నెలాఖరులోగా వాయిదా కట్టిస్తాం | Installment can be received in this month | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా వాయిదా కట్టిస్తాం

Published Sun, Aug 24 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

Installment can be received in this month

ఒంగోలు టౌన్: జిల్లాలోని పొదుపు గ్రూపుల్లో ఇప్పటివరకు వాయిదాలు కట్టకుండా ఉన్న గ్రూపుల నుంచి నెలాఖరుకు ఒక వాయిదా కచ్చితంగా కట్టిస్తామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.పద్మజ బ్యాంకర్లకు హామీ ఇచ్చారు. శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఐకేపీ, బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పొదుపు గ్రూపులకు సంబంధించి ప్రతి గ్రూపునకు లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తూ ప్రభుత్వం జీఓ నెం.164 జారీ చేయడంతో ఎక్కువ మంది గ్రూపులు తాము తీసుకున్న రుణాలను బ్యాంకులకు చెల్లించలేదన్నారు.
 
బ్యాంకులకు రుణాలు చెల్లించకున్నా, ఖాతాలు నిలిపివేసినా, వడ్డీలేని రుణాన్ని కోల్పోవడంతోపాటు భవిష్యత్‌లో రుణాలను కోల్పోతారని స్పష్టం చేయడంతో 50శాతం గ్రూపులు తిరిగి రుణాలు చెల్లించాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 30,131పొదుపు గ్రూపులున్నాయని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 934 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రాజెక్టు డెరైక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు రుణాలు చెల్లించని పొదుపు గ్రూపుల వివరాలను బ్యాంకుల వారీగా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 50 శాతం గ్రూపులు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదని తేలడంతో, నెలాఖరులోగా కనీసం ఒక వాయిదా చెల్లించేలా చూడాలని ఐకేపీ సిబ్బందిని పద్మజ ఆదేశించారు.
 
ప్రతి ఇంటిలో రెండు బ్యాంకు ఖాతాలు తెరవాలి
ప్రధానమంత్రి జన ధన యోజన పథకం కింద ప్రతి ఇంటిలో ఇద్దరు కుటుంబ సభ్యులు విధిగా రెండు ఖాతాలు తెరవాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ పద్మజ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్నిరకాల రాయితీలు పొందాలంటే ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. గ్యాస్ రాయితీ, రేషన్ రాయితీ, హౌసింగ్ రాయితీ తదితరాలు
 
పొందాలంటే ఆధార్ కార్డులు తప్పనిసరి చేశారన్నారు. ఆధార్ కార్డులు కలిగినవారికి వారి ఖాతాల్లో రాయితీ నగదు జమ కావాలంటే విధిగా బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. పొదుపు గ్రూపుల్లో దాదాపు ఐదు లక్షల మంది మహిళలున్నారని, వారిలో లక్ష నుంచి రెండు లక్షల మందికి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేవన్నారు. సెప్టెంబర్ 9 నాటికి వారందరూ బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు మేనేజర్, ఐకేపీ సీసీ లేదా ఏపీఎంలు రోజుకో గ్రామానికి వెళ్లి అక్కడికక్కడే బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారన్నారు. అయితే ఏ రోజు ఏ గ్రామానికి ఈ బృందం వస్తుందో ముందుగానే గ్రామంలో ‘టాంటాం’ వేయిస్తామన్నారు. బ్యాంకు  ఖాతా తెరిచేందుకు అవసరమైన డాక్యుమెంట్లు తీసుకువస్తే అక్కడికక్కడే ‘జీరో’ అకౌంట్‌తో సంబంధిత వ్యక్తులకు ఓపెన్ చేయిస్తామని పద్మజ వివరించారు.
 
ఈ సమావేశంలో సిండికేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్  సీబీఎల్ నరసింహారావు, ఎల్‌డీఎం ఎం.నరసింహారావు, నాబార్డు ఏజీఎం జ్యోతిశ్రీనివాస్, డీపీఎం(బ్యాంకు లింకేజి) బి.సుబ్బారావు, ఏపీడీలు రాజేంద్ర, రవిలతోపాటు బ్యాంకుల కో ఆర్డినేటర్లు, ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement