
సాక్షి, అమరావతి: విమాన ప్రయాణాల తరహాలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యంలేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
తిరుపతి నుంచి భద్రాచలం వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విజయవాడకు, అక్కడి నుంచి భద్రచలానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండవచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దశల్లో మరిన్ని పట్టణాలకు ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది.
ఇది కూడా చదవండి: బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు