పిఠాపురంలో జంతువుల కొవ్వుతో యథేచ్ఛగా తయారీ
ఆలయాలకు సరఫరా
ఒక్క కేంద్రంపైనే అధికారుల దాడి.. 400 కేజీలు స్వాధీనం
పిఠాపురం: జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కాæసమాచారం మేరకు పిఠాపురంలో శుక్రవారం ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
పిఠాపురంలోని రెండవ రోడ్డులోని పద్మావతినగర్‌లో బండారు ఫణి ప్రసాద్ ఇంట్లో సుమారు 400 కేజీల నకిలీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తయారీ దారులు కమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు.
రానున్న కార్తీకమాసాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా నకిలీ నెయ్యి తయారు చేసి ఆలయాల వద్ద విక్రయించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కమిషనర్ సైతం ధ్రువీకరించారు. ఇదే పిఠాపురంలో ఇలాంటి కేంద్రాలు ఇంకా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అసలు దొంగలను పట్టుకోరా?
ఇదిలా ఉండగా, ఈ విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ.. చాలా మందికి తెలియడంతో విషయాన్ని బయట పెట్టక తప్పలేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చెందుర్తి, కొడవలి, తాటిపర్తి తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో అనధికార కబేళాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ యథేచ్చగా గోవధ జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నెయ్యికి ఉపయోగించే జంతు కొవ్వు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలిసింది.
గోవులను చంపి, అందులో కావాల్సిన మాంసాన్ని తీసుకుని.. మిగిలిన వ్యర్థ పదార్థాలను, ఎముకలను కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి, దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే నకిలీ నెయ్యిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిని పలు ఆలయాల్లో పూజలు, ప్రసాదాల తయారీ, దీపారాధనకు వినియోగిస్తున్నట్లు సమాచారం.
కల్తీ నెయ్యి దందా వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు తెలిసింది. ఇంత జరిగినా అధికారులు అసలు వ్యక్తులను వదిలేసి.. వీళ్లే నిర్వాహకులంటూ కొందరిపై నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment