జెడ్పీ చైర్మన్‌ని సత్కరిస్తున్న ఉపాధ్యాయులు
విజయనగరం: పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణలో శ్రేష్టతను గుర్తించి, ప్రేరేపించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పథకానికి జిల్లా నుంచి 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. పారిశుద్ధ్యం, తాగునీరు, సబ్బుతో చేతులు కడుక్కోవడం, ప్రవర్తన మార్పు, సామర్థ్య పెంపు, కోవిడ్ సంసిద్ధత కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలను గుర్తించి అవార్డులు అందజేశారు. పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, ఇందుకూరు రఘు రాజు, పాకలపాటి రఘువర్మ ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అందజేశారు.
అవార్డులతో మరితం ప్రేరణ
ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు ఉపాధ్యాయుల్లో మరింత ప్రేరణ కలిగించి మరిన్ని ఉత్తమ ఫలితాల సాధన దిశగా స్ఫూర్తిని నింపుతాయని అభిప్రాయ పడ్డారు. ప్రతి ఒక్కరూ శ్రమించి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను అందుకున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, నాడు–నేడు తో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య ఈ రోజు పోటీ వాతావరణం నెలకొందని, విద్యారంగంలో సంభవిస్తున్న మంచి పరిణామానికి ఇది నిదర్శనమన్నారు. సమాజ అవసరాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి దూరదృష్టి వల్లే విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు.
విద్యావ్యవస్థలో మంచి సంస్కరణలు
నాడు–నేడు ద్వారా జరిగిన పనుల వల్ల పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని, తద్వారా విద్యార్థులు మంచిగా చదువుకుంటున్నారని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. ముఖ్యమంత్రి మంచి విజన్‌తో ముందుకెళ్తూ విద్యా వ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ఎస్.కోట నియోజవర్గ పరిధిలో ఒక పాఠశాలను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రకటించారు.
అనంతరం పురస్కారాలకు ఎంపికైన పాఠశాలల పరిధిలో ఎలాంటి విధానాలు అమలు చేశారు. అవార్డులకు ఎంపిక కావడానికి తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల గురించి అవార్డు గ్రహీతలైన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు వారి అభిప్రాయాలను వివరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డైట్ ప్రిన్సిపాల్ ఎన్.టి. నాయుడు, సమగ్ర శిక్షా సీఎంవో శ్రీనివాసరావు, వివిధ మండలాల ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ)
Comments
Please login to add a commentAdd a comment