సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సస్పెండ్ జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగితే తమకు అంటగట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలియకుండా లోకేష్ ట్వీట్లు చేస్తే, చంద్రబాబు ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు. ‘‘జడ్జి సోదరుడిపై దాడి చేసింది టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అని తేలింది. ఇప్పుడు చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనించాలి. రామకృష్ణ అనే వ్యక్తి వెనుక టీడీపీ ఉందని తెలిసిపోతోంది. ప్రతాప్ రెడ్డి వైసీపీ అని తేలితే నేను రాజకీయాలు మానుకుంటా. టీడీపీకి దళితులు, మైనారిటిలపై గౌరవం లేదు. అధికారం పోయేసరికి వారిపై చంద్రబాబుకు ప్రేమ పుట్టింది’ అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. (చదవండి: ‘అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే కోపం’)
సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకం ద్వారా 2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘పాదయాత్ర సమయంలో సీఎం జగన్ కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను గమనించారు. అన్ని జిల్లాల్లోనూ మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఆనాడే అన్ని ప్రాంతాలకు నీరు అందించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. సాగునీరందని భూములకు రూ. 2340 కోట్లతో బోర్లు వేయాలనుకున్నారు. కానీ అప్పటికప్పుడు మరో రూ.1600 కోట్లతో మోటార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.164 నియోజకవర్గాల్లో ఒక్కో రిగ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఒక్క రైతు వైఎస్ జగన్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment