సాక్షి, విశాఖపట్నం: నగరంలోకి మామిడి పండ్లు అప్పుడే వచ్చేశాయ్! వేసవిలో వచ్చే మామిడి పండ్లు శీతాకాలంలో రావడమేమిటని ఆశ్చర్యపోకండి! నూజివీడు ప్రాంతంలో ప్రత్యేకంగా పండించిన ఈ మధుర ఫలాలు నగరవాసులకు రుచిచూపించడానికి విచ్చేశాయి. సాధారణంగా ఏప్రిల్ నాటికి మామిడి పండ్లు పక్వానికి వస్తాయి. ఎక్కడైనా ముందుగా కాసిన చోట ఒక నెల ముందు మార్కెట్లో కనిపిస్తాయి.
కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా నాలుగైదు నెలల ముందుగానే ఇవి దర్శనమిస్తున్నాయి. అనూహ్యంగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ మామిడిని చూసిన వారు ఒకింత ఆశ్చర్య చకితులవుతున్నారు. ప్రస్తుతం విశాఖ మార్కెట్లో బంగినపల్లి, సువర్ణరేఖ, పరియా రకాల మామిడి పండ్లు అందుబాటులోకి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు ప్రాంతంలో కొంతమంది రైతులు వీటిని ప్రత్యేకంగా పండిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి విశాఖ, గాజువాకలకు చెందిన కొందరు పండ్ల వర్తకులు కొనుగోలు చేసి ఇక్కడకు తెస్తున్నారు. వీటిలో ఏ రకమైనా కిలో రూ.250 చొప్పున పండ్ల బండ్లపై విక్రయిస్తున్నారు. ధర ఎక్కువైనా మామిడి పండ్లపై మోజు పడేవారు అర కిలో, కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ సీజనులో వచ్చే మామిడి పండ్లకంటే కాస్త రుచి తక్కువగానే ఉంటున్నా కాలం కాని కాలంలో వీటిని తినడం ఓ తీయని అనుభూతిని కలిగిస్తోందని నగరంలోని శాంతిపురానికి చెందిన ఎంకేఆర్ శర్మ ‘సాక్షి’తో చెప్పారు.
రోజుకు అర టన్ను పండ్లు అమ్మకం
నూజివీడు ప్రాంతం నుంచి కొనుగోలు చేసిన మామిడి పండ్లను నగరంలోని డైమండ్ పార్క్, ఎల్‌ఐసీ బిల్డింగ్, సీతమ్మధార రైతుబజార్, ఎంవీపీ కాలనీ, పూర్ణామార్కెట్, గాజువాక తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రోజుకు నూజివీడు ప్రాంతం నుంచి అర టన్ను (500 క్వింటాళ్ల) మామిడి పండ్లు తెస్తుండగా 90 శాతం అమ్ముడుపోతున్నాయని ఈ పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. రోజూ తాను 50 కిలోల మామిడి పండ్లను తెస్తే 40 కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయని డైమండ్ పార్కు వద్ద బండిపై విక్రయించే పండ్ల వ్యాపారి ఎస్.ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మామిడిపండ్లు డిసెంబర్‌లో మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారని, సంక్రాంతి వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment