సాక్షి, అమరావతి: కిరాయి ప్రాతిపదికన ఆటోలు నడుపుకొంటున్న పొదుపు సంఘాల సభ్యులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం గురువారం ‘మహిళాశక్తి’ పేరుతో ఆటోలను పంపిణీ చేయనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మండలాల్లో 660 మందికి ఈ ఆటోలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలివిడతగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 231 మందికి వీటిని అందజేయనున్నారు.
జిల్లాల వారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆ జిల్లాల్లోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. గ్రా మీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్ విజ యవాడకు సమీపంలోని గొల్లపూడిలోగల టీటీడీసీ కేంద్రంలో పదిమంది లబ్ధిదారులకు ఆటోలను పంపిణీ చేస్తారని తెలిపారు.
మహిళాసాధికారత లక్ష్యంగా నాలుగున్నరేళ్లుగా పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను, 45–60 ఏళ్ల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత సహా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా స్వశక్తితో ఎదగాలని ఆశపడే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు ‘మహిళాశక్తి’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యం మేరకు మిగిలిన లబ్ధిదారుల ఎంపికను ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాటికి పూర్తిచేసి వారికి ఆటోలు అందజేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
లబ్ధిదారులు భరించాల్సింది 10 శాతమే
ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కేవలం పదిశాతం మేర లబ్ధిదారులు భరిస్తే మిగిలిన 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సెర్ప్ ద్వారా అందిస్తోంది. ఆ 90 శాతం రుణాన్ని కేవలం అసలు మొత్తం 48 నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. సాధారణంగా పేదలు ఆటో కొనుగోలు చేయాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల నుంచి రుణం తీసుకుని, నెలవారీగా కిస్తీలు చెల్లి స్తుంటారు.
ప్రభుత్వం ఇప్పడు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోల కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వడంతో పాటు రుణం మొత్తాన్ని నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించడంతో వడ్డీ రూపంలో దాదాపు రూ.లక్షన్నర మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుందని అధికారులు వివరించారు. ఆటోలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment