
ఒరేయ్ గుంటల్లారా శివరాత్రికి గుంప సోమేశ్వరాలయానికి వెళ్తారు గావాలా... జాగర్త యేరు జోరుగా పారతంది .. గుమ్ములు.. గోతులు ఉంతాయి ... ఎక్కడబడితే అక్కడ దిగకండి.. జాగర్తగా చూసుకుని ఎల్లండి.. మళ్ళా రాత్రివరకు ఉండకండి.. గమ్మున సెనగలు ఖజ్జూరం కొనుకుని వచ్చియండి. మళ్ళా రేపు వెల్దురు లెండి.. అంటూ అమ్మమ్మ చెప్పిన జాగర్తలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయ్.
అవును విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఏజన్సీ ప్రాంతంలో నాగావళి,. జంఝావతి నదుల సంగమ ప్రాంతంలో ఉన్న ఈ సోమేశ్వరాలయం ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించాడని అంటారు. ఆయన తన నాగలితో ఒక చారికను గీయగా ఏర్పడిందే నాగావళి అని, అదే సమయంలో శివ లింగాన్ని కూడా బలరాముడే ప్రతిష్టించాడని స్థలపురాణం చెబుతోంది.
ఒడిశా.. శ్రీకాకుళం.. పార్వతీపురం ప్రాంతాలనుంచి వచ్చే వేలాదిమంది భక్తులతో శివరాత్రి నాడు సోమేశ్వర ఆలయం కిక్కరిసిపోతుంది. పిల్లాపెద్దా ముందురోజే.. అంటే జాగరణ రోజే ఎడ్లబళ్ళమీద నాగావళీ తీరానికి చేరడం.. సమీప తోటల్లో బస చేసి.. అక్కడే వండుకుని తిని.. ఆరోజు నాగావళి ఇసుక తిన్నెలమీద వేసే పౌరాణిక.. జానపద నాటకాలు డ్రామాలో చూసి తెల్లారుతూనే రెండునదుల సంగమం వద్ద మూడు మునకలేసి సోమేశ్వరుడిని దర్శించుకోవడం గొప్ప అనుభూతి.
శివరాత్రి రోజు పగలంతా అక్కడే ఇసుక తిన్నెల్లో తిరగడం.. ఒళ్ళు వేడెక్కగానే బుడుంగున మళ్ళీ నీటిలో మునగడం.. ఆలయం వద్ద ఇచ్చే ప్రసాదాలు తినడం. ఆడుకోవడం ఇదే.. ఇక పొద్దల్లా శివయ్య సన్నిధిలోనే గడిచిపోయేది.. ఎంత పుణ్యం. ఎంత మోక్షం వచ్చిందో లెక్క తెలీదు.. అవును బాల్యం అంటేనే పుణ్యం.. ఆకాలం అంతా పుణ్యకాలమే.. ఎక్కడా పాపం అంటని పనులు.. ఎప్పుడూ అబద్ధం చెప్పని నోరు.. ఏరా నీకు ప్రసాదం ఇందాకే ఇచ్చాను కదా అని పూజారి అంటే.. కాదని అనడం రాక.. అవును ఇచ్చారు కానీ మళ్ళీ ఇవ్వండి అనేంత అమాయకత్వం..

శివయ్య పండగ అంటే ముల్లోకాలకూ సంబరం.. అందులోనూ బాల్యంలో ఉన్న మాలాంటి పిల్లిబిత్తిరిగుంటలకు మరింత సంబరం... అలా యేటి గట్టుపై కూర్చుని వచ్చిపోయే పిచ్చికలను చూడడం.. నీటిలో జలకాలాడే చేపలను ఉత్తచేత్తో పట్టుకోవాలని ఆరాటపడడం. అవి చేతికి దొరికినట్లే దొరికి చేతిలోంచి జారిపోవడం.. ఒక అద్భుత అనుభవం.. కానీ అంతెత్తున ఎగిరే కింగ్ ఫిషర్ మాత్రం క్షణాల్లో డైవ్ చేసి నా కళ్ళముందే పెద్ద పెద్ద పరిగెలను ఎత్తుకెళ్ళడం చూసి సంభ్రమాశ్చర్యానికి లోనవడం.. డొంక దారిన శివాలయానికి అని వచ్చే కొన్ని యువ జంటలు మార్గమధ్యంలో పరాచికాలు ఆడడం.. అవన్నీ మా పిల్లగుంటల కంటబడటం కూడా ఓ జ్ఞాపకం. అమ్మమ్మ ఇచ్చిన ఐదు రూపాయల్లో అంతా లాటరీలు.. గుండాటలో పోగొట్టకుండా జాగ్రత్త చేసుకుని .. కొంత ఖర్చుకు పోను.. ఇంటికి వెళ్ళేటపుడు సెనగలు. ఖర్జూరం పట్టుకెళ్ళడం మనం సాధించిన ఘనవిజయమే.. అందుకే అంటారు బాల్యం బంగారం అని.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment