మహిళా సాధికారత అంటే ఇదీ..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారు. పార్టీలు, పైరవీలు, కులమతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగల్గుతున్నారు. నాటి పాలకులు నమ్మించి మోసం చేస్తే నేటి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారత సాకారమవుతోంది.
రాష్ట్రంలో మొత్తం 1.03 కోట్ల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2019 ముందు వరకు పట్టాలు తప్పిన ఆ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా 78.76 లక్షల మంది మహిళలకు బ్యాంకుల్లో ఉన్న రూ.25,517 కోట్లను అప్పును వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేయడానికి ప్రభుత్వం ముందుకొ చ్చింది.
ఇప్పటికే రెండు విడతలుగా అందులో 12,758.28 కోట్లను చెల్లించింది. ఈ పథకంలో మహిళలకు ఇచ్చే డబ్బును వారు తిరిగి చెల్లించక్కర్లేదు. వాటిని వారు ఏ అవసరానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛనిచ్చింది. మరోవైపు 45–60 ఏళ్ల వయస్సు ఉండే 25 లక్షల మంది మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేల చొప్పున అందజేసేందుకు 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పేరుతో మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరికీ రెండు విడతలుగా రూ.9,179.69 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఇక రాష్ట్రంలో 18 ఏళ్లు, ఆ పైబడి వయస్సు ఉండే మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. వీరిలో ఈ రెండు పథకాల ద్వారా దాదాపు కోటి మంది మహిళలు రూ.24,938 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారు.
రుణాల మంజూరు, చెల్లింపుల్లోనూ మనమే టాప్
రాష్ట్రంలో 80 శాతానికి పైగా మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల పేరుతో వీరికి ప్రభుత్వపరంగా ఒకవైపు ఆర్థిక చేయూత అందుతుండగా.. మరోవైపు బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాల పేరుతో వారికి పెద్దఎత్తున రుణాలు అందజేసే ప్రక్రియ ఊపందుకుంది. దీంతో దాదాపు 9 లక్షల పొదుపు సంఘాలకు 2019 మే తర్వాత 33 నెలల కాలంలో రూ.61,106.38 కోట్ల రుణాలు అందాయి. అలాగే, గత ఏడాది ఏప్రిల్ నుంచి 2022 జనవరి మధ్య దాదాపు 45 లక్షల మంది మహిళలు రూ.19,095 కోట్లు రుణాలు పొందారు. దీంతో దేశవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరుతో బ్యాంకులిచ్చే రుణాలలో దాదాపు 30 శాతం మన రాష్ట్రంలోని మహిళలకే అందుతున్నాయని గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. ఇలా రుణాలను ప్రభుత్వం ఇప్పించడంతోపాటు ఆ రుణాలను మహిళలు ఎప్పటికప్పుడు చెల్లించడంలోనూ మన రాష్ట్రమే దేశంలో అగ్రస్థానంలో ఉంది.
రూ.2,354 కోట్ల వడ్డీని చెల్లించిన సర్కారు
గతంలో పొదుపు సంఘాలకు బ్యాంకులు 13.50 శాతం వార్షిక వడ్డీకి రుణాలు ఇచ్చేవి. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు వీలైనంత తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తి ఫలితంగా ఇప్పుడు 9.50 శాతం వడ్డీకే ఇస్తున్నాయి. పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే ఏటా ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ఇలా గత రెండేళ్లలో రూ.2,354 కోట్లు చెల్లించింది.
ఎంఎన్సీ కంపెనీలతో అదనపు తోడ్పాటు
ఇదిలా ఉంటే.. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో పాటు బ్యాంకు రుణాల ద్వారా అందజేసిన డబ్బుతో వారికి శాశ్వత జీవనోపాధి కల్పనకూ ప్ర త్యేక ఏర్పాట్లుచేసింది. మహిళలు వారి గ్రామాల్లో కిరాణా షా పులు వంటి చిరువ్యాపారాలను ప్రారంభించుకోవడానికి ముందుకొస్తే, వారికి హోల్‌సేల్ మార్కెట్లో దొరికే ధర కన్నా తక్కువకే సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
హిందూస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్ వంటి సంస్థలతో పాటు.. పాడి పశువుల పెంపకం చేçపట్టే వారికి అధిక ధర దక్కేలా అమూల్ సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. అలాగే, పొట్టే ళ్లు, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టే వారికి సైతం అధిక ధర దక్కేలా ప్రపంచ స్థాయిలో మాంసం వ్యాపారం చేసే అలానా సంస్థతోనూ ఒప్పందం చేసుకుంది. ఫలితంగా 4,77,851 కుటుంబాలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాయి.
నాడు విలవిల.. నేడు మిలమిల
తెలుగుదేశం హయాంలో నాటి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాటి రుణాలపై అమలులో ఉన్న జీరో వడ్డీ పథకానికీ నిధులు ఇవ్వలేదు. దీంతో ప్రతినెలా కోట్ల రూపాయలను పొదుపు చేసుకునే మహిళలు ఒకానొక దశలో రూ.ఐదారు లక్షలు కూడా దాచుకోలేని పరిస్థితికి దిగజారాయి. 18.36 శాతం సంఘాలు రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులుగా మిగిలాయి. ఫలితంగా ఏ, బీ గ్రేడ్ల్లోని సంఘాలు సీ, డీ గ్రేడ్‌లోకి పడిపోయాయి.
ఈ నేపథ్యంలో.. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆసరా పథకంతో పాటు జీరో వడ్డీ పథకానికి ఎప్పటికప్పుడు నిధుల విడుదలతో పొదుపు సంఘాలన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయి. ఎంతలా అంటే.. నిరర్థక ఆస్తులుగా ఉన్న 18.36% సంఘాలు 0.73 శాతానికి పరిమితమయ్యాయి. అంతేకాదు.. 99.27 శాతం మంది సకాలంలో రుణాలు చెల్లించేస్తున్నారు. అలాగే, గతంలో 40శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్లలోను, 60శాతం సంఘాలు సీడీ గ్రేడ్లలోనూ ఉండగా.. ప్రస్తుతం 90శాతం సంఘాలు ఏ, బీ గ్రేడ్ల స్థాయికి ఎదిగాయి.
► గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన కారుమూరు సుధాకరమ్మ ఆర్నెల్ల క్రితం వరకు వ్యవసాయ కూలీ. చదివించే స్థోమతలేక ఇంటర్ చదివిన ఒక్కగానొక్క కొడుకును పనిలో పెట్టింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇచ్చిన ఆర్థిక తోడ్పాటుతో పాటు పొదుపు సంఘం పేరిట బ్యాంకు నుంచి వచ్చిన రుణంలో తన వాటాను కలిపి చిల్లరకొట్టు పెట్టుకుంది. దీంతో ఇప్పుడామె రోజూ రూ.రెండు, రెండున్నర వేల వరకు వ్యాపారం చేసుకుంటోంది. తద్వారా నాలుగైదు వందలు ఆదాయం వస్తోంది. అంతకుముందు ఏడాదిలో ఎక్కువ రోజులు డబ్బులకు కటకటలాడే సుధాకరమ్మ ఇప్పుడు మారిన పరిస్థితులతో తన కొడుకును డిగ్రీలో చేర్పించాలనుకుంటోంది.
► ఈమె పేరు ఇప్పిలి కళావతి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామం. ఈమె భర్త మరణించాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు మానసిక దివ్యాంగురాలు. రోజూ కూలీకి వెళ్తే వచ్చే డబ్బే ఈమెకు జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కారు అమలుచేసిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలు ఆమె జీవితాన్ని మార్చాయి. ఆసరా పథకం ద్వారా రూ.37,642లు, వైఎస్సార్ చేయూత ద్వారా రెండు విడతల్లో రూ.37,500 జమకావడంతో ఆమె ఊరిలోనే టైలరింగ్ చేసుకుంటూ కిరాణాషాపు పెట్టుకుని గౌరవంగా జీవిస్తోంది. స్త్రీనిధి ద్వారా అదనంగా మరో రూ.50 వేలు మంజూరు కావడంతో వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంటోంది. ఇప్పుడు ప్రతినెలా ఖర్చులు పోను రూ.15 వేలు వరకు ఆదాయం వస్తోంది.
► ఈమె పేరు రేష్మ. ఊరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. పొదుపు సంఘంలో సభ్యురాలు కావడంతో ఇంట్లోనే చీరల వ్యాపారం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో భర్త సలీం సహకారంతో శారీ మ్యాచింగ్ సెంటర్‌నూ ప్రారంభించారు. పొదుపు సంఘం ద్వారా రూ.50వేల బ్యాంకు రుణం వచ్చింది. అలాగే, సున్నా వడ్డీ కింద రూ.2వేలు మాఫీ అయ్యింది. అంతేకాక.. పొదుపు రుణ మాఫీ ద్వారా రెండేళ్లలో రూ.30 వేలు మాఫీ అయింది. మరోవైపు టైలరింగ్ చేస్తుండడంతో టైలర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కింద రెండేళ్లలో రూ.20వేలు వచ్చింది. ఇలా.. వైఎస్ జగన్ సర్కారు తోడ్పాటుతో రెండేళ్లలో ఈ కుటుంబానికి రూ.లక్ష వరకు లబ్ధి చేకూరింది. ఇద్దరు పిల్లలు చదువుకుంటుండడంతో ‘అమ్మఒడి’ కూడా వచ్చింది.