సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్‌లైన్ పోర్టల్‌ను పారదర్శకంగా నిర్వహిస్తుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ ఫిల్మ్ చాంబర్ వినతి మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీ సినిమా నియంత్రణ సవరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బదులు మంత్రి నాని గురువారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన పలు సందేహాలకు బదులిచ్చారు.
ప్రజల వినోదానికి ఇబ్బందులు లేకుండా చేయడానికే ఈ బిల్లు తెచ్చామన్నారు. దీనిపై ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారితో పలుమార్లు చర్చలు జరిపామని గుర్తు చేశారు. అందరి ఆమోదంతోనే ఆన్‌లైన్ టికెట్ పద్ధతిని తెస్తున్నామన్నారు. రూ.వందల కోట్ల పెట్టుబడితో బ్లాక్‌బస్టర్ సినిమాలంటూ నిర్ణయించిన దాని కంటే అధిక ధరలకు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వీరిలో కొందరు ప్రభుత్వానికి జీఎస్‌టీ కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రాబట్టుకోవడానికి సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ఒకే రోజు అత్యధిక షోలు వేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ నియంత్రిస్తూ.. ప్రేక్షకుడికి టికెట్ ధరల భారం లేకుండా కొత్త విధానానికి మొగ్గు చూపామన్నారు. నిర్ణీత సమయాల్లోనే సినిమా షోలు ప్రదర్శించేలా చూస్తామని చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా రెండు వర్సిటీలు..
రాష్ట్రంలో ప్రతి జిల్లాకు విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను శాసనమండలిలో గురువారం ఆయన ప్రవేశపెట్టారు. ప్రకాశం జిల్లాలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీగా, కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)కి అనుబంధంగా విజయనగరంలో ఉన్న జేఎన్‌టీయూ కళాశాలను గురజాడ విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సురేష్ బదులిస్తూ నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీకి తిక్కన పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment