
చారిత్రక ప్రదేశాల సమాహారంగా పుస్తక రూపకల్పన
టూరిజం స్థలాలతో బ్రోచర్ ఆవిష్కరణ
‘ఏ స్టోరీ ఆన్ స్టోన్’ పవిత్రమైన సిక్కోలు గడ్డపై అనంతమైన అభిమానంతో రాసిన ప్రేమలేఖ. అటు ఇచ్ఛాపురంలోని (Ichchapuram) సురంగి వారి కోట నుంచి ఇటు శ్రీకూర్మంలోని కుడ్య చిత్రాల వరకు ఏ కథను వదలకుండా ‘ఇంటాక్’ సభ్యులు అందంగా గుదిగుచ్చిన బంతిపూల మాల. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి చరిత్రను, ప్రతి గాథను మనసారా ప్రేమించి ఆరారా అచ్చువేసిన ఓ పుస్తకమిది. పుస్తకమే కాదు ఆ ప్రయత్నం వెనుక ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. ఈ మట్టిపై, ఇక్కడి కథలపై, ఈ దారుల్లో దాగున్న అపురూప చరిత్రపై అమితమైన ఇష్టం. అంతే ఇష్టం మీకూ ఉంటే.. గ్రంథాలయంలోని ఈ పుస్తకాన్ని తిరగేయండి. పేజీలు ప్రియురాలిలా మారి చెప్పే ఊసులు వినండి. నెచ్చెలిలా చిత్రాలు వివరించే నులివెచ్చని జ్ఞాపకాలను ఆస్వాదించండి.
– శ్రీకాకుళం కల్చరల్
ఒక ప్రాంత చరిత్ర గుర్తుండాలంటే.. అక్కడి కథలు మళ్లీ మళ్లీ చెప్పుకోవాలి. ఆ ప్రాంత ప్రాశస్త్యం తెలియాలంటే.. ఆ గాథలు చరిత్రలో మిగిలిపోయే ప్రయత్నమేదో చేయాలి. అలాంటి ప్రయత్నమే ఇంటాక్ చేసింది. శ్రీకాకుళం జిల్లా చరిత్రను అందమైన పుస్తకంగా అచ్చు వేసి అందుబాటులో ఉంచింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు, కళాశాలలకు, గ్రంథాలయాలకు చేరే విధంగా చర్యలు తీసుకుంది. భారత జాతీయ సంస్కృతి కళ వారసత్వ సంపద పరిరక్షణ సంస్థ కేంద్ర సహకారంతో నడుస్తోంది. ఇక్కడి శాఖ జిల్లాపై ఉన్న ప్రేమతో సంస్కృతి, వారసత్వ సంపదను అందరికీ తెలియజేసేందుకు విశేష కృషి చేసింది.
దూసి ధర్మారావు జిల్లా శాఖ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చెస్తున్న మండా శ్రీనివాసరావు ఫొటోగ్రఫీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ‘శ్రీకాకుళం ఏ స్టోరీ ఆన్ స్టోన్’ (Srikakulam A story on stone) అనే పుస్తకం రూపొందించారు. అందులో జిల్లాలోని చారిత్రక స్థలాలు, కళలు, సంస్కృతి వారసత్వ సంపదలు, కవులు, గాయకులు, నటులు, పర్యాటక ప్రదేశాల గురించి నిక్షిప్తం చేశారు. అనంతరం కేవీజే రాధాప్రసాద్ కన్వీనర్‌గా ఉన్న సమయంలో విద్యార్థులకు మన సంస్కృతి వారసత్వాలను పరిచయం చేసే ప్రక్రియలో వారికి వ్యాసరచన పోటీలు, వారికి అక్కడి సందర్శింప చేసే కార్యక్రమం చేశారు.
సేకరణ, నిక్షిప్తీకరణ, నివేదన
స్థానికంగా ఉండే చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాలను ఎంచుకొని ఆ ప్రాంతానికి స్వయంగా వెళ్లి అక్కడి ప్రజల ద్వారా తెలుసుకున్న అంశాలతో పాటు చారిత్రక అంశాలను అధ్యయనం చేసి వాటిని రికార్డు చేసి రిపోర్టును కేంద్ర శాఖకు పంపుతారు. వారి సొంత ఖర్చులతో వెళ్లి విషయ సేకరణ చేస్తారు. ఇప్పటి వరకు 150 టూరిజం స్థలాలను, 100కు పైగా చారిత్రక స్థలాలను గుర్తించి పుస్తకంలో నిక్షిప్తం చేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. అలాగే హెరిటేజ్ ఫొటోగ్రఫీ ప్రదర్శనలో ప్రదర్శించగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. కోల్‌కతాలో కూడా ప్రదర్శించారు.
శ్రీకాకుళం నా ప్రేమనగర్
శ్రీకాకుళం కేవలం ఒక ఊరి పేరో, ఒక జిల్లా పేరో మాత్రమే కాదు. అభ్యుదయ సామాజికవాదుల ఊపిరి ఉత్తేజం నింపే ఆక్సిజన్. జీవనదుల నేల, ఖనిజాల గని, శ్రమమజీవుల తూర్పు ప్రాంతం. జిల్లా పేరు చెబితే ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు, వయోలిన్ విద్వాంసుడు వెంకటస్వామి నాయుడు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, ఆధునిక సాహిత్యానికి, కథ, నాటకం, ముత్యాల సరాలు అందించిన గురజాడ.. పెన్ను గన్ను పట్టిన పాణిగ్రహి గుర్తుకు వస్తారు. ప్రసిద్ధ ప్రజా కళాకారుడు వంగపండు వంటి వారికి .. ఇక్కడి సీమ కొండలు, సాలూరవతలి సువర్ల కొండలే కాక కత్తు లు దులపరించిన చిలకలు, పాముని యెంటదగిలి న చీమలు గుర్తొస్తాయి. శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం రా – వీర యోధులనే కన్న గడ్డ శ్రీకాకుళం రా... అందుకే శ్రీకాకుళం నా ప్రేమనగర్.
– అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ కథ, నవల రచయిత
ఇంటాక్ ద్వారా మూడు పుస్తకాలు
ఇంటాక్ తరఫున గుర్తించిన చారిత్రక ప్రదేశాలన్నింటితో ఒక పుస్తకాన్ని రూపొందించారు. ‘శ్రీకాకుళం... ఏ స్టోరీ ఆన్ స్టోన్ ’ పేరుతో పుస్తకాన్ని ఇప్పటికి మూడు సార్లు ముద్రించాం. కళింగ ఆంధ్ర చరిత్ర, స్టోరీ ఆన్ స్టోన్స్ శ్రీకాకుళం, జిల్లా చరిత్రపై బిట్స్‌తో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాం.
– వి.జగన్నాథం నాయుడు, అదనపు కన్వీనర్, ఇంటాక్ శాఖ
దూసి కోసం ప్రయత్నం
మహాత్మా గాంధీ అడుపెట్టిన దూసి రైల్వే స్టేషన్‌ను గాంధీ స్మారక స్థలిగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
– నూక సన్యాసిరావు, కన్వీనర్, ఇంటాక్ శ్రీకాకుళం శాఖ
విద్యార్థులకు పోటీలు
విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, చారిత్రక కట్టడాల వంటి వాటిపై జిల్లా స్థాయి, జోనల్ స్థాయిల్లో పోటీలు నిర్వహించి వారిలో చిన్నతనం నుంచి అవగాహన కల్పిస్తున్నాం.
– నటుకుల మోహన్, ఇంటాక్ కో కన్వీనర్
220 సమర్పణ పత్రాలు
చారిత్రక ప్రదేశాలతో ఇంటాక్ సమర్పణ పత్రాలు అందించాను. జిల్లాలో చారిత్రక నిర్మాణాల సంపద, తీరప్రాంత చారిత్రక సంపదతో కలిపి మొత్తం 220 ప్రదేశాలు ఉన్నట్లు గుర్తించాను. వీటిని అన్నింటిని రికార్డు చేసి ఈ పత్రాలను క్రమపద్ధతిలో ఇంటాక్ సంస్థకు రికార్డులు పంపించాం.
– మండా శ్రీనివాస్, ఇంటాక్ ఫొటోగ్రాఫర్
చరిత్ర తెలియాలని..
జిల్లా చరిత్ర విద్యార్థులకు తెలియాలని నేను కన్వీనర్‌గా ఉన్న సమయంలో పోటీలు నిర్వహించేవాళ్లం. ధర్మారావు కాలంలో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ల సాయంతో పునర్ముద్రణ చేసి యూనివర్సిటీలకు, గ్రంథాలయాలకు ఉచితంగా అందించాం.
– కేవీజే రాధా ప్రసాద్, పూర్వపు కన్వీనర్, ఇంటాక్
Comments
Please login to add a commentAdd a comment