీసు ఉన్నతాధికారులతో వారు చర్చించారు. అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ సూచించారు. అసెంబ్లీ గ్యాలరీల్లోకి ప్రవేశించే వారిని పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.
గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. ఈసారి 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు, తొమ్మిది మంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో వారిని గుర్తించేందుకు ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి కె.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment