ముసురుమిల్లి..కల్పవల్లి  | The Musurmilli Irrigation Project Boon To The Farmers | Sakshi
Sakshi News home page

ముసురుమిల్లి..కల్పవల్లి 

Published Fri, Apr 22 2022 6:26 PM | Last Updated on Fri, Apr 22 2022 6:42 PM

The Musurmilli Irrigation Project Boon To The Farmers - Sakshi

ఒకప్పుడు సాగునీటికి అష్టకష్టాలు పడేవారు. వర్షాలు, చెరువులపై ఆధారపడేవారు. వరుణుడు కరుణిస్తే పంటలు పండేవి.. లేకుంటే నష్టపోయేవారు. సమస్యను గుర్తించిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముసురుమిల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటిలో నిధులు మంజూరు చేశారు. ఆయన మరణాంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తయ్యాయి. వేలాది ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతోంది.  

రంపచోడవరం: ముసురుమిల్లి సాగునీటి ప్రాజెక్టు రైతులకు వరంగా మారింది. గిరిజన ప్రాంతంలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  మండలంలో భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులను అప్పటిలో మంజూరు చేశారు. భూపతిపాలెం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టు ద్వారా గిరిజనుల భూములకు సాగు నీరు అందుతోంది. ముసురుమిల్లి ప్రాజెక్టుకు గత ప్రభుత్వాలు సక్రమంగా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముసురుమిల్లి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను రంపచోడవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో సీతపల్లి వాగుపై నిర్మించారు.  

రైతుల్లో ఆనందం 
ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా దేవీపట్నం, రంపచోడవరం, గోకవరం, కోరుకొండ మండలాల్లోని రైతులకు సాగు నీరు అందుతోంది. ఈ నాలుగు మండలాల్లో 22,316 ఎకరాలు సాగవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు 2005లో ప్రారంభించారు. అటవీ అభ్యంతరాల కారణంగా ఏడాది పాటు ముందుకు సాగలేదు. ఇబ్బందులు తొలగిపోవడంతో ఆ తరువాత రూ.205 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి.  

మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో ముసురుమిల్లి ప్రాజెక్టు నిధుల కేటాయింపు సక్రమంగా జరగలేదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఏమాత్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్రం విడిపోయి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. అరకొరగా నిధులు విడుదల చేసేది. నిధుల కొరత కారణంగా హెడ్‌వర్క్స్‌ వద్ద గేట్ల నిర్మాణ పనులు పూర్తి కాలేదు.  

రూ.22 కోట్ల కేటాయింపుతో.. 
కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నీరు అందని పరిస్థితి. ఉప కాలువలు ఎక్కడిక్కడ గండ్లు పడి నీరు వృథాగా పోయేది. గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతులే గండ్లు పూడ్చుకునేవారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముసురుమిల్లి ప్రాజెక్టుకు రూ.22 కోట్లు మంజూరు చేసింది. రెండు నెలలు కాలంలోనే గేట్ల ఏర్పాటు పూర్తయింది. 

ప్రతి నీటి బొట్టు వినియోగంలోకి.. 
ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేయడంతో నీటి వృథాను అరికట్టారు. ప్రతి నీటిబొట్టు రైతులకు ఉపయోగపడుతోంది. రూ.8 కోట్లతో కాలువలకు మరమ్మతులు చేపట్టారు. ముసురుమిల్లి ప్రాజెక్టు నుంచి 173 కిలోమీటర్ల పొడవునా కాలువలు విస్తరించి ఉన్నాయి. ప్రాజెక్టు ప్రధాన కాలువ  32.370 కిలోమీటర్లు, లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ 9.915 కిలోమీటర్లు,  ప్రధాన కాలువ నుంచి పిల్ల కాలువలు 75.491 కిలోమీటర్లు, లెప్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి పిల్ల కాలువలు 41.48 కిలోమీటర్లు, ప్రధాన కాలువ నుంచి పైపు లైను 10.7 కిలోమీటర్లు, లెప్ట్‌ కెనాల్‌ నుంచి పైప్‌లైను 3.89 కిలోమీటర్లు ఉన్నాయి. కాలువలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడంతో రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుబాటులోకి వచ్చింది. 

పూర్తిస్థాయిలో సాగునీరు 
గత ఏడాది కాలువల మరమ్మతులకు రూ. 8 కోట్లు నిధులు మంజూరు కావడంతో కాలువల్లో పూడిక తీత, గండ్లు పూడ్చివేత పనులు పూర్తి చేశాం. ఈ ఏడాది కూడా కాలువలు మరమ్మతులు నిధులు మంజూరు చేశారు. రైతులకు రబీకి నీటి విడుదల పూర్తి చేసి మే మొదటి వారంలో పనులు ప్రారంభిస్తాం.  
 – మర్గాని శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, ముసురుమిల్లి ప్రాజెక్టు

ప్రాజెక్టు వివరాలు..
ఆధారం        : సీతపల్లి వాగు 
ఆయకట్టు        : 22,316 ఎకరాలు 
ప్రధాన కాలువ    : 32 కిలోమీటర్లు 
నిల్వ సామర్థ్యం    : 1.60 టీఎంసీలు 
గరిష్ట నీటిమట్టం    : 123 మీటర్లు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement