
సాక్షి, అమరావతి: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమనాలు రేకెత్తిస్తున్నారన్నారు. ఆడిట్ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని.. ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చని.. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు.
‘‘సీఎఫ్‌ఎంఎస్ వచ్చాక ట్రెజరీ ద్వారా వ్యవస్థ నడవడం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. 10895 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్ లోపం వల్ల పీడీ అకౌంట్స్ నుంచి వెనక్కి వచ్చాయి. సీఎఫ్‌ఎంఎస్ ప్రోగ్రామింగ్‌లో లోపాలు ఉన్నాయి. తెలంగాణ వాటాపై ఏపీ అప్పు తెస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు కడుతున్నాయి. ప్రజలకు సబ్సిడీలు ఏమీ ఇవ్వకూడదని చంద్రబాబు అన్నారు. కోవిడ్ సమయంలోనూ 1.31 కోట్ల మందికి సంక్షేమం అందించాం. జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయాలని కుట్రలు చేస్తున్నారని’’ మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment