ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారిపై అనేక ఫిర్యాదులు
విచారణలో ఆరోపణలన్నీ వాస్తవాలని తేలాయి.. అందుకే ఏసీఏ చర్యలు
ఏసీఏ కార్యదర్శి కోటా కొత్త పద్ధతి కాదు.. బాబు హయాంలోనూ ఉన్నదే
కొన్ని టీమ్స్‌లో 18 మంది, 22 మంది కూడా ఉన్నారు
ఈ విషయాలు తెలిసీ రామోజీ విష ప్రచారం
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చేస్తున్న కృషితో పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్రీడలు దేశాన్నే ఆకర్షించాయి. ఈ రాష్ట్రం ఏ రంగంలో బాగుపడినా నచ్చని పచ్చమీడియా.. ముఖ్యంగా రామోజీరావు క్రీడలపైనా విషం చిమ్ముతున్నారు.
ఇందుకు ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ హనుమ విహారి ఉదంతాన్ని కూడా విషపూరితం చేసి, చిలువలు పలువలు అల్లి ఈనాడులో కథనాలు వండి వారుస్తున్నారు. నిజానికి ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి వైఖరి ఆది నుంచి వివాదాస్పదమే. జట్టు సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడుతుంటారన్న ఫిర్యాదులున్నాయి. విహారి వ్యవహార శైలిపై పలుమార్లు సాటి ఆటగాళ్లు, ఏసీఏ అధికారులు, కోచ్‌లు, కోచ్ హెడ్‌లు కూడా ఫిర్యాదులు చేశారు. అవన్నీ వాస్తవమేనని విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఏసీఏ కథనం ప్రకారం..
విహారిపై ఫిర్యాదుల్లో కొన్ని..
♦ బెంగాల్ రంజీ మ్యాచ్‌లో విహారి అందరి ముందు ఒక ఆటగాడి (పృథ్వీరాజ్)ని అసభ్యంగా దుర్భాషలాడారు. దీనిపై ఆయన ఏసీఏకు ఫిర్యాదు చేశారు.
♦ సాటి జట్టు సభ్యులు, సపోర్టు స్టాఫ్‌తో పాటు ఏసీఏ అధికారులు సైతం తరచూ విహారి అసభ్యకర పదజాలంపై ఫిర్యాదులు చేశారు.
♦ ముస్తాఖ్ ఆలీ టోర్నమెంట్ ఆంధ్ర టీం మేనేజర్ రాజారెడ్డి కూడా జట్టులో గ్రూపులకు విహారి కారణమవుతున్నారని ఫిర్యాదు చేశారు.
♦ ఇతర రాష్ట్రాల తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాలని విహారి పదే పదే ఏసీఏని అడిగేవారు. కొన్నిసార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కూడా చెప్పేవారు. తరచూ కెప్టెన్సీ నుంచి తప్పించాలనేవారు. మళ్లీ ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని చెబుతుండేవారు.
♦ విహారి అనుభవం, ఆంధ్ర క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా జట్టులో కొనసాగించారు.
♦ హనుమపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని విచారణలో తేలింది.
♦ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో విహారి తర్వాత స్థానంలో ఉన్న రిక్కీబుయ్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని కూడా విహారి అంగీకరించి అభినందించారు కూడా.
♦ ఆ తర్వాత కెప్టెన్‌గా తననే కొనసాగించాలంటూ విహారి తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు జట్టు సభ్యులు తెలిపారు.
♦ పృథ్వీరాజ్ ఒకేసారి రంజీ జట్టులోకి రాలేదు. అండర్ 14, 16, అండర్ 19 వినూ మన్కడ్, కూచ్ బిహార్, అండర్ 23, 25 కల్నల్ సీకేనాయుడు, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడి ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇంత సీనియారిటీ, అనుభవం ఉన్నప్పటికీ, జనవరిలో బెంగాల్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో కెప్టెన్ విహారి అతన్ని ఆడించలేదు. గాయపడిన మరో వికెట్ కీపర్‌ను ఆడించారు.
చాలా జట్లలో 17 మందికన్నా ఎక్కువ సభ్యులు
ఈనాడు పేర్కొన్నట్టు.. క్రికెట్ జట్టులో 15 మందే ఉండాలన్న నిబంధనేమీ లేదు. 17 మందికి మించి సభ్యులున్న జట్లు చాలానే ఉన్నాయి. 2023–24 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ టీమ్‌లో 18 మంది ఉన్నారు. హైదరాబాద్ జట్టులోనూ 17 మంది కంటే ఎక్కువే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఏసీఏ కూడా ఆంధ్ర జట్టుకు 22 మందిని ఎంపిక చేసింది. ఏసీఏ కార్యదర్శి కోటా కూడా కొత్తదేమీ కాదు.. చంద్రబాబు హయాం నుంచే ఉంది. ఈ విషయాలు తెలియకుండానే రామోజీ కథనం అల్లారా?
ఫౌండేషన్ మూతపడేలా
2021 నవంబర్‌లో తిరుపతిలో వరదల్లో ప్రజలకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను హనుమ విహారి ఫౌండేషన్ అందించింది. ఫౌండేషన్ సహాయ కార్యక్రమాల్లో ఇద్దరు వాలంటీర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని కనిపించారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడంలేదని, తామే చేస్తున్నామంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది.
అయితే, ఈ సహాయ కార్యక్రమానికి టీడీపీకి కానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు కానీ సంబంధం లేదని, తమ బృందంలోని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారని, అంతమాత్రాన ఇది ఎన్టీఆర్ ట్రస్టు చేసినట్టు కాదంటూ విహారి ఫౌండేషన్ గట్టిగా ఖండించింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు విహారిని వేధించి, వెంటబడి ఫౌండేషన్ మూతపడేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే టీడీపీ నేతలు ఇప్పుడు విహారిపై ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్రికెట్‌పై రాజకీయాలు దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ క్రీడపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘క్రికెట్ అభివృద్ధి, విస్తరణకు దేశంలోని పలు అసోసియేషన్ల మాదిరిగానే ప్రతిష్టాత్మక ఏసీఏ కూడా విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు తావులేదు.
ఏసీఏనుద్దేశించి హనుమ విహారి ఆరోపణలు చేయడం విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా సమన్వయం కుదిర్చి సత్ఫలితాలు సాధించడం జట్టు బాధ్యత. అందులోభాగంగా ఏ ఆటగాడైనా తొందరపడినా, మరో రకంగా ప్రవర్తించినా వారి పట్ల అత్యంత సంయమనం పాటిస్తూ జట్టును ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఏసీఏ కృషి చేస్తుంది.
జట్టు ప్రయాజనాలు, క్రికెట్ స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని లోలోపలే సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. పరిధి దాటితే నిబంధనల ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. హనుమ విహారి బహిరంగంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఏసీఏ, సాటి సభ్యులపై ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు గమనించాలి’ అని ఏసీఏ కోరింది.
పైరవీలు చేస్తే నా కొడుకు కెప్టెన్ అయ్యేవాడుగా?
ఆంధ్రా క్రికెట్ జట్టు సభ్యుడు పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి
తిరుపతి మంగళం: ‘భారత క్రికెట్ జట్టుకు ఆడిన ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి తన సహచర ఆటగాడు పృథ్వీరాజ్‌పై అసత్య ఆరోపణలతో ట్వీట్ చేయడం బాధాకరం. నిజంగా నేను పైరవీలు చేసి ఉంటే నా కుమారుడు పృథ్వీరాజ్ ఎందుకు ఆంధ్రా జట్టులో 17వ ఆటగాడిగా ఉంటాడు. ఏకంగా కెపె్టన్ అయ్యేవాడు కదా..’ అని పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి అన్నారు. ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతికి చెందిన నా కుమారుడు పృథ్వీరాజ్ అండర్–12, 14, 17, 19 క్రికెట్‌లో విశేష ప్రతిభ చూపాడు.
బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా అనేక రికార్డులు పృథ్వీరాజ్‌పై ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఒక్క రంజీ మ్యాచ్ అడే అవకాశం రాలేదు. నేను రాజకీయంగా ప్రభావితం చేసి నా కుమారుడిని క్రికెట్ జట్టులోకి తీసుకువస్తున్నట్లు హనుమ విహారి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. నేను ఏసీఏను రాజకీయంగా ప్రభావితం చేయగలిగే వాడినే అయితే నా కుమారుడు ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడకుండా ఉంటాడు. నా కుమారుడు పృథ్వీరాజ్ ప్రతిభ కలిగినవాడు.
స్వశక్తితో పైకి రావాలని కోరుకుంటాడు. పైరవీలు, రాజకీయ ప్రభావంతో ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారి తోటి క్రీడాకారులను పైకి తీసుకువచ్చే విధంగా ఆలోచించాలి. కానీ ఆయన మరొక క్రికెటర్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం, అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. హనుమ విహారి చేసిన తప్పులను త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తా..’ అని నరసింహాచారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment