సమావేశంలో మాట్లాడుతున్న అయోధ్యరామ్
గాజువాక: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఈ నెల 29న నిర్వహించనున్న భారీ మానవహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. అగనంపూడి నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల పొడవునా 10 వేల మంది కార్మికులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఫిబ్రవరి 18న నిర్వహించిన ఉక్కు పరిరక్షణ దినోత్సవానికి రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయన్నారు.
ఆ తరువాత కాలంలో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి రెండు లేఖలను రాశారని, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని పంపిందని పేర్కొన్నారు. జీవీఎంసీ కూడా తన మొదటి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. పార్లమెం ట్ సమావేశాల్లో మన ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జవాబు ఇవ్వడం దారుణమన్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకోకుండా మొండిగా తన నిర్ణయాలను అమలు చేస్తానని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment