వంగర : మడ్డువలస ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పేటట్టు లేదు. వర్షాలు లేకపోవడం, పై నుంచి కూడా నీరు రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా అడుగంటాయి. ఇన్‌ఫ్లో పూర్తిగా లేకపోవడంతో ప్రాజెక్టులో నీటినిల్వ డెడ్‌స్టోరేజీకి చేరువలోకి వచ్చింది. ఉన్నతాధికారులు సాగునీటి నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు, రైతులు బాహాటంగానే చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టులో భారీగా నీటినిల్వ తగ్గిపోయింది. దాదాపు డెడ్‌స్టోరేజీకి ఒక అడుగు దూరంలో ఉన్నట్లే చెప్పక తప్పదు. గత నెల 12వ తేదీన మడ్డువలస కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీటి విడుదల చేపట్టారు.
అయితే ఆ సమయానికే కేవలం 63.20 మీటర్ల లెవెల్ నీటిమట్టం ఉండేది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో బకేట్‌పోర్షన్ వద్ద 62.70 మీటర్ల లెవెల్‌కు దిగజారింది. అయితే ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ అధికారికంగా 58.80 మీటర్లుగా రికార్డులు చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. గేట్ల ప్రాంగణం, నీటినిల్వ సూచించే ప్రదేశం, కుడి, ఎడమ కాలువల హెడ్‌స్లూయీస్‌ల ప్రదేశంలో భారీగా మట్టి పేరుకుపోవడంతో 61.80 మీటర్ల వరకు నిల్వ ఉంటేనే నీటిని సరఫరా చేయగలమని, లేకపోతే ఒక్క చుక్క కూడా కిందకు వెళ్లే ప్రసక్తి లేదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న నీటిమట్టానికి, అధికారులు చెబుతున్న లెక్కలకు ఒక్క మీటరు దూరంలో డెడ్‌స్టోరేజి ఉంది. మరో పది రోజులుపాటు వర్షాలు లేకపోతే ఆ తరువాత నుంచి మడ్డువలస నుంచి ఆయకట్టుకు చుక్క నీటిని కూడా విడిచిపెట్టే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
సాగునీరు ప్రశ్నార్థకమే
వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ లేక వెలవెలబోయింది. కుడి ప్రధాన కాలువ ఆయకట్టు పరిధిలో రేగిడి, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, లావేరు తదితర మండలాల పరిధిలో 29,800 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండున్న మీటర్ల వెనుక న నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ సమయానికి 64.10 మీటర్లు లెవెల్ ఉండేది. 24,700 ఎకరాలకు సాగునీటి సరఫరా చేసేవారు. ప్రస్తుతం మరో ఐదువేల ఎకరాల అదనపు ఆయకట్టుకు ఈ ఏడాది సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతీ ఏటా అధికారులరు 64 మీటర్లు లెవెల్‌ను స్థిరీకరించి నీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది మాత్రం అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ప్రణాళిక బద్ధంగా నీటిని నిల్వ చేసుకోలేకపోయారు.
మడ్డువలస ఇంకిపోయింది !
Published Fri, Aug 7 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement