వైఎస్‌ జగన్‌ హయాంలో మెడిసిన్‌కు మహర్దశ | MBBS seats increased massively under YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ హయాంలో మెడిసిన్‌కు మహర్దశ

Published Wed, Jul 31 2024 5:59 AM | Last Updated on Wed, Jul 31 2024 6:00 AM

MBBS seats increased massively under YS Jagan

2019–24 మధ్య కొత్తగా అందుబాటులోకి 1,585 మెడికల్‌ సీట్లు

2018–19లో బాబు దిగిపోయేనాటికి 4,900 సీట్లే

వైఎస్‌ జగన్‌ హయాంలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

2023–24లో 6,485కు పెరిగిన సీట్లు

అత్యధిక వైద్య సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీది 7వ స్థానం

లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ  మంత్రి జేపీ నడ్డా వెల్లడి

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగా వైద్య రంగాన్ని విస్తృతం చేశారు. మారుమూల ప్రజలకు కూడా అత్యాధునిక వసతులతో స్పెషాలిటీ వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 వైద్య కళాశాలల్లో తరగతుల, వైద్యం ప్రారంభం కాగా, ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలు చేరువవడమే కాకుండా, వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు కూడా భారీగా పెరిగాయి. 

ఒక్కడ 2023–24 విద్యా సంవత్సరంలోనే కొత్తగా ఏర్పాటైన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంమీద 2019–20 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 1,585 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా లోక్‌ సభలో వెల్లడించింది. 

2018–19లో (నాటి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెడికల్‌ సీట్లు 4,900 మాత్రమే ఉన్నట్టు  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా లోక్‌సభలో తెలిపారు. ఆ తర్వాతి ఐదేళ్లలో (వైఎస్‌ జగన్‌ హయాంలో) 1,585 సీట్లు పెరిగి 6,485కు చేరినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక మెడికల్‌ సీట్లు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మూడు దశల్లో దేశవ్యాప్తంగా 157 కాలేజీలను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement