సాక్షి, తాడేపల్లి: ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో రూ. 371 కోట్లు నొక్కేసి సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిపోయాడన్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.
వాస్తవం ఇది అయితే.. వాస్తవాలను వక్రీకరిస్తూ, టీడీపీకి చెందిన ఒక సామాజికవర్గం వారు చంద్రబాబు అరెస్టు అన్యాయం-అక్రమం, సేవ్ డెమోక్రసీ అంటూ మాట్లాడుతున్నారు. అంటే ప్రజా ధనాన్ని లూటీ చేసిన బాబును అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టా..? అని నిలదీస్తున్నామన్నారు.
అసెంబ్లీలో చర్చించరు..బయట మాత్రం సింపతీ గేమ్
అలాగే, 'చంద్రబాబు చేసిన స్కాములు-అరెస్టులపై అసెంబ్లీలో చర్చిద్దామంటే.. వాళ్ళు చర్చకు రారు. కానీ, చంద్రబాబును ఈ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసిందని పబ్లిసిటీ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చిద్దామంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరూ లేరు, అంతా పారిపోయారు.
ఒక్కొక్కరికి కోటిన్నర ఇచ్చి లాయర్లను రప్పించి వాదనలు వినిపించినా.. వారు ఎంతసేపటికీ టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తారు తప్పితే.. చంద్రబాబు అవినీతి చేయలేదు అని ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ కార్యకర్తలు సైతం నమ్మరు, ఎన్టీఆర్ కుటుంబం నమ్మదు.. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు' అని మంత్రి మండిపడ్డారు.
బాబు పాలన అంతా స్కాములే.. స్కీముల్లేవ్
'చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములే. ఆయన 14 ఏళ్ళ పాలన అంతా స్కాముల మయమే.. జగన్ గారి పరిపాలనలో ప్రతిదీ పేద ప్రజలకోసం అమలు చేస్తున్న సంక్షేమ స్కీములే. బాబు నిప్పు, నీతిమంతుడే అయితే ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను అమెరికాకు పంపించి, ఎందుకు దాచిపెట్టారు? నీ.. పీఎస్ శ్రీనివాస్కు హవాలా మార్గంలో నిధులు రాకపోతే.. అతన్ని ఎందుకు పంపించేశావు? అలా, మీ స్కాములకు లాబియిస్టుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని(ఎంవీపీ) దుబాయ్ పారిపోయాడు! చంద్రబాబు చేసిన స్కాములతో ఆయన పాపం పండింది. బాబు తప్పులు చేశాడు కాబట్టే.. మీరు చొక్కాలు విప్పి రోడ్డున పడుతున్నారు' అని విమర్శించారు.
బాబుకు వెన్నుపోటు పొడిచేందుకు లోకేష్, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్?
'లోకేష్ ఎక్కడ దాక్కున్నాడు..? చంద్రబాబును అరెస్టు చేస్తే.. నా తండ్రి దగ్గరకు వెళ్ళనివ్వరా.. అని రెచ్చిపోయి, ప్లకార్డులు పట్టుకుని, కింద కూర్చుని నానా హడావుడి చేశాడు. ఇప్పుడేమో ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. నీ తండ్రి జైల్లో ఉంటే.. నీవు కూడా ఈ స్కాముల్లో పాత్రధారుడివి కాబట్టి, ఢిల్లీలో నక్కావా..?
తండ్రి జైల్లో ఉంటే.. బాలకృష్ణతో కలిసి లోకేష్ పార్టీని లాక్కోవాలని చూస్తున్నట్టు ఉన్నారు. ఎన్టీఆర్ గారికి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే.. రివర్స్లో ఆయనను పొడిచేందుకు మామ, అల్లుళ్ళు బాలకృష్ణ, లోకేష్లు రెడీ అయినట్టు ఉన్నారు. అందుకే, జైల్లో ఉన్న తండ్రిని పట్టించుకోకుండా, సీక్రెట్‌గా వీళ్ళు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో ఆయన కుర్చీపైకి ఎక్కి నిల్చొన్నాడు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే.. చంద్రబాబుకు తగిన శాస్తి జరగాల్సిందే' అంటూ చెబుతూ వచ్చారు.
బాలకృష్ణ తొడకొడితే బిల్డింగ్ కూలుతుందేమో అని భయపడ్డాం!
'బాలకృష్ణ మొన్న స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి మీసం మెలేసి, తొడగొట్టాడు. దాంతో చంద్రబాబు దోపిడీ చేసి, నిర్మించిన టెంపరరీ అసెంబ్లీ బిల్డింగ్‌లు ఎక్కడ కూలిపోతాయోనని మేమంతా భయపడ్డాను. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒంటి చేత్తో పది, ఇరవై లారీలను ఎత్తేస్తాడు. ఆయన తొడకొడితే భూమి బద్ధలైపోతుంది. అందుకే, యనమల నోరు తెరవట్లేదు?
చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు ఈ స్కాములు జరగలేదని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా.. ఆయన కూడా నోరు తెరవడం లేదు. ఎందుకంటే, బాబు తర్వాత యనమలకే ఈ అవినీతి గురించి బాగా తెలుసు. అవినీతి జరిగిందన్నది యనమలకు తెలుసు.
నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్?
'చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులు, దుర్మార్గులు, తన తల్లిని తిట్టారు, నియోజకవర్గానికి వెయ్యి కోట్లు చొప్పున అవినీతి చేశారు.. అని మాట్లాడిన పవన్ కల్యాణ్- ఈరోజు ఎందుకు నోరు విప్పడు. ఆరోజు పవన్ కల్యాణ్ మాట్లాడిన అవినీతి కేసులే ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకున్నాయి. అప్పుడు అవినీతి అయినవి.. ఇప్పుడు మీ కళ్ళకు నీతివిగా కనిపిస్తున్నాయా..? దేశానికి ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీనే అరెస్టు చేశారు. బాబు ఏమైనా దిగొచ్చాడా..? తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే.
స్కిల్ స్కాంకు సంబంధించిన నోట్ ఫైళ్ళపై.. చంద్రబాబు 13 సంతకాలు పెట్టాడు. పైగా, బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే.. చైర్మన్కు ఏమిటి సంబంధం అని అవగాహన లేకుండా లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే స్వయంగా నోట్ ఫైళ్ళ మీద సంతకాలు చేసి, నిధులు విడుదలకు ఒత్తిళ్ళు చేస్తే.. అది తప్పు కాకుండా ఒప్పు అవుతుందా..? చంద్రబాబు తప్పు చేశాడు, సాక్ష్యాలతో సహా చిక్కాడు కాబట్టి.. ఆయన ఏ కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. ఏమి అడిగినా 'తెలియదు, గుర్తులేదు, మరచిపోయాను..' అని ఒకటే సమాధానం చెబుతున్నాడంటూ' మండిపడ్డారు.
భేషుగ్గా జగన్ పరిపాలన!
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు దేశం యావత్తు చూస్తుంటే.. ఇక, మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని ప్రభుత్వంపై ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రోజూ బురద జల్లుతున్నారు.
గత నాలుగేళ్ళ సీఎం జగన్ పరిపాలనలో విద్యారంగం మొదలు సచివాలయ వ్యవస్థ.. పారదర్శకమైన పరిపాలన.. సామాజిక న్యాయం.. ప్రతి ఇంటికీ మూడు-నాలుగు సంక్షేమ పథకాలు అందేలా.. గొప్పగా పాలన చేస్తూ, ఏపీ దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ముందుంది. పేదరికం 11 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నాం. జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ మేలు జరుగుతుంటే.. వీళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు. అందుకే, ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు’ అని మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment