1. విజయనగరం జిల్లా గుంకలాంలో రూపొందించిన భారీ లేవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న లబ్ధిదారులు. 2. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం అరగొండ పంచాయతీ బీసీ కాలనీలో లబ్ధిదారు ఎన్.హసీనా మూడు నెలల్లో ఇంటిని పూర్తిగా నిర్మించుకుంది. ఇంటి ముందు ఆనందంతో ఉన్న దంపతులు.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం విజయవంతమయ్యింది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు లక్ష ఇళ్లకు శంకుస్థాపనలు చేయించాలని లక్ష్యం నిర్ధేశించుకోగా, లబ్ధిదారులు కలసి రావడంతో 158 శాతం అధికంగా ఇళ్లకు శంకుస్థాపన జరిగింది. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారి. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శనివారం, ఆదివారం కూడా కొనసాగనుంది.
సాక్షి, అమరావతి: సొంతింట్లో ఉండాలనేది అందరి కల. ఇది పెద్దోళ్లకు సుసాధ్యమైనా, పేదోళ్లకు మాత్రం కష్టసాధ్యం. సొంతింటి కల విషయంలో ఇక పేదోళ్లు దిగులు పడాల్సిన అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి చేయి పట్టుకుని నడిపిస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా తొలి విడతలోనే ఏకంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలో సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి నిరుపేదలు పోటీపడ్డారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణానికి కుటుంబ సభ్యులతో కలిసి పోటాపోటీగా శంకుస్థాపనలు చేయడంతో రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా.. 157 శాతం ఇళ్లకు శంకుస్థాపన జరగడం గమనార్హం. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శని, ఆదివారాల్లో కూడా కొనసాగనుంది.
అనంతపురం జిల్లా ఉరవకొండలోని లేఅవుట్ వద్ద లబ్ధిదారులు
పేదోళ్లందరికీ సొంతిల్లు
రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ పథకం కింద మొదటి దశలో 8,905 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని గతనెల 3న సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ గృహాలను 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. జగన్ దృఢ సంకల్పాన్ని సాకారం చేసేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా ముందుకు కదిలింది.
ఈనెల 1, 3, 4న మూడు రోజుల్లో రోజుకు లక్ష చొప్పున మూడు లక్షల ఇళ్లకు లబ్ధిదారులతో శంకుస్థాపన చేయించాలని నిర్దేశించుకుంది. ఈ మూడు రోజులూ యజ్ఞంలా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజున 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
రికార్డు స్థాయిలో శంకుస్థాపనలు
లబ్ధిదారులు గురువారం ఉదయమే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తమకు కేటాయించిన స్థలంలో.. సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అధికారుల సమక్షంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం పండిత విల్లూరులోని వైఎస్సార్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కృష్ణా జిల్లా పెనమలూరులోని కాలనీలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు, 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు పోటాపోటీగా కదలిరావడంతో గురువారం రాత్రి 7 గంటల సమయానికి 2,02,190 గృహాలకు శంకుస్థాపనలు జరిగాయి.
ప్రత్యేక జాయింట్ కలెక్టర్ ద్వారా పర్యవేక్షణ
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 68,381 ఎకరాల భూమిని 30.76 లక్షల మంది నిరుపేద మహిళలకు ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసి, రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున స్థలాలను పంపిణీ చేసి గృహాలను కూడా మంజూరు చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.50,944 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, భూగర్భ మురుగునీటి కాలువల వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తొలి దశలో 8,905 కాలనీల్లో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్–హౌసింగ్ పదవి సృష్టించి, యువ ఐఏఎస్ అధికారులను నియమించింది. పనులను పరుగులు పెట్టిస్తోంది.
కృష్ణాజిల్లా నున్న గ్రామంలో ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన పనుల్లో లబ్ధిదారులు
యజ్ఞంలా ఇళ్ల శంకుస్థాపన
మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజు లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో 2.02 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ ఒకే రోజున లబ్ధిదారులే ఇంత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న దాఖలాలు లేవు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్లను జూన్‌లోగా పూర్తి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పం. ఆలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం సమష్టిగా కృషి చేస్తున్నాం. తొలి రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జేసీలు, అధికారులు, లబ్ధిదారులకు కృతజ్ఞతలు.
– అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment