కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ చాంబర్స్ ప్రతినిధులు
లబ్బీపేట (విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన పలు అంశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం సమావేశమైన వారు పలు అంశాలపై చర్చించారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో ప్రతిపాదించిన ఆరు ఇండస్ట్రీయల్ నోడ్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని, రాష్ట్రం కోసం ప్రతిపాదించిన మూడు మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కుల వేగవంతమైన అభివృద్ధి, ఫోర్ట్ లీడ్ ఎకానమీ అభివృద్ధికి తోడ్పాటు వంటి అంశాలపై చర్చించారు.
ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌రేటింగ్, సిబిల్ స్కోర్‌లను సులభతరం చేయడం, ఆలస్యమైన చెల్లింపుల సమస్య, ఎంఎస్‌ఎంఈ నుంచి తప్పనిసరి సేకరణ వంటి అంశాలను పరిష్కరించాలని సూచించారు. విజయవాడ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని పునరుద్ధరించి, సర్వీసులు పెంచాలని, ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలతో కార్గో సౌకర్యాలను అందించాలని ఆమెను కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు ప్రతిపాదిత వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా అనేక విషయాలు చర్చించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ బి రాజశేఖర్, సీఐఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్, ఆల్ ఇండియా మిర్చి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు, ఏపీ ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాయన వెంకట్రావు, క్రెడాయ్ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రమణరావు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి, కోవే ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు రాధిక ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment