Madduvalasa Project
-
మడ్డువలస చేప.. ఆ రుచే వేరప్పా!
సాక్షి, శ్రీకాకుళం: మీరు ఎన్నో రకాల నాన్‌వెజ్ వంటకాలు తిని ఉంటారు. అయితే మడ్డువలస చేపల కూర రుచే వేరు. రిజర్వాయర్ ప్రాంతంలో మాత్రమే దొరికే అరుదైన చేపలు కావడం, తక్కువ ధరలో లభ్యమవడంతో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. అన్నీ అరుదైనవే.. జిల్లాలో మడ్డువలస రిజర్వాయర్‌లో దొరికే చేపలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు పది వేల ఎకరాల విస్తీర్ణంలోని ఈ రిజర్వాయర్‌లో తిలాఫియా, ఎర్రమైలు, రాగండి, బంగారుపాప, రొయ్య, బొచ్చు వంటి అరుదైన రకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ధర ఎంతంటే.. ఒక్కో చేప బరువు కిలోకు పైగా బరువుంటుంది. కేజీ రూ.100 నుంచి రూ. 120 వరకు ధర పలుకుతుంది. తక్కువ ధర, తాజా చేపలు కావడంతో పరిసర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ. పొరుగు ప్రాంతాలకు కూడా.. స్థానిక ప్రాంతాల్లోనే కాకుండా రాజాం, పాలకొండ, వీరఘట్టం, పొందూరు, చీపురుపల్లి, బలిజిపేట, బొబ్బిలి, పార్వతీపురం వంటి పట్టణాలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా, కలకత్తా రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నాయి. రిజర్వాయర్‌లో చేపల వేట ఆధారంగా సుమారు 754 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు.. రిజర్వాయర్‌లో కేజ్ కల్చర్‌లో పెంపకం చేస్తున్న తిలాఫియా చేపలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఏటా లక్షలాది రూపాయల చేపలను ఎగుమతి చేపడుతుంటారు. ఈ చేపల వంటకాలకు హోటళ్లలో మంచి గిరాకీ ఉంది. విందు భోజనాలకు పెద్దఎత్తున ఆర్డర్లు వస్తుంటాయి. -
దయనీయం.. కళావిహీనం!
తలమానికంగా నిలవాల్సిన ప్రాజెక్టు కళావిహీనమైంది.. పది వేల ఎకరాల్లో రూ.100 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించారు.. తొలి దశలో 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించారు.. రెండో దశ పూర్తయితే మరో 12,500 ఎకరాలు సస్యశ్యామలం కావాల్సివుంది. కానీ మడ్డువలస ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది. గత ప్రభుత్వ వైఫల్యం... అధికారుల నిర్లక్ష్యం ప్రాజెక్టును పీడిస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే రెండో దశకు ఆమోదం పలికినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అరకొర నిధులు మంజూరు చేయడంతో కార్యరూపం దాల్చలేదు. కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ సైతం సరిగా లేకపోవడంతో పథకం పరిస్థితి దయనీయంగా మిగిలింది. మడ్డువలస ప్రాజెక్టు స్థితిగతులపై సాక్షి ఫోకస్.. వంగర: నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మిగిలిన మడ్డువలస ప్రాజెక్టు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ముఖద్వారం నుంచి హెడ్ భాగం వరకు అన్నీ సమస్యలే. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన ముఖద్వారం నిర్మాణం అర్ధంతరంగా వదిలేశారు. అక్కడ నుంచి వెళ్లే రాళ్లదారి అధ్వానంగా తయారైంది. డైక్ భాగమంతా బురదమయంగా ఉంది. ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉండగా ఎటువంటి చర్యలు లేక ఈ పరిస్థితి దాపరించింది. పలు చోట్ల రాతి రివిట్మెంట్ దిగజారినప్పటికీ మెరుగుపరిచేందుకు అధికారుల చర్యలు శూన్యం. ప్రాజెక్టు జనరేటర్లు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ నేలపై ప్రమాదకరంగా ఉంది. వైర్లపై అడుగుపడితే ప్రాణాపాయమే. నీటినిల్వను కొలిచే ప్రదేశంలో ఉన్న దిమ్మలు, బోర్డులు శిథిలమయ్యాయి. బకేట్ పోర్షన్‌కు వెళ్లే ప్రదేశంలో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ పాపం.. చంద్రబాబు హయాంలో (2014–2019) మూడుసార్లు రూ.9 కోట్లు మంజూరు కాగా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మూడు నెలలకే రూ.9.50 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో దీనినిబట్టి అర్థమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండో దశలో భాగంగా ఆధునికీకరణ పనుల ఫైలుకు ఆమోదం పలికారు. అనంతరం 2011లో సీఎం రోశయ్య రూ.47 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఒకసారి రూ.11 కోట్లు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మ రో రూ.14 కోట్లు కేటాయించారు. చంద్రబాబు సీఎం అయ్యాక నిధుల కేటాయింపు లేక పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆధునీకరణ నిధుల్లో భాగంగా ప్రాజెక్టు హెడ్ భాగంలో అత్యవసర గేట్లు, గేట్లు, హెడ్ స్లూయీస్‌ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా ఆ ఛాయలే లేవు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్వాసితులుగా మిగిలిన ఏడు గ్రామాల వారికి వైఎస్సార్ రూ.27 కోట్లు మంజూరు చేసి వారికి అండగా నిలిచారు. అనంతరం ఈ ప్రాజెక్టుకు జనరేటర్లు, డీజిల్ కొనుగోలు, పిచ్చిమొక్కలు తొలగింపునకు ప్రతి ఏటా వేలల్లో మాత్రమే మంజూరు చేశారు తప్ప శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు. అత్యంత ప్రధాన సమస్యలు ఇవీ.. చిన్నపాటి రైస్‌మిల్లు నిర్మిస్తే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుంది. జిల్లాలో 9 మండలాల్లో 37,285 ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుకు మాత్రం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేదు. ప్రతీ రోజు నాలుగు గంటలు మాత్రమే త్రీఫేజ్, మిగతా సమయం 2 ఫేజ్ మాత్రమే ఉంటుంది. వరదలు అధికంగా ఉండేటప్పుడు గేట్లు ఎత్తాలంటే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అవసరం. ప్రత్యామ్నాయంగా రెండు జనరేటర్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి పాడై మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది. ఉన్న ఒకటి పాడైతే వరదల సమయంలో పరిస్థితి ఏమిటిః ఇటువంటి ప్రధాన సమస్యపై దృష్టి పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రజలు, రైతులు అధికారులను హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నైట్‌వాచ్‌మెన్, లస్కర్లు లేకపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు, విద్యార్థులను అదుపు చేసే నాథులు కరువవుతున్నారు. సిబ్బంది పహరా లేకపోవడంతో ప్రాజెక్టు ఆవరణలో బకెట్ పోర్షన్లో దిగి గడిచిన పదేళ్లలో 8 మంది విద్యార్థులు, యువకులు మృత్యువాత పడ్డారు. మరమ్మతులు కరువు.. ప్రధానంగా ప్రాజెక్టు బకేట్ పోర్షన్లో ఉన్న 11 గేట్లలో మూడు గేట్లు పాడయ్యాయి. టీడీపీ హయాంలో రూ.13 లక్షల నీరు–చెట్టు నిధులతో గేట్లను తూతూమంత్రంగా సరిచేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత గేట్లకు మళ్లీ లీకులు ప్రారంభమయ్యాయి. గేట్లను ఆనుకొని ఉన్న 24 రోప్‌లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సాగునీరు వృథా అవుతోంది. ఇది మినహా ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. నదిని ఆనుకొని రివిట్మెంట్, రక్షణ గోడ పూర్తిగా శిథిలమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వరదలు సమయంలో ఇవి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాల్సిన అత్యవసర గేట్ల మెటీరియల్ ఇక్కడే వృథాగా పడి ఉంది. పర్యాటక శోభకు నోచుకోని మడ్డువలస... మడ్డువలస ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గత పాలకులు హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. పర్యాటక కేంద్రం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలం కూడా కళావిహీనంగా ఉంది. పార్కు నిర్మించి, బోటు షికారు ఏర్పాటు చేస్తే పర్యాటకులు తాకిడి అధికమవుతుంది. అదే విధంగా ఈ ప్రాంతానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న త్రివేణి సంగమం, పవిత్ర సంగమేశ్వరస్వామి దేవాలయాలను వీక్షించవచ్చు. తద్వారా అభివృద్ధి చెందవచ్చు. అధికారులు రారు.. సిబ్బంది లేరు.. వర్షాలు, వరదల సమయంలో మినహా ప్రాజెక్టు వద్ద అధికారులు కనిపించరు. ఇంజినీర్లు రా జాంలోని కార్యాలయంలో ముఖం చూపించి వెళ్లిపోతుంటారు. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మడ్డువలస ప్రాజెక్టుకు అధి కారులు, లస్కర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్ మొత్తం 51 మంది ఉండాలి. ప్రస్తుతం ఒక ఈఈ, ఒక డీఈ, నలుగురు జేఈలు, ఒక లస్కరు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక జేఈ, లస్కర్లు 27మంది, ఎలక్ట్రీషియన్లు ఇద్దరు, ఫిట్టర్లు ముగ్గురు, వాచ్మెన్లు ముగ్గురు, హెల్ప ర్లు ఎనిమిది మంది ఇంకా అవసరం ఉంది. ప్రాజెక్టు హెడ్ వద్ద ఒక లస్కర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆశలు ఫలిస్తాయని రైతుల ఆకాంక్ష.. గత ప్రభుత్వాలు మడ్డువలసను పట్టించుకోకపోవడంతో అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో మడ్డువలస అభివృద్ధికి సీఎం బాటలు వేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన నిధులు, సిబ్బంది కొరత, గేట్లు మరమ్మతులు వంటి సమస్యలపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి జనరేటర్ల మరమ్మతులు, డీజిల్ కొనుగోళ్లు మినహా నిర్వహణ (మెయింటినెన్స్) కోసం నిధులు మంజూరు అవడంలేదు. ప్రస్తుతం పంపించిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరైతే సమస్యలు పరిష్కరిస్తాం. –నర్మదా పట్నాయక్, డీఈ, మడ్డువలస అంధకారంలో ప్రాజెక్టు.. మడ్డువలస ప్రాజెక్టు రాత్రి సమయంలో అంధకారంలో ఉంటుంది. ఇక్కడ 34 విద్యు త్ స్తంభాలున్నాయి. వీటికి అమర్చిన ఎల్ఈడీ బల్బులు ఏడాది క్రితమే పాడవ్వడంతో ప్రాజెక్టు అంధకారంలో ఉంది. వరదలు, తుఫానులు సమయమిది. ఇటువంటి సమయంలో ప్రాజెక్టు వద్ద అంధకారంలో ఉండడంతో రాత్రి సమయంలో రీడింగ్ బోర్డులు కనిపించక వరదలను గుర్తించలేని పరిస్థితి. ఇక్కడ కొన్ని విద్యుత్ స్తంభాలు బల్బులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. -
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
మడ్డువలస జలాశయం మరో విషాదానికి వేదికైంది. ఇద్దరు యువకులను మింగేసి తల్లిదండ్రుల కన్నీటికి కారణమైంది. కన్నవారు పెట్టుకున్న ఆశలను సమాధి చేస్తూ వారి కొడుకులను పొట్టన పెట్టుకుంది. రాజాంలోని జీఎంఆర్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్‌తేజ్ (19), విజయనగరం జిల్లా కేంద్రం బాబామెట్టకు చెందిన మల్లెల సాయితరుణ్(19) రిజర్వాయర్‌లోని బకెట్ పోర్షన్లో గల్లంతై.. శవాలుగా తేలారు. కలిసిమెలిసి తిరిగే అలవాటున్న ఈ స్నేహితులు చావును కూడా కలిసే ఆహ్వానించారు. ఈ సంఘటన వారి తల్లిదండ్రులను.. స్నేహితులను విషాదంలోకి నెట్టింది. రాజాం/వంగర: శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్తేజ్తో పాటు విజయనగరం పట్టణం బాబామెట్టకు చెందిన మల్లెల సాయితరుణ్ మృతితో మడ్డువలస జలాశయం వద్ద తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వీరిద్దరూ శుక్రవారం విహారానికి వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్ వద్దకు బైక్‌పై వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే రాత్రయినా ఇళ్లకు రాకపోవడంతో వీరి తల్లిదండ్రులు కళాశాలకు ఫోన్ చేసి ఆరా తీశారు. అలాగే వారి స్నేహితులకు కూడా ఫోన్లు చేసి అడిగి తెలుసుకున్నారు. అయితే వీరెక్కడకు వెళ్లారన్నది ఎవరికీ తెలియకపోవడంతో అదే రోజు రాత్రి రాజాం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో రామ్‌తేజ్, సాయితరుణ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అలాగే వీరు తీసుకెళ్లిన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కుటుంబీకులు ఆరాతీశారు. తమ బిడ్డలకు ఏం కాకూడదని, క్షేమంగా ఉండాలని దేవుళ్లకు మొక్కుకున్నారు. శుక్రవారం రాత్రంతా నిద్రాహారాలు మాని పిల్లల గురించే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అయితే వీరి సెల్ ఫోన్ సిమ్ కార్డు సిగ్నల్ మడ్డువలస వరకూ వచ్చి నిలిచిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో శనివారం ఉదయం మడ్డువలస ప్రాజెక్టు వద్దకు ఇద్దరు విద్యార్థుల కుటుంబీకులు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద బైక్ ఉండడంతో ఆందోళన చెందారు. సెల్ఫీ కోసం నీటిలో దిగి అక్కడ బకెట్ పోర్షన్ వద్ద ప్రమాదానికి గురై ఉంటారని ప్రాజెక్ట్ వద్ద ఉన్నవారు, పోలీసులు అనుమానం వ్యక్తం చేసి వెతుకులాట ప్రారంభించారు. రెండు మృతదేహాలు ఒకేచోట.. రాజాం సీఐ ఎం.వీరకుమార్ ఆధ్వర్యంలో మడ్డువలస శ్రీ సీతారామ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు బకెట్ పోర్షన్లో వలలు వేసి గాలించడం ప్రారంభించారు. ఇంతలోనే విజయనగరం పట్టణానికి చెందిన మల్లెల సాయితరుణ్ మృతదేహం వలకు చిక్కడంతో బయటకు తెచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాదం అలుముకుంది. కొడుకు మృతదేహాన్ని చూసి సాయితరుణ్ తల్లిదండ్రులు çమాధవి, ఫణీంద్రకుమార్‌లు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం కావడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరో అరగంట తరువాత అదే ప్రాంతంలో రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్‌తేజ్ మృతదేహం లభించింది. శవాన్ని వెలికితీయగానే తల్లిదండ్రులు ఉరిటి లక్ష్మీచందన, జగదీష్‌లు బోరున విలపించారు. రెండు మృతదేహాలు ఒకేచోట లభించడంతో ఇద్దరూ ఒకేసారి ప్రమాదానికి గురై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ వారసులే.. మడ్డువలస ప్రాజెక్ట్‌లో మునిగి చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఆయా కుటుంబాలకు వారసులే. దీంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది విజయనగరం బాబామెట్టకు చెందిన ఫణీంద్రకుమార్, మాధవిలకు సాయితరుణ్ ఒక్క డే కుమారుడు. ఓ కుమార్తె వీరికి ఉంది. ఫణీంద్రకుమార్ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, తల్లి మాధవి ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తికాగానే సాయితరుణ్ను సివిల్స్‌కు పంపిద్దామని తల్లిదండ్రుల ఆలోచన. ఇంతలోనే విధి వక్రీకరించి ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. రాజాం పట్టణానికి చెందిన ఉరిటి జగదీష్‌కుమార్, రాధిక ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఈ దంపతులకు కూడా రామ్‌తేజ్ ఒక్కడే మగ సంతానం. ఒక కుమార్తె ఉంది. జగదీష్‌కుమార్ రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండగా, రాధిక గృహిణి. వీరు ఎంతో ప్రేమగా రామ్తేజ్ను సాకుతూ వస్తున్నారు. ఎటువంటి కష్టం ఉండకూడదని దగ్గర్లో ఉంటాదనే ఉద్దేశంతో జీఎంఆర్‌ఐటీలో చేర్పించారు. బాగా చదివి ఉద్యోగం చేసి ఇంటికి చేదోడువాడోదుగా ఉంటాడని ఆశించిన వారి ఆశలు గల్లంతయ్యాయి. -
స్వల్పంగా పెరిగిన మడ్డువలస
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం స్వల్పంగా పెరిగింది. సువర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులోకి 7 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 63.80 మీటర్ల లెవెల్ నీటిమట్టం నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద మూడుగేట్లు ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్టు డీఈ జి.పద్మజ తెలిపారు. -
మడ్డువలస గేట్లు ఎత్తివేత
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం నాలుగుగేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీటిప్రవాహం భారీగా పెరిగింది. దీంతో 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.25 మీటర్ల లెవెల్ నీటిమట్టం నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద నాలుగే గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నామని డీఈ జి.పద్మజ సాక్షికి తెలిపారు. వరద ఉద్ధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని మళ్లిస్తామని ఆమె తెలిపారు. -
మడ్డువలస ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
వంగర(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టు గేట్లను బుధవారం సాయంత్రం మరింత ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వేగావతి, సువర్ణముఖి నదులపై ఉన్న ఈ ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండిపోయింది. మంగళవారం ప్రాజెక్టుకు ఉన్న 11 గేట్లలో నాలుగింటిని ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బుధవారం అదే నాలుగు గేట్లను మరో రెండు మీటర్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
మడ్డువలస ఇంకిపోయింది !
వంగర : మడ్డువలస ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పేటట్టు లేదు. వర్షాలు లేకపోవడం, పై నుంచి కూడా నీరు రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా అడుగంటాయి. ఇన్‌ఫ్లో పూర్తిగా లేకపోవడంతో ప్రాజెక్టులో నీటినిల్వ డెడ్‌స్టోరేజీకి చేరువలోకి వచ్చింది. ఉన్నతాధికారులు సాగునీటి నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు, రైతులు బాహాటంగానే చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టులో భారీగా నీటినిల్వ తగ్గిపోయింది. దాదాపు డెడ్‌స్టోరేజీకి ఒక అడుగు దూరంలో ఉన్నట్లే చెప్పక తప్పదు. గత నెల 12వ తేదీన మడ్డువలస కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీటి విడుదల చేపట్టారు. అయితే ఆ సమయానికే కేవలం 63.20 మీటర్ల లెవెల్ నీటిమట్టం ఉండేది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో బకేట్పోర్షన్ వద్ద 62.70 మీటర్ల లెవెల్‌కు దిగజారింది. అయితే ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ అధికారికంగా 58.80 మీటర్లుగా రికార్డులు చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. గేట్ల ప్రాంగణం, నీటినిల్వ సూచించే ప్రదేశం, కుడి, ఎడమ కాలువల హెడ్స్లూయీస్ల ప్రదేశంలో భారీగా మట్టి పేరుకుపోవడంతో 61.80 మీటర్ల వరకు నిల్వ ఉంటేనే నీటిని సరఫరా చేయగలమని, లేకపోతే ఒక్క చుక్క కూడా కిందకు వెళ్లే ప్రసక్తి లేదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న నీటిమట్టానికి, అధికారులు చెబుతున్న లెక్కలకు ఒక్క మీటరు దూరంలో డెడ్‌స్టోరేజి ఉంది. మరో పది రోజులుపాటు వర్షాలు లేకపోతే ఆ తరువాత నుంచి మడ్డువలస నుంచి ఆయకట్టుకు చుక్క నీటిని కూడా విడిచిపెట్టే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. సాగునీరు ప్రశ్నార్థకమే వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ లేక వెలవెలబోయింది. కుడి ప్రధాన కాలువ ఆయకట్టు పరిధిలో రేగిడి, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, లావేరు తదితర మండలాల పరిధిలో 29,800 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండున్న మీటర్ల వెనుక న నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ సమయానికి 64.10 మీటర్లు లెవెల్ ఉండేది. 24,700 ఎకరాలకు సాగునీటి సరఫరా చేసేవారు. ప్రస్తుతం మరో ఐదువేల ఎకరాల అదనపు ఆయకట్టుకు ఈ ఏడాది సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతీ ఏటా అధికారులరు 64 మీటర్లు లెవెల్‌ను స్థిరీకరించి నీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది మాత్రం అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ప్రణాళిక బద్ధంగా నీటిని నిల్వ చేసుకోలేకపోయారు.