
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతోంది. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ అండ్ సిక్కిం నుంచి, దక్షిణ ఒడిశా తీర ప్రాంతం వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్లు ఎత్తున ఉంది.
నైరుతి బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్లు నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య ఉంది. ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళవారం విశాఖలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.