
కూలిన వంతెన పైనుంచి ఏలేరు కాలువలో పడిన టిప్పర్
సాక్షి, సామర్లకోట: పిఠాపురం రోడ్డులో ఏలేరు కాలువపై ఉన్న ఇరుకు వంతెన శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సామర్లకోట నుంచి పిఠాపురం వైపు గ్రావెల్ లోడుతో టిప్పర్ వెళ్తుండగా.. ఆ బరువుకు వంతెన కూలిపోయింది. దీంతో టిప్పర్ ఏలేరు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయట పడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో పిఠాపురం రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిటిష్ కాలంలో ఈ వంతెనను నిర్మించారు. ఇది శిథిలావస్థకు చేరిన విషయమై గతంలో నిమ్మకాయల చినరాజప్ప ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘సాక్షి’ దినపత్రిక వివిధ కథనాలు ప్రచురించింది. ఈ వంతెన దుస్థితిపై హెచ్చరించింది. అప్పట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజప్ప ఈ వంతెనను ఒక్కసారి కూడా పరిశీలించలేదు. అధికారులు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, ఏలేరు ప్రాజెక్టు నుంచి అదనపు జలాల విడుదల కారణంగా ఏలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. ప్రవాహ ఉద్ధృతికి వంతెన మరింత దెబ్బతింది.
దీని దుస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు కొత్త వంతెన నిర్మించాలని ఆర్‌అండ్‌బీ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీని నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు ప్రకటించారు. ఇంతలోనే వంతెన కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సుమంత్, తహసీల్దార్ వజ్రపు జితేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వంతెన పైనుంచి పడిన టిప్పర్‌లో ఉన్న డ్రైవర్ అశోక్‌ను, క్లీనర్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. వారిద్దరూ ఏలేశ్వరానికి చెందిన వారని తెలిపారు. వంతెన కూలిపోవడంతో బ్రౌన్‌పేట వద్ద, పిఠాపురం నుంచి వచ్చే వాహనాలు రాకుండా జల్లూరు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిషేధించారు. ఈ మేరకు పిఠాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిఠాపురం వెళ్లే వాహనాలను మరో మార్గంలో మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment