కన్నీటి వీడ్కోలు | Mekapati Goutham Reddy funeral with official formalities | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు

Published Thu, Feb 24 2022 3:49 AM | Last Updated on Thu, Feb 24 2022 3:23 PM

Mekapati Goutham Reddy funeral with official formalities - Sakshi

మేకపాటి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలుకుతున్న ఆత్మీయులు, అశేష ప్రజలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ నెల్లూరు సెంట్రల్‌: ఆత్మీయులు, అశేష జన సందోహం వెంట రాగా.. జోహారన్నా.. మెట్ట ప్రాంత ముద్దుబిడ్డ అమర్‌రహే అనే నినాదాల నడుమ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు, బంధుమిత్రులు, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు కడసారి గౌతమ్‌రెడ్డి పార్ధివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి 11.59 గంటలకు చితికి నిప్పు అంటించగా పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి తుపాకులు పేల్చారు. 

స్వగ్రామం మీదుగా ఉదయగిరికి 
నెల్లూరు డైకస్‌ రోడ్డులోని మేకపాటి నివాసం నుంచి అంతిమయాత్ర ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, పి.అనిల్‌కుమార్‌ యాదవ్, ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య కాన్వాయ్‌ వెంట రాగా జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, నెల్లూరు పాళెం, డీసీపల్లె, మర్రిపాడు, బ్రాహ్మణపల్లె, నందిపాడు మీదుగా అంతిమయాత్ర 10.45 గంటలకు ఉదయగిరికి చేరుకుంది. కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం మేకపాటి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో పార్థివదేహాన్ని ఉంచారు. 11.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి దంపతులు అక్కడకు చేరుకోగా అప్పటికే అంతిమ సంస్కారానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని సిద్ధం చేశారు. శాస్త్రోక్తంగా కుమారుడు ముందు నడుస్తుండగా పాడెను బంధుమిత్రులు చితి వరకూ మోసుకొచ్చారు. 

బరువెక్కిన హృదయాలతో..
బరువెక్కిన హృదయాలు, అశ్రు నయనాలతో మేకపాటి కుటుంబీకులు గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి వేదన వర్ణనాతీతం. సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె సాయి అనన్య, కుమారుడు కృష్ణార్జునరెడ్డి, సోదరులు విక్రమ్‌రెడ్డి, పృధ్వీరెడ్డి, సమీప బంధువులు చివర చూపు అనంతరం చితిపై గంధపు చెక్కలను పేర్చారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చితిపై గంధపు చెక్కలు పేర్చి నెయ్యి వేశారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన అనంతరం చితికి కృష్ణార్జునరెడ్డి నిప్పు అంటించారు. 

మా ధైర్యం వెళ్లిపోయింది.. 
తమ ఆత్మీయ నేతను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రహదారులపైకి తరలి వచ్చారు. కాన్వాయ్‌పై ఊరూరా పూలవర్షం కురిపించారు. మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంబులెన్స్‌ను పట్టుకుని వెక్కి వెక్కి విలపించారు. ఆప్యాయంగా పలకరించే మా ధైర్యం వెళ్లిపోయిందంటూ రోదించారు. 

తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు
మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు  హాజరై నివాళులర్పించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకరనారాయణ, పినిపె విశ్వరూప్, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, డాక్టర్‌ గురుమూర్తి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గల్లా జయదేవ్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్‌చక్రవర్తి, డీసీ గోవింద రెడ్డి, పోతుల సునీత, వాకాటి నారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కె.శ్రీనివాసులు, శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి,  రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావు, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కరణం బలరాం, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, అన్నా రాంబాబు, డా.సుధ, మేడా మల్లికార్జున రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హఫీజ్‌ ఖాన్, కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్‌ శిద్దారెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి, బిజేంద్రనాథరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే.. 
ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందినా నెల్లూరుతో మేకపాటి కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. డైకస్‌ రోడ్డులోని నివాసాన్ని మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎంతో ఇష్టపడి కట్టించుకున్నారు. అలాంటి ఇంటి నుంచి చివరిసారి వెళ్లిపోతున్నావా.. అంటూ   అంతిమ యాత్ర ప్రారంభం కాగానే అంతా కన్నీటి పర్యంతమయ్యారు.

నాన్నకు నచ్చిన దుస్తుల్లో.. 
గౌతమ్‌రెడ్డి ఎక్కువగా లాల్చి, పైజామా ధరిస్తుంటారు. జిల్లాలో ఎక్కడకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా ఎక్కువగా వీటినే ధరిస్తారు. తమ తండ్రికి ఎంతో ఇష్టమైన లాల్చి, పైజామాను కుమారుడు కృష్ణార్జునరెడ్డి, కుమార్తె అనన్య చివరిసారిగా తొడిగి నివాళులు అర్పించారు. 

ఎటైనా ‘డిఫెండర్‌’లోనే..
మంత్రి గౌతమ్‌రెడ్డికి లగ్జరీ కార్లు అంటే ఆసక్తి. ఇటీవలే ఆయన డిఫెండర్‌ కారును కొనుగోలు చేశారు. ఏ కార్యక్రమానికైనా అందులోనే వెళ్లేవారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆ కారును బాగా ఇష్టపడేవారని పలువురు అభిమానులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement