
సాక్షి, ఢిల్లీ: విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ తరపున ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.ఈ భేటీలో రాష్ట్ర సమస్యలను లేవనెత్తారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బీసీ కులగణన జరిపించాలని కోరామన్నారు.
విశాఖ రైల్వే జోన్ అంశాన్ని లేవనెత్తామని, జోన్ ఏర్పాటు చేసి నాలుగేళ్లైనా అమల్లోకి రాలేదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించామన్నారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు. విశాఖ ఉక్కు ఇప్పుడు నష్టాల్లో లేదన్నారు.
చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..
‘‘ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా మంజూరు చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఉమ్మడి పౌరస్మృతిపై ఇప్పటి వరకూ ఎలాంటి డ్రాప్ట్ లేదు. యూసీసీ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత మా విధానాన్ని ప్రకటిస్తాం. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి’’ అని విజయసాయిరెడ్డి కోరారు.