సాక్షి, అమరావతి: విషాదకర ఘటన నుంచి కూడా లబ్ధి పొందాలనే నీచ మనస్తత్వం ఉన్న రాజకీయ నేత ఒక్క చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. మరణంలోనూ కుల ప్రస్తావన చంద్రబాబుకే చెల్లిందని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబుకు ఫొటో షూట్, డ్రోన్ షాట్ పిచ్చి కారణంగానే కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
జనం బాగా రాకపోయినా, బాగా వచ్చారని చూపించడం కోసం, ఒక చిన్న ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టారని, బాబు తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి 8 మందిని చంపేశారన్నారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అని చంద్రబాబుని ప్రజలు ఛీ కొడుతున్నా.. ఆయనకు పట్టింపులేదన్నారు.
కందుకూరులో బాబు కారణంగా ఇంతమంది చనిపోయినా ఆయనలో పశ్చాత్తాపం లేదని, ముఖంలో ప్రాయశ్చిత్తం కనిపించడంలేదన్నారు. ఈ విషాదం నుంచి కూడా రాజకీయ ప్రయోజనం పొందడానికి శవాలపై పేలాలేరుకునే విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ మరుసటి రోజే నిస్సిగ్గుగా కావలిలో సభ పెట్టారని, చనిపోయినవారి కులాల ప్రస్థావన చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు మాటలకు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment