ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం
మదనపల్లె అగ్ని ప్రమాదం కేసు పక్కదారి
వరుస సోదాలు, విచారణ పేరుతో వేధింపులు
90శాతం ఫైళ్లు రిట్రీవ్.. మరి కుట్ర కోణం ఏముంటుంది?
సాక్షి, అమరావతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబుకు రాజకీయంగా సవాల్‌గా మారిన చిరకాల రాజకీయ ప్రత్యరి్థ, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని మానసికంగా వేధించి క్షోభకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు పథకం వేసినట్లు వెల్లడవుతోంది.
ఈ క్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు తెర తీశారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌లను హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపడం ద్వారా తన ఉద్దేశాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని డీజీపీ అదే రోజు మదనపల్లెలో ఏకపక్షంగా ప్రకటించేశారు. అయితే ఎలా సంభవించిందన్నది వారం రోజులైనా చెప్పలేకపోవడం సందేహాస్పదంగా మారింది. సాధారణ పొరపాటుతోనో, నిర్లక్ష్యం కారణంగానో అగ్ని ప్రమాదం సంభవించినట్లు దర్యాప్తులో దాదాపుగా తేలినా ఆ విషయాన్ని వెల్లడిస్తే పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసు బనాయించడం సాధ్యం కాదని ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
బాబు చేతిలో కీలుబొమ్మ సిసోడియా...!
అగ్ని ప్రమాదం కేసును పెద్దిరెడ్డి కుటుంబానికి అంటగట్టడం సాధ్యం కాదని పోలీసులు తేల్చడంతో తీవ్ర అసహనానికి లోనైన సీఎం చంద్రబాబు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియాను రంగంలోకి దించారు. 22ఏ జాబితాలోని నిషేధిత భూముల వివరాలు, రెవెన్యూ శాఖ ఇతర ఫైళ్లు దగ్ధమైనట్లు నిర్ధారించి తదనుగుణంగా కుట్రకు పదును పెట్టాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం.
మరోవైపు కుట్ర కోణంలో రెండో అంకానికి తెర తీశారు. పెద్దిరెడ్డి కుటుంబం బాధితులంటూ టీడీపీ నేతలు ఎంపిక చేసిన వారితో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేయిస్తున్నారు. వీటిల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నది ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. కుటుంబ ఆస్తి వివాదాలు, కోర్టుల విచారణలో ఉన్న అంశాలపైనే ఫిర్యాదులు చేస్తున్నారు.
సోదాలు.. వేధింపులు
పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కనీస ఆధారాలు కూడా లభించకపోవడంతో చంద్రబాబు పోలీసులపై చిందులు తొక్కుతున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు వైఎస్సార్‌సీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులను సోదాల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసంలో కూడా సోదాలకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు కొద్ది రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
ఫైళ్లన్నీ భద్రం..
22ఏ జాబితాలోని ఫైళ్లు, ఇతర భూముల ఫైళ్లను గల్లంతు చేసేందుకే అగ్ని ప్రమాదం సృష్టించారని నమ్మించేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పథకం ఇప్పటికే బెడిసికొట్టింది. మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో 11 మండలాలున్నాయి. 22ఏ జాబితా, ఇతర భూముల ఫైళ్లు ఆయా మండలాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపుతారు. కలెక్టరేట్‌కు కూడా కాపీ పెడతారు. ఈ ప్రక్రియ దాదాపు ఆన్‌లైన్‌లోనే సాగింది.
హార్డ్ కాపీలు పంపినా సంబంధిత ఫైళ్ల కాపీలన్నీ కూడా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో భద్రంగా ఉన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లన్నీ భధ్రంగా ఉన్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియానే సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా నిర్థారించారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 2,440 ఫైళ్లు ఉన్నాయి. అగ్ని ప్రమాదం సంభవించగానే 740 ఫైళ్లు దగ్దం కాకుండా నివారించారు.
మిగిలిన 1,700 ఫైళ్లలో ఇప్పటికే 90 శాతం ఫైళ్లను రిట్రీవ్(పునరుద్ధరించారు) చేశారు. మిగిలిన 10శాతం ఫైళ్ల వివరాలను పరిశీలిస్తున్నారు. వాటిని కూడా రిట్రీవ్ చేస్తారు. కలెక్టరేట్‌తోపాటు సబ్ కలెక్టరేట్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ అన్ని ఫైళ్లు భద్రంగా ఉన్నాయి. ఫైళ్లు అన్నీ భద్రంగా ఉంటే ఇక అందులో కుట్ర కోణం ఎక్కడ ఉంది ?
Comments
Please login to add a commentAdd a comment