కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆమె సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్. అతను అదే సచివాలయ పరిధిలో వలంటీర్. ఉద్యోగరీత్యా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే భయంతో గ్రామంలోని గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం గుడి తలుపులు మూసేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హడావుడి సృష్టించారు. సంచలనం కలిగించిన ఈ సంఘటన బందరు మండలం బుద్దాలపాలెం గ్రామంలో సోమవారం జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. బుద్దాలపాలెంకు చెందిన కొక్కు నాగరాజు అదే గ్రామంలో వలంటీర్‌గా పని చేస్తున్నాడు. మచిలీపట్నంకు చెందిన గాయత్రి రెండేళ్ల కిందట సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెకు బుద్దాలపాలెం సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో భాగంగా నాగరాజు గాయత్రిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇరువురికీ వేర్వేరు కులాలు.
దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో సోమవారం వారు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ గుడి లోపలే ఉండి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రవికుమార్, ఎస్‌ఐ చాణక్య గ్రామ పెద్దల సహకారంతో ఇద్దరినీ బయటికి తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువురి తరపు బంధువులు స్టేషన్‌కు వచ్చేందుకు నిరాకరించారు. ప్రేమికులు ఇరువురూ మేజర్‌లు కావటంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వారిని పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment