రాష్ట్రస్థాయిలో 200 మంది అధికారుల స్థానచలనం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పంచాయతీరాజ్ శాఖలోని కీలకస్థానాల్లో ఉన్న దాదాపు 200మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు అయినా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 12 జీవోలను జారీ చేస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల ప్రతిపాదనలు కొనసాగుతుండగా.. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో 13 ఉమ్మడి జిల్లాల జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవో స్థానాల్లో ప్రభుత్వం కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో మొత్తం 26 విభజిత జిల్లాలు ఉండగా.. అందులో 25 జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు)గా, 22 జిల్లాల్లో డ్వామా పీడీలుగా కొత్త వారిని నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ స్థాయిల్లో ఇద్దరు డీఎల్‌డీవోలను నియమించింది. ఏడు జిల్లాలో డీఆర్‌డీఏ అధికారులుగా కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరు కాకుండా రాష్ట్రమంతటా వివిధ ప్రాంతాల్లో పనిచేసే 49 మంది డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల(డీఎల్‌డీవో)ను బదిలీ చేసింది.
ఇంజనీరింగ్ శాఖలో..
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో పలువురు ఇంజనీరింగ్ అధికారులకు పదోన్నతులు కల్పించడంతో పాటు భారీగానే బదిలీలు చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ల (ఎస్‌ఈ)కు చీఫ్ ఇంజనీర్లు (సీఈ)గా పదోన్నతులు కల్పించి, ఒకరిని ఈఎన్‌సీ కార్యాలయంలోనూ, మరొకరిని రాష్ట్ర సచివాలయంలో జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోనే 12 మంది ఈఈలకు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు (ఎస్‌ఈ)గా పదోన్నతులు కల్పించి, వారిలో తొమ్మిది మందిని వివిధ జిల్లాల ఎస్‌ఈలుగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరితో పాటు 26 మంది ఈఈలను కూడా బదిలీ చేసింది. మరో ఆరుగురు డిప్యూటీ ఈఈలకు ఈఈలుగా పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్డబ్ల్యూఎస్లోనూ ముగ్గురు ఎస్‌ఈలు, ఎనిమిది మంది ఈఈలను వేర్వేరు స్థానాల్లో ప్రభుత్వం బదిలీ చేసింది.
అటవీశాఖలో 13 మందికి స్థానచలనం
అటవీ శాఖలో 13 మంది రాష్ట్ర కేడర్ అధికారులు బదిలీ అయ్యారు. మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ కన్సర్వేటర్‌గా పనిచేస్తున్న ఎం.శామ్యూల్‌ను అనకాపల్లి డీఎఫ్‌వోగా, కృష్ణాజిల్లా డీఎఫ్‌వోగా ఉన్న కె.రాజశేఖరరావును ప్రకాశం సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. మరికొందరు డీఎఫ్‌వోలను బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇవ్వగా, కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
వాణిజ్యపన్నుల శాఖలో...
వాణిజ్యపన్నుల శాఖలో కమిషనర్‌గా ఉన్న కె.రవిశంకర్‌కు చీఫ్ కమిషనర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, మరో కమిషనర్ డి.రమేష్‌కు విజయవాడ అప్పిలేట్ అడిషనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ముగ్గురు అడిషనల్ కమిషనర్లతోపాటు ఏడుగురు జేసీలు, 14 డీసీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు.
అర్ధరాత్రి కూడా బదిలీల తంతు
బదిలీలకు ఆదివారం ఆఖరి రోజు కావడంతో దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జోన్–1 పరిధిలో 124 మందిని బదిలీ చేస్తూ రెండు ఉత్తర్వులు, పెద్ద ఆలయాల్లో ఆరుగురు ఇంజనీరింగ్ అధికారుల బదిలీకి సంబంధించి ఒక ఉత్తర్వు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment