
నువ్వలరేవులో ఊరేగింపుగా వెళుతున్న పెళ్లి బృందం
వజ్రపు కొత్తూరు రూరల్: శ్రీరస్తు.. శుభమస్తు.. అంటూ సామూహిక పెళ్లి పుస్తకాలను లిఖిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వల రేవు గ్రామస్తులు. ప్రేమికుల దినోత్సవం రోజైన ఆదివారం 36 జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించి తమ ఆచారాన్ని కొనసాగించారు. ఇక్కడి వారంతా మత్స్యకారులే కావడంతో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంపాదన నామమాత్రమే కావటంతో దశాబ్దాల కిందట గ్రామ పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం చేశారు. ఒక్కొక్కరు వివాహాలు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని కాబట్టి.. గ్రామంలో పెళ్లీడుకు వచ్చిన వారందరినీ గుర్తించి ఒకేసారి వివాహాలు చేయడం, వధూవరుల బంధువులందరికీ సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని భావించారు.
అప్పటినుంచి ఇప్పటివరకూ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడే సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించి.. ఆ మేరకు 36 జంటలను ఏకం చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకే వేదికపై 36 మంది పురోహితులు ఏకకాలంలో వేద మంత్రాలు జపించగా.. తాళి కట్టే శుభవేళ ఊరు ఊరంతా మంగళధ్వనులతో మార్మోగింది. నూతన జంటలను ఆశీర్వదించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధుమిత్రులు తరలిరావడంతో నువ్వల రేవు జన సంద్రంగా మారింది.
చదవండి:
ఆ కుటుంబం ఓటమి ఎరగదు..
హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది!
Comments
Please login to add a commentAdd a comment