మాటలకందని మహా విషాదం | More than 57 people died in Vijayawada flood | Sakshi
Sakshi News home page

మాటలకందని మహా విషాదం

Published Sat, Sep 7 2024 3:16 AM | Last Updated on Sat, Sep 7 2024 6:59 AM

More than 57 people died in Vijayawada flood

57కు పైగా విజయవాడ వరద మృతులు  

వరదల్లో పలువురు ఇళ్లల్లోనే జలసమాధి 

దీనావస్థలో పలు కుటుంబాలు  

సమస్తం వరద పాలు

ఇవన్నీ సర్కారు హత్యలే 

బాధిత కుటుంబాలను కదిపితే అన్ని కన్నీటి గాథలే  

మానవ తప్పిదంతో విలయం సృష్టించిన బుడమేరు బెజవాడలో అంతులేని విషాదాన్ని మిగి ల్చింది. ఎవరిని కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే తమను ముంచేసిందని ఆక్రోశిస్తున్నారు. భారీ వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడంతో ఎన్నో ప్రాణాలు నీట్లో కలిసిపోయాయి. పిల్లలను రక్షించేందుకు వెళ్లిన తండ్రులు... తండ్రులను కాపాడుకొనేందుకు వెళ్లిన పిల్లలు కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయారు. 

పలు కుటుంబాలు  పెద్ద దిక్కు కోల్పోవడంతో అనాధలుగా మారాయి. తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కన్నీటి పర్యంతం అయ్యారు. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. విజయవాడ వరదల్లో ఇప్పటికే 50 మందికి పైగా మృతి చెందారు. మృతుల కుటుంబాల కన్నీటి గాథలు హృదయ విదారకంగా ఉన్నాయి.    – సాక్షి నెట్‌వర్క్‌

ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నాం..  
నా భర్త కరుభుక్త పోలినాయుడు (52) ముఠా పనులు చేస్తుంటాడు. మేము న్యూరాజరాజేశ్వరీపేటలో ఉంటున్నాం. మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూలానే శనివారం పనికి వెళ్లిన నా భర్త ఆదివారం తెల్లవారుజామున మాకు ఫోన్‌ చేసి పని అయిపోయింది..ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. కానీ ఇంతవరకు రాలేదు. నా భర్త తన స్నేహితులతో కలిసి సింగ్‌నగర్‌ నుంచి న్యూరాజరాజేశ్వరీపేటకు వస్తుండగా బుడమేరు కాలువ వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహాన్ని దాటుదామని ప్రయత్నించాడు. 

కొంతదూరం ముందుకు వెళ్లాడని..ప్రవాహ తాకిడి అధికం అవ్వడంతో అదుపుతప్పి కిందపడిపోయి కొట్టుకుపోయాడని నా భర్త స్నేహితులు చెబుతున్నారు. ఇందిరానాయక్‌నగర్, దేవినగర్, బుడమేరు వంతెన పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ నా భర్త ఆచూకీ లభించలేదు. అధికారులను ఎంత బతిమాలినా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. – గల్లంతైన పోలినాయుడు భార్య రామలక్ష్మి, న్యూ రాజరాజ్వేరిపేట

మమ్మల్ని కాపాడి.. మృతి చెందారు  
సీఎస్‌ఐ సంఘ కాపరి రెవ.తగరం శ్యామ్‌బాబు (48) మా నాన్నగారు. గత ఆదివారం నేను,అమ్మ ఇంటిలోనే ఉన్నాం. డాడీ చర్చిలో ప్రార్థన కోసం అని బయటకు వెళ్లారు. ఇంతలో వరద వచ్చి0ది. వెంటనే ఆయన ఇంటికి అతికష్టం మీద వచ్చారు. ఆ రాత్రి అంతా చీకట్లోనే ఉన్నాము. నాకు ఒంట్లో బాగోకపోవడంతో నన్ను, అమ్మను చుట్టుపక్కల వారి సాయంతో మా బంధువలు ఇంటికి చేర్చారు. తాను తరు­వాత వస్తానని చెప్పారు. కానీ రాలేదు. 

డాడీ ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ అవడంతో చుట్టు­పక్కలవారిని అడిగాం. అక్కడ చెట్ల మధ్యలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారని తెలిసింది. అక్కడకు వెళ్లి చూడగా ఆ మృతదేహానికి ఉన్న ఉంగరం, వేసుకున్న టీషర్టు చూసి చనిపోయింది మా డాడీనే అని గుర్తించాం. సెపె్టంబర్‌ 6న మా డాడీ పుట్టినరోజు.. ఆ రోజు మా చుట్టాలందరిని పిలిచి వేడుకలు చేసుకుందామనుకున్నాం.. కానీ డాడీ చనిపోయారు.. ఇదంతా కలలా ఉంది.. మా కుటుంబానికి మా నాన్నే జీవనాధారం.  ఇప్పుడు మేం ఎలా బ్రతకాలి? – దైవ ప్రజ్వల్, శ్యామ్‌బాబు కుమారుడు

మూడు రోజులుగా మృతదేహంతోనే..
మా అమ్మ గుంజా రమణమ్మ (52) నగర పాలక సంస్థలో శానిటేషన్‌ కార్మికురాలిగా పనిచేసేది. ప్రమాదంలో కాలు విరగడంతో సరిగా నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆమె స్థానంలో ఆమె కుమార్తె అయిన నన్ను (డేరంగుల బుజ్జి) విధుల్లో చేర్చింది. నాకు ఇద్దరు సోదరులున్నారు. సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంటర్‌లో ఉంటున్న నా దగ్గరే మా అమ్మ ఉంటుంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు వరద ముంచెత్తింది. ఇంట్లో ఉన్న నేను, నా పిల్లలు చెక్కను అడ్డుపెట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాం. 

అమ్మకు కాలు విరగడంతో నడవలేని స్థితిలో ఉంటూ వరద ముంపులో మునిగిపోయి ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. మూడు రోజులుగా ఒకే చెక్కపై నాతో పాటు నా పిల్లలు అలాగే ఉండిపోయాము. అటుగా వచ్చిన బోట్లు వారిని ఎంత బ్రతిమిలాడినా మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదే ప్రాంతానికి చెందిన ఒకాయన థర్మోకోల షీట్లతో ఫంటులా తయారు చేసి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి అమ్మ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. – మృతురాలు రమణమ్మ కూతురు బుజ్జి  

చెల్లి పెళ్లి చేద్దామన్నాడు.. ఇంతలోనే
మా బావ బీసులు లక్ష్మీరాజు (20). మాది తెలంగాణలోని కరీంనగర్‌. వైఎస్సార్‌ కాలనీ సమీపంలోని పాముల కాలువ వద్ద లక్ష్మిరాజు ఫ్లెక్సీ పనులు చేస్తుంటాడు. ఆయన తండ్రి శంకర్‌ మృతి చెందడంతో...తల్లి నిర్మల, ఇద్దరు చెల్లెళ్లను కరీంనగర్‌లోనే ఉంచి ఇక్కడ మా బావ డబ్బులు సంపాదించి వాళ్లకు పంపుతుండేవాడు. ఇతను పంపే డబ్బులతోనే వారు జీవనం సాగిస్తుంటారు. త్వరలోనే ఒక చెల్లి పెళ్లి కూడా చేయాలని నాతో తరచుగా చెప్పేవాడు. 

సెప్టెంబర్ 1న పాముల కాలువ వద్ద వరదలో గల్లంతయ్యాడు. అతని ఫోన్‌ నంబరు కూడా పనిచేయక పోవడంతో మా బావ కుటుంబసభ్యులు నాకు చెప్పారు. మార్చురీలో ఉన్న మృతదేహాల్లో ఒకటి మా బావగా బుధవారం గుర్తించాను. సమాచారాన్ని కరీంగనర్‌లో ఉన్న మా బావ కుటుంబీకులకు చెప్పాను. అక్కడ వారి పరిస్థితి ఏంటో తలుచుకుంటే బాధగా ఉంది..      – శివరామకృష్ణ, లక్ష్మీరాజు బావ, ఇతర సహచరులు

ఏమయ్యాడో..ఆచూకీ కోసం  
మేము గాందీనగర్‌లో ఉంటున్నాం. నా భర్త దారా మహే‹Ùబాబు (42) నగరంలోని ఓ ప్రైవేట్‌ ఇమేజింగ్‌ సెంటర్‌లో పనిచేస్తుంటాడు. మాకు ఇద్దరు పిల్లలు. ప్రతి ఆదివారం నా భర్త వాంబేకాలనీలో చర్చికి వెళ్తుంటాడు. ఈ నెల 1న ఉదయం చర్చికి అని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. వాంబేకాలనీ వెళ్లిన తర్వాత చర్చి తెరవలేదని చెప్పడంతో వెనుతిరిగాడు. 

సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంటర్‌కు వచ్చేసరికి వరద రావడంతో పెట్రోలు బంకు వద్ద ఆగానని, కొద్దిసేపట్లో ఎలా అయినా వచ్చేస్తా­నని నాతో చెప్పాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది. సింగ్‌నగర్‌లోనే ఆయన బంధువులు ఉండటంతో అక్కడికి వెళ్లి ఉండవచ్చునని అనుకున్నాను. అయితే నా భర్త వాళ్లింటికి రాలే­దని నాతో చెప్పారు. నా భర్త ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. ఏమయ్యాడో అని భయంగా ఉంది. 
– మహే‹Ùబాబు భార్య శాంతికుమారి, తమ్ముడు మనోజ్‌ , కుటుంబసభ్యులు  

తండ్రీ, కొడుకులిద్దరూ జల సమాధి 
మా అన్న కొల్లిపర వెంకటేశ్వరరావు (65) గుణదల కార్మెల్‌నగర్‌ ప్రాంతంలో డైరీ ఫామ్‌ నిర్వహిస్తుంటాడు. గత ఆదివారం అక్కడికి వెళ్లాడు. ఆయన ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆయన కుమారుడు సాయి సందీప్‌ (33) కూడా అక్కడికి వెళ్లాడు. సందీప్‌ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉదోగం చేస్తున్నాడు. సందీప్‌కు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. 

సందీప్‌ కూడా ఎంతకీ రాకపోవడంతో వదిన నాకు ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పింది. నేను అక్కడికి వెళ్లి వెతికాను. వరద ఉధృతి పెరుగుతుండటంతో మళ్లీ సోమవారం ఉదయం కార్మెల్‌నగర్‌కి వెళ్లి ఇద్దరి కోసం గాలించాను. రోడ్డు పక్కన ఓ మృతదేహం కనిపించగా దగ్గరకు వెళ్లి చూస్తే అది నా అన్నదే. మరునాడు ఉదయం డైరీ సమీపంలోనే సందీప్‌ మృతదేహం కూడా కనిపించింది.   – కొల్లిపర సత్యనారాయణ.. మృతుని బంధువు  

పెద్ద దిక్కును కోల్పోయాం
నా భర్త నల్లూరి శ్రీనివాసరావు(45) అజిత్‌సింగ్‌నగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. మేము కంసాలిపేటలోని అద్దె ఇంట్లో ఉంటున్నాం. మాకు  ఇద్దరు పిల్లలు. కొడుకు ఇంటర్, కుమార్తె పదో తరగతి చదువుతున్నారు. నా భర్త రెక్కల కష్టంపైనే ఇద్దరి పిల్లల్ని చదివిస్తూ..వృద్ధ్యాప్యంలో ఉన్న అత్తను మా వద్దే ఉంచుకుని బతుకుతున్నాం. ఆదివారం వేకువజామునే నా భర్త హోటల్‌లో పనిచేసేందుకు వెళ్లి, మధ్యాహ్నం వరకూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. 

వరద నీరు బాగా ఎక్కువగా ఉందని, తగ్గిన తర్వాత సాయంత్రం ఇంటికి వస్తా­నని చెప్పాడు. సాయంత్రం ఫోన్‌ చేయగా సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, ప్రభుత్వాస్పత్రికి మృతదేహాలను వెళ్తున్నాయని, అక్కడకు వెళ్లి గుర్తుపట్టమని చెప్పారు. 3 రోజులుగా తిరుగుతున్నాం.. గురువారం తీసుకువచ్చిన మృతదేహాల్లో నా భర్త మృతదేహాన్ని గుర్తించాం. నా భర్తే మా కుటుంబానికి పెద్ద దిక్కు. ఇప్పుడు పిల్లల చదువు, అత్తను ఎవరు చూసుకుంటారు.  – నల్లూరి లక్ష్మిపద్మావతి, మృతుని భార్య, కొడుకు, కూతురు, అత్త  

రెండో కొడుకునూ పోగొట్టుకున్నాం..
మాది విజయవాడ రూరల్‌ మండలం పాతపాడు. మాది పేద కుటుంబం. మాకు ముగ్గురు సంతానం. ఆడపిల్లకు పెళ్లి చేశాం. నేను రాడ్‌బెండింగ్‌ మేస్త్రీగా పనిచేస్తున్నా. పెద్దకొడుకు శ్యామ్‌కుమార్‌ నగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో రోజూవారీ కూలీపై వర్కర్‌గా పనిచేçస్తూ ఐదేళ్ల క్రితం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు.చిన్న కుమారుడు సతీష్‌ గతేడాది పదో తరగతి పరీక్షల్లో సబ్జెక్ట్‌ ఫెయిల్‌ కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. 

గత ఆదివారం సాయంత్రం సతీష్‌ తన ఇద్దరి ఫ్రెండ్స్‌తో కలిసి పాతపాడు–కండ్రిక రహదారిలో వరద చూసేందుకు వెళ్లాడు. అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరిని స్థానికులు కాపాడగా..సతీష్‌ గల్లంతయ్యాడు. మేం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నెల 3న సన్‌సిటీ లేఅవుట్‌ ప్రహరీ గోడ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉందన్న విషయం తెలిసింది. అక్కడికి వెళ్లి చూసి ఆ మృతదేహం సతీ‹Ùదేనని గుర్తించాం. ఇప్పుడు మేం ఎవరి కోసం బతకాలి?  – జాన్సన్, పరిమళ కుమారి దంపతులు  

ప్రభుత్వ నిర్లక్ష్యమే.. మమ్మల్ని చిదిమేసింది  
నా భర్త పేరు పోతల దుర్గారావు (45). మాకు ఇద్దరు కుమారులున్నారు. అంబాపురంలోని రైతు బజారు ఎదురురోడ్డులో ఉంటున్నాం. నా భర్త కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఆరి్థకంగా ఎదుగుతున్నాడు. పెద్ద కొడుకు డిగ్రీ, చిన్న కొడుకు ఇంటర్‌ చదువుతున్నారు. వరద ప్రవాహంలో మా ఇల్లు పూర్తిగా మునిగింది. మమ్మల్ని రక్షించేందుకు నన్ను, పెద్ద కుమారుడిని తీసుకుని పడవలో వైఎస్సార్‌ కాలనీ­లోని ఫ్లైవోవర్‌ వద్ద దుర్గారావు దింపా­డు. 

చిన్న కుమారుడిని తీసుకువచ్చేందుకు మళ్లీ పడవలో వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నా భర్త, చిన్న కుమారుడు గల్లంతయ్యారు. చిన్న కుమారుడికి ఒక దుంగ దొరకడంతో దాన్ని పట్టుకుని ప్రాణా­లను కాపాడుకున్నాడు. నా భర్త నీట మునిగి మృత్యువాత పడ్డారు. ముందస్తు సమాచారం లేకపోవడంతోనే మేం వరదలో చిక్కుకున్నాం. ఫలితంగా నా భర్తను కోల్పోవాల్సి వచ్చింది.    – వరలక్ష్మి మృతుని భార్య  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement