Ranji team
-
Fact Check: వివాదాల ‘విహారి’!
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చేస్తున్న కృషితో పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్రీడలు దేశాన్నే ఆకర్షించాయి. ఈ రాష్ట్రం ఏ రంగంలో బాగుపడినా నచ్చని పచ్చమీడియా.. ముఖ్యంగా రామోజీరావు క్రీడలపైనా విషం చిమ్ముతున్నారు. ఇందుకు ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ హనుమ విహారి ఉదంతాన్ని కూడా విషపూరితం చేసి, చిలువలు పలువలు అల్లి ఈనాడులో కథనాలు వండి వారుస్తున్నారు. నిజానికి ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి వైఖరి ఆది నుంచి వివాదాస్పదమే. జట్టు సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడుతుంటారన్న ఫిర్యాదులున్నాయి. విహారి వ్యవహార శైలిపై పలుమార్లు సాటి ఆటగాళ్లు, ఏసీఏ అధికారులు, కోచ్‌లు, కోచ్ హెడ్లు కూడా ఫిర్యాదులు చేశారు. అవన్నీ వాస్తవమేనని విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఏసీఏ కథనం ప్రకారం.. విహారిపై ఫిర్యాదుల్లో కొన్ని.. ♦ బెంగాల్ రంజీ మ్యాచ్‌లో విహారి అందరి ముందు ఒక ఆటగాడి (పృథ్వీరాజ్)ని అసభ్యంగా దుర్భాషలాడారు. దీనిపై ఆయన ఏసీఏకు ఫిర్యాదు చేశారు. ♦ సాటి జట్టు సభ్యులు, సపోర్టు స్టాఫ్‌తో పాటు ఏసీఏ అధికారులు సైతం తరచూ విహారి అసభ్యకర పదజాలంపై ఫిర్యాదులు చేశారు. ♦ ముస్తాఖ్ ఆలీ టోర్నమెంట్ ఆంధ్ర టీం మేనేజర్ రాజారెడ్డి కూడా జట్టులో గ్రూపులకు విహారి కారణమవుతున్నారని ఫిర్యాదు చేశారు. ♦ ఇతర రాష్ట్రాల తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాలని విహారి పదే పదే ఏసీఏని అడిగేవారు. కొన్నిసార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కూడా చెప్పేవారు. తరచూ కెప్టెన్సీ నుంచి తప్పించాలనేవారు. మళ్లీ ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని చెబుతుండేవారు. ♦ విహారి అనుభవం, ఆంధ్ర క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా జట్టులో కొనసాగించారు. ♦ హనుమపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని విచారణలో తేలింది. ♦ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో విహారి తర్వాత స్థానంలో ఉన్న రిక్కీబుయ్ని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని కూడా విహారి అంగీకరించి అభినందించారు కూడా. ♦ ఆ తర్వాత కెప్టెన్‌గా తననే కొనసాగించాలంటూ విహారి తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు జట్టు సభ్యులు తెలిపారు. ♦ పృథ్వీరాజ్ ఒకేసారి రంజీ జట్టులోకి రాలేదు. అండర్ 14, 16, అండర్ 19 వినూ మన్కడ్, కూచ్ బిహార్, అండర్ 23, 25 కల్నల్ సీకేనాయుడు, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడి ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇంత సీనియారిటీ, అనుభవం ఉన్నప్పటికీ, జనవరిలో బెంగాల్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో కెప్టెన్ విహారి అతన్ని ఆడించలేదు. గాయపడిన మరో వికెట్ కీపర్‌ను ఆడించారు. చాలా జట్లలో 17 మందికన్నా ఎక్కువ సభ్యులు ఈనాడు పేర్కొన్నట్టు.. క్రికెట్ జట్టులో 15 మందే ఉండాలన్న నిబంధనేమీ లేదు. 17 మందికి మించి సభ్యులున్న జట్లు చాలానే ఉన్నాయి. 2023–24 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ టీమ్‌లో 18 మంది ఉన్నారు. హైదరాబాద్ జట్టులోనూ 17 మంది కంటే ఎక్కువే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఏసీఏ కూడా ఆంధ్ర జట్టుకు 22 మందిని ఎంపిక చేసింది. ఏసీఏ కార్యదర్శి కోటా కూడా కొత్తదేమీ కాదు.. చంద్రబాబు హయాం నుంచే ఉంది. ఈ విషయాలు తెలియకుండానే రామోజీ కథనం అల్లారా? ఫౌండేషన్ మూతపడేలా 2021 నవంబర్‌లో తిరుపతిలో వరదల్లో ప్రజలకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను హనుమ విహారి ఫౌండేషన్ అందించింది. ఫౌండేషన్ సహాయ కార్యక్రమాల్లో ఇద్దరు వాలంటీర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని కనిపించారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడంలేదని, తామే చేస్తున్నామంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. అయితే, ఈ సహాయ కార్యక్రమానికి టీడీపీకి కానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు కానీ సంబంధం లేదని, తమ బృందంలోని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారని, అంతమాత్రాన ఇది ఎన్టీఆర్ ట్రస్టు చేసినట్టు కాదంటూ విహారి ఫౌండేషన్ గట్టిగా ఖండించింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు విహారిని వేధించి, వెంటబడి ఫౌండేషన్ మూతపడేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే టీడీపీ నేతలు ఇప్పుడు విహారిపై ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రికెట్‌పై రాజకీయాలు దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ క్రీడపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘క్రికెట్ అభివృద్ధి, విస్తరణకు దేశంలోని పలు అసోసియేషన్ల మాదిరిగానే ప్రతిష్టాత్మక ఏసీఏ కూడా విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు తావులేదు. ఏసీఏనుద్దేశించి హనుమ విహారి ఆరోపణలు చేయడం విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా సమన్వయం కుదిర్చి సత్ఫలితాలు సాధించడం జట్టు బాధ్యత. అందులోభాగంగా ఏ ఆటగాడైనా తొందరపడినా, మరో రకంగా ప్రవర్తించినా వారి పట్ల అత్యంత సంయమనం పాటిస్తూ జట్టును ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఏసీఏ కృషి చేస్తుంది. జట్టు ప్రయాజనాలు, క్రికెట్ స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని లోలోపలే సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. పరిధి దాటితే నిబంధనల ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. హనుమ విహారి బహిరంగంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఏసీఏ, సాటి సభ్యులపై ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు గమనించాలి’ అని ఏసీఏ కోరింది. పైరవీలు చేస్తే నా కొడుకు కెప్టెన్ అయ్యేవాడుగా? ఆంధ్రా క్రికెట్ జట్టు సభ్యుడు పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి తిరుపతి మంగళం: ‘భారత క్రికెట్ జట్టుకు ఆడిన ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి తన సహచర ఆటగాడు పృథ్వీరాజ్‌పై అసత్య ఆరోపణలతో ట్వీట్ చేయడం బాధాకరం. నిజంగా నేను పైరవీలు చేసి ఉంటే నా కుమారుడు పృథ్వీరాజ్ ఎందుకు ఆంధ్రా జట్టులో 17వ ఆటగాడిగా ఉంటాడు. ఏకంగా కెపె్టన్ అయ్యేవాడు కదా..’ అని పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి అన్నారు. ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతికి చెందిన నా కుమారుడు పృథ్వీరాజ్ అండర్–12, 14, 17, 19 క్రికెట్లో విశేష ప్రతిభ చూపాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా అనేక రికార్డులు పృథ్వీరాజ్‌పై ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఒక్క రంజీ మ్యాచ్ అడే అవకాశం రాలేదు. నేను రాజకీయంగా ప్రభావితం చేసి నా కుమారుడిని క్రికెట్ జట్టులోకి తీసుకువస్తున్నట్లు హనుమ విహారి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. నేను ఏసీఏను రాజకీయంగా ప్రభావితం చేయగలిగే వాడినే అయితే నా కుమారుడు ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడకుండా ఉంటాడు. నా కుమారుడు పృథ్వీరాజ్ ప్రతిభ కలిగినవాడు. స్వశక్తితో పైకి రావాలని కోరుకుంటాడు. పైరవీలు, రాజకీయ ప్రభావంతో ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారి తోటి క్రీడాకారులను పైకి తీసుకువచ్చే విధంగా ఆలోచించాలి. కానీ ఆయన మరొక క్రికెటర్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం, అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. హనుమ విహారి చేసిన తప్పులను త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తా..’ అని నరసింహాచారి చెప్పారు. -
హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరిగే రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన హైదరాబాద్ జట్టుకు తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా... యువ భారత్ జట్టు సభ్యుడు, 19 ఏళ్ల ఠాకూర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు, ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. జనవరి 13 నుంచి జరిగే రంజీ ట్రోఫీ తొలి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది. హైదరాబాద్ రంజీ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), పీఎస్ చైతన్య రెడ్డి, బుద్ధి రాహుల్, జావేద్ అలీ, ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, మికిల్ జైస్వాల్, కార్తికేయ కక్, చందన్ సహని, హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్, అలంకృత్ అగర్వాల్, ధీరజ్ గౌడ్ (వికెట్ కీపర్), టి.రవితేజ, అబ్రార్ మొహియుద్దీన్, రక్షణ్ రెడ్డి, అబ్దుల్ ఇలా ఖురేషి, అఫ్రిది, ఎన్.సూర్య తేజ, అలిగ వినయ్, మొహమ్మద్ సక్లాయిన్, సూర్యప్రసాద్. చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే.. -
మళ్లీ బ్యాట్ పట్టిన పుజారా...
న్యూఢిల్లీ: మూడు నెలల విరామం అనంతరం భారత టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారా మళ్లీ బ్యాట్ పట్టాడు. కరోనా లాక్డౌన్ సడలింపులతో.... రాజ్‌కోట్‌లోని తన క్రికెట్ అకాడమీలో రంజీ జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పుజారా... గత ఏడాది తన జట్టుకు తొలి రంజీ టైటిల్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించాడు. రంజీ ఫైనల్ అనంతరం పుజారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. తను ప్రాక్టీస్ చేసే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పుజారా ‘నేనొచ్చేశా... చాలా కాలం దూరంగా ఉన్నట్లు అనిపించింది... అయితే ప్రాక్టీస్ మొదలుపెట్టాక నిన్ననే ప్రాక్టీస్ చేసినట్లు అనిపించింది’ అంటూ దానికి కామెంట్ జత చేశాడు. -
బెంగాల్‌తో ఓజా ‘ఆట’ ముగిసింది!
రంజీ జట్టులో దక్కని చోటు కోల్‌కతా: హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా దేశవాళీ కెరీర్ స్వయంకృతంతో ప్రమాదంలో పడింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టును మంగళవారం ప్రకటించినా... అందులో ఓజాకు చోటు దక్కలేదు. అతడు చాలా రోజులుగా తమకు అందుబాటులోనే లేడని, అందువల్ల ఓజా గురించి కనీసం చర్చించలేదని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు. ఇటీవల బెంగాల్ జట్టు కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణా శిబిరానికి కూడా ఓజా హాజరు కాలేదు. హైదరాబాద్ తరఫున రెగ్యులర్‌గా రంజీ ఆడిన ఓజా 2015–16, 2016–17 సీజన్లలో బెంగాల్‌కు ఆడాడు. తమకు లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం ఉందంటూ సౌరవ్ గంగూలీ స్వయంగా ఓజాను పిలిచి ప్రోత్సహించారు. అయితే ఈ ఏడాది సొంత జట్టు హైదరాబాద్‌కు ఆడేందుకు ఆసక్తి చూపించిన ఓజాకు నిరభ్యంతరకర పత్రం ఇచ్చేందుకు గంగూలీ నిరాకరించారు. అప్పటి నుంచి అతను ‘క్యాబ్’ అధికారులకు అందుబాటులో లేకుంండా పోయాడు. ట్విట్టర్లో మాత్రం అతను తరచుగా పోస్టింగ్‌లు పెడుతూ చురుగ్గా ఉండటం విశేషం. బెంగాల్ తిరస్కరించడంతో ఈ ఏడాది ఏ జట్టుకు కూడా రంజీలు ఆడే అవకాశం లేని ఓజా కెరీర్ ఇక ముందు కూడా కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. భారత్ తరఫున 24 టెస్టుల్లో 113 వికెట్లు పడగొట్టిన ఓజా... 18 వన్డేల్లో 21 వికెట్లు, 6 టి20 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీశాడు. -
హెచ్‌సీఏ బౌలింగ్ కన్సల్టెంట్‌గా అక్రమ్!
హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ వచ్చే సీజన్లో హైదరాబాద్ రంజీ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ మేరకు హెచ్‌సీఏ అధికారులు ఇప్పటికే అతనితో ఒక దఫా చర్చలు జరిపారు. ప్రపంచకప్ సందర్భంగా కామెంటేటర్‌గా వ్యవహరిస్తూ ప్రస్తుతం అక్రమ్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ టోర్నీకి భారత జట్టు మేనేజర్‌గా వ్యవహరించనున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్... ఆస్ట్రేలియాలో అక్రమ్‌తో మరో విడత చర్చలు జరుపుతారు. ఐపీఎల్లో అక్రమ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. రంజీల్లో హైదరాబాద్ జట్టు ప్రదర్శన మూడేళ్లుగా పేలవంగా ఉంది. -
ఖలీల్ అజేయ శతకం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ వికెట్ కీపర్ ఇబ్రహీం ఖలీల్ (281 బంతుల్లో 152 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఎన్స్‌కాన్స్ భారీ స్కోరు చేసింది. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో దక్షిణమధ్య రైల్వే జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఆటలో ఎన్స్‌కాన్స్ 440/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రేయాన్ అమూరి 43 పరుగులు చేయగా, బాషా 4 వికెట్లు తీశాడు. అనంతరం రైల్వే జట్టు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 45 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో ఎస్బీహెచ్ బౌలర్లు రవికిరణ్ (5/90), అశ్విన్ యాదవ్ (4/100) విజృంభించడంతో ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ నిఖిల్ యాదవ్ (149 బంతుల్లో 120 నాటౌట్, 19 ఫోర్లు) సెంచరీ సాధించాడు. తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆకాశ్ భండారి (75), సుమంత్ (64) అర్ధసెంచరీలు చేశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 423/5 డిక్లేర్డ్ (రవితేజ 193, నవీన్ రెడ్డి 152 నాటౌట్; పర్వేజ్ ఖాన్ 4/81), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 175 (అజ్మత్‌ఖాన్ 38, తనయ్ త్యాగరాజన్ 32; ఖాదర్ 4/36, కనిష్క్నాయుడు 3/43), రెండో ఇన్నింగ్స్: 1/0. కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 394 (శాండిల్య 159, చైతన్యకృష్ణ 96, ఆరోన్ పాల్ 37; శివశంకర్ 4/77) బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 82/2. డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 359 (అక్షత్ రెడ్డి 119, షాదాబ్ తుంబి 72, హబీబ్ అహ్మద్ 50, ప్రణీత్ 40; మోహిత్ మన్ 4/39, దివేశ్ పథానియా 4/112), ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 81/1. శ్రీదరహాస్కు 5 వికెట్లు శ్రీదరహాస్ (5/38) నిప్పులు చెరగడంతో ఆర్.దయానంద్ జట్టు తక్కువ స్కోరుతోనే తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మొదట దయానంద్ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. తర్వాత ఫలక్‌నుమా జట్టు 161 పరుగులకే కుప్పకూలింది. ఇంద్రశేఖర్ రెడ్డి 3 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో దయానంద్ జట్టు 3 వికెట్లకు 27 పరుగులు చేసింది. చెలరేగిన అన్వర్ హైదరాబాద్ బాట్లింగ్ బౌలర్ అన్వర్ అహ్మద్‌ఖాన్ (5/37) చెలరేగడంతో ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బాట్లింగ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. వంశీవర్ధన్ రెడ్డి (144 బంతుల్లో 77 బ్యాటింగ్, 10 ఫోర్లు), షేక్ మహమ్మద్ (128 బంతుల్లో 53, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. -
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ ఆటగాడు ఆర్.శ్రీధర్ ఐపీఎల్-7లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా హైదరాబాద్ జట్టుకు 12 ఏళ్లపాటు సేవలందించిన శ్రీధర్ 2001లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. కింగ్స్ ఎలెవన్ జట్టుకు పంజాబ్ ఫ్రాంచైజీ తనను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని 43 ఏళ్ల శ్రీధర్ అన్నాడు. యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉన్న పంజాబ్ జట్టును ఐపీఎల్-7లో విజయపథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. శ్రీధర్ నియామకం పట్ల పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ సంతోషం వ్యక్తం చేశాడు.