విశాఖపట్నం, సాక్షి: తమ స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. మంగళవారం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్ తనతో పాటు ఎంతో మందికి ప్రేరణ అని చెప్పారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాకు ఒక ఇన్‌స్పిరేషన్. దేశంలోని యువతకు కూడా ఆయన ఇన్‌స్పిరేషనే. విద్యా రంగంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. తన విజన్‌తో బడుల్లో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్ చేశారు. అమ్మ ఒడిలాంటి పథకాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని నిక్ వుజిసిక్ కితాబిచ్చారు.
ఆపై అక్కడి యువతను ఉద్దేశిస్తూ.. యువత తలచుకుంటే ప్రపంచాన్ని మార్చగలరు. మీ విజయాన్ని ఆస్వాదించండి. మీ హార్ట్, మీ మైండ్‌లోకి నెగిటివ్ వాయిస్ రానివ్వకండి. ఎప్పుడూ పాజిటివ్ థాట్స్ తో ఉండండి. మీ కలలను నిజం చేసుకోండి. సహనం అనేది ఒక గొప్ప బలం. ఎన్ని ఓడి దుడుకులు వచ్చినా బలంగా ఉండాలి. ఆశ మాత్రం వదలకూడదు. ఇండియాలో ఇకనుంచి ఐదు భాషలో వీడియో అందిస్తాను అని ప్రసంగించారాయన.
నిక్ గురించి..
చేతులు,కాళ్లు లేకుండా జన్మించిన నిక్, తన తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో ఒక్కోమెట్టు ఎక్కారు. తన జన్మకు ఒక లక్ష్యం ఉండాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదురైనా చలించకుండా, కాళ్లుచేతుల లేకపోయినా మెక్కవోని దీక్షతో ఈత కొట్టడం, సర్ఫింగ్ చేయడం, గోల్ఫ్ ఆడటం, నోటిలో పెన్ను పెట్టుకుని రాయడం, కాలి వేళ్లతో టైపింగ్ చేయడం వంటి విభిన్న సామర్ధ్యాలను అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఒక మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. నిరాశ, నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న యువతకు తన జీవితం ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చేలా ముందుకుస సాగాడు. అన్ని అవయవాలు సక్రమంగా, ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నా క్షణికావేశంతో, చిన్నపాటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతకు నిక్ జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని నిక్ తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపుతూ యువతలో మనోధైర్యాన్ని నింపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment