సాక్షి, అమరావతి :పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం అండగా నిలుస్తోంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి జబ్బు బారిన పడి చికిత్స పొందాక, డిశ్చార్జ్ అయిన రోజు నుంచి తిరిగి కోలుకునే వరకు రోజుకు రూ.225 చొప్పున లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పది మాసాల్లోనే 2,10,248 మందికి పైగా లబ్ధి పొందారు. వివిధ ఆస్పత్రుల్లో వైద్యం పొంది, డిశ్చార్జి అయిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి సొమ్ము చేరుతోంది. దీంతో ఆ కుటుంబాల పోషణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పటి వరకూ ఆరోగ్య ఆసరా కోసం దాదాపు రూ.134 కోట్లు వ్యయం చేశారు. నెలకు సగటున రూ.15 కోట్లు పైనే ఖర్చవుతోంది.
ఆసరా చెల్లింపు ఇలా..
- మొత్తం 836 జబ్బులకు వైద్యం పూర్తయ్యాక కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా ఇస్తున్నారు.
- పేషెంట్ డిశ్చార్జి అయ్యే సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటారు.
- పేషెంట్ కోలుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో డాక్టర్లు నిర్ధారిస్తారు.
- ఆ మేరకు రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ఇస్తారు.
- బ్యాంకు ఖాతాలేని వారు కుటుంబ సభ్యుల ఖాతా ఇవ్వొచ్చు.
- ఆసరాకు సంబంధించి ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
ఆరోగ్య ఆసరా లబ్ధిదారులు నెల | లబ్ధిదారులు | వ్యయం (రూ.కోట్లలో) |
2019 డిసెంబర్ | 28,335 | 18.92 |
2020 జనవరి | 28,333 | 18.80 |
2020 ఫిబ్రవరి | 28,680 | 19.57 |
2020 మార్చి | 28,741 | 19.23 |
2020 ఏప్రిల్ | 10,028 | 5.89 |
2020 మే | 14,915 | 8.83 |
2020 జూన్ | 23,800 | 14.58 |
2020 జూలై | 19,431 | 11.83 |
2020 ఆగస్ట్ | 15,127 | 8.72 |
2020 సెప్టెంబర్ | 12,858 | 7.52 |
Comments
Please login to add a commentAdd a comment