సాక్షి, గుంటూరు: ఊరూవాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిపారు. సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి.
ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. పముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డ్యాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించానని తెలిపారు. ‘‘గతంలో డ్యాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అని విమర్శించారు. అందుకే సంబరాలు రాంబాబు అనే పేరుతో పాట రాయించాను. సంక్రాంతి వస్తే నేను సంబరాలు రాంబాబునే. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుడిని.. టీడీపీ, జనసేన ఆనైతికంగా పొత్తును కుదుర్చుకున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను భోగిమంటల్లో వేసి తగలపెడతారు’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి వేడుకల్లో మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) పాల్గొన్నారు. విజయవాడలోని క్రీస్తు రాజపురం 5వ డివిజన్ లో భోగి సంబరాల్లో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, కార్పొరేటర్లు , వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ లో తెల్లవారుజామున భోగి వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment