మడ్డువలస జలాశయం మరో విషాదానికి వేదికైంది. ఇద్దరు యువకులను మింగేసి తల్లిదండ్రుల కన్నీటికి కారణమైంది. కన్నవారు పెట్టుకున్న ఆశలను సమాధి చేస్తూ వారి కొడుకులను పొట్టన పెట్టుకుంది. రాజాంలోని జీఎంఆర్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్‌తేజ్ (19), విజయనగరం జిల్లా కేంద్రం బాబామెట్టకు చెందిన మల్లెల సాయితరుణ్(19) రిజర్వాయర్‌లోని బకెట్ పోర్షన్‌లో గల్లంతై.. శవాలుగా తేలారు. కలిసిమెలిసి తిరిగే అలవాటున్న ఈ స్నేహితులు చావును కూడా కలిసే ఆహ్వానించారు. ఈ సంఘటన వారి తల్లిదండ్రులను.. స్నేహితులను విషాదంలోకి నెట్టింది.
రాజాం/వంగర: శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్‌తేజ్‌తో పాటు విజయనగరం పట్టణం బాబామెట్టకు చెందిన మల్లెల సాయితరుణ్ మృతితో మడ్డువలస జలాశయం వద్ద తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వీరిద్దరూ శుక్రవారం విహారానికి వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్ వద్దకు బైక్‌పై వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే రాత్రయినా ఇళ్లకు రాకపోవడంతో వీరి తల్లిదండ్రులు కళాశాలకు ఫోన్ చేసి ఆరా తీశారు. అలాగే వారి స్నేహితులకు కూడా ఫోన్లు చేసి అడిగి తెలుసుకున్నారు. అయితే వీరెక్కడకు వెళ్లారన్నది ఎవరికీ తెలియకపోవడంతో అదే రోజు రాత్రి రాజాం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో రామ్‌తేజ్, సాయితరుణ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
అలాగే వీరు తీసుకెళ్లిన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కుటుంబీకులు ఆరాతీశారు. తమ బిడ్డలకు ఏం కాకూడదని, క్షేమంగా ఉండాలని దేవుళ్లకు మొక్కుకున్నారు. శుక్రవారం రాత్రంతా నిద్రాహారాలు మాని పిల్లల గురించే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అయితే వీరి సెల్ ఫోన్ సిమ్ కార్డు సిగ్నల్ మడ్డువలస వరకూ వచ్చి నిలిచిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో శనివారం ఉదయం మడ్డువలస ప్రాజెక్టు వద్దకు ఇద్దరు విద్యార్థుల కుటుంబీకులు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద బైక్ ఉండడంతో ఆందోళన చెందారు. సెల్ఫీ కోసం నీటిలో దిగి అక్కడ బకెట్ పోర్షన్ వద్ద ప్రమాదానికి గురై ఉంటారని ప్రాజెక్ట్ వద్ద ఉన్నవారు, పోలీసులు అనుమానం వ్యక్తం చేసి వెతుకులాట ప్రారంభించారు.
రెండు మృతదేహాలు ఒకేచోట..
రాజాం సీఐ ఎం.వీరకుమార్ ఆధ్వర్యంలో మడ్డువలస శ్రీ సీతారామ ఫిషర్‌మెన్ సొసైటీ సభ్యులు బకెట్ పోర్షన్‌లో వలలు వేసి గాలించడం ప్రారంభించారు. ఇంతలోనే విజయనగరం పట్టణానికి చెందిన మల్లెల సాయితరుణ్ మృతదేహం వలకు చిక్కడంతో బయటకు తెచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాదం అలుముకుంది. కొడుకు మృతదేహాన్ని చూసి సాయితరుణ్ తల్లిదండ్రులు çమాధవి, ఫణీంద్రకుమార్‌లు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం కావడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరో అరగంట తరువాత అదే ప్రాంతంలో రాజాం పట్టణానికి చెందిన ఉరిటి రామ్‌తేజ్ మృతదేహం లభించింది. శవాన్ని వెలికితీయగానే తల్లిదండ్రులు ఉరిటి లక్ష్మీచందన, జగదీష్‌లు బోరున విలపించారు. రెండు మృతదేహాలు ఒకేచోట లభించడంతో ఇద్దరూ ఒకేసారి ప్రమాదానికి గురై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇద్దరూ వారసులే..
మడ్డువలస ప్రాజెక్ట్‌లో మునిగి చనిపోయిన ఇద్దరు విద్యార్థులు ఆయా కుటుంబాలకు వారసులే. దీంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది విజయనగరం బాబామెట్టకు చెందిన ఫణీంద్రకుమార్, మాధవిలకు సాయితరుణ్ ఒక్క డే కుమారుడు. ఓ కుమార్తె వీరికి ఉంది. ఫణీంద్రకుమార్ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, తల్లి మాధవి ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తికాగానే సాయితరుణ్‌ను సివిల్స్‌కు పంపిద్దామని తల్లిదండ్రుల ఆలోచన. ఇంతలోనే విధి వక్రీకరించి ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది.
రాజాం పట్టణానికి చెందిన ఉరిటి జగదీష్‌కుమార్, రాధిక ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఈ దంపతులకు కూడా రామ్‌తేజ్ ఒక్కడే మగ సంతానం. ఒక కుమార్తె ఉంది. జగదీష్‌కుమార్ రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండగా, రాధిక గృహిణి. వీరు ఎంతో ప్రేమగా రామ్‌తేజ్‌ను సాకుతూ వస్తున్నారు. ఎటువంటి కష్టం ఉండకూడదని దగ్గర్లో ఉంటాదనే ఉద్దేశంతో జీఎంఆర్‌ఐటీలో చేర్పించారు. బాగా చదివి ఉద్యోగం చేసి ఇంటికి చేదోడువాడోదుగా ఉంటాడని ఆశించిన వారి ఆశలు గల్లంతయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment