సాక్షి, శ్రీకాకుళం: మీరు ఎన్నో రకాల నాన్‌వెజ్ వంటకాలు తిని ఉంటారు. అయితే మడ్డువలస చేపల కూర రుచే వేరు. రిజర్వాయర్ ప్రాంతంలో మాత్రమే దొరికే అరుదైన చేపలు కావడం, తక్కువ ధరలో లభ్యమవడంతో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.
అన్నీ అరుదైనవే..
జిల్లాలో మడ్డువలస రిజర్వాయర్‌లో దొరికే చేపలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు పది వేల ఎకరాల విస్తీర్ణంలోని ఈ రిజర్వాయర్‌లో తిలాఫియా, ఎర్రమైలు, రాగండి, బంగారుపాప, రొయ్య, బొచ్చు వంటి అరుదైన రకాలు ఇక్కడ లభ్యమవుతాయి.
ధర ఎంతంటే..
ఒక్కో చేప బరువు కిలోకు పైగా బరువుంటుంది. కేజీ రూ.100 నుంచి రూ. 120 వరకు ధర పలుకుతుంది. తక్కువ ధర, తాజా చేపలు కావడంతో పరిసర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ.
పొరుగు ప్రాంతాలకు కూడా..
స్థానిక ప్రాంతాల్లోనే కాకుండా రాజాం, పాలకొండ, వీరఘట్టం, పొందూరు, చీపురుపల్లి, బలిజిపేట, బొబ్బిలి, పార్వతీపురం వంటి పట్టణాలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా, కలకత్తా రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నాయి. రిజర్వాయర్‌లో చేపల వేట ఆధారంగా సుమారు 754 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
అంతర్జాతీయ గుర్తింపు..
రిజర్వాయర్‌లో కేజ్ కల్చర్‌లో పెంపకం చేస్తున్న తిలాఫియా చేపలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఏటా లక్షలాది రూపాయల చేపలను ఎగుమతి చేపడుతుంటారు. ఈ చేపల వంటకాలకు హోటళ్లలో మంచి గిరాకీ ఉంది. విందు భోజనాలకు పెద్దఎత్తున ఆర్డర్లు వస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment