సూక్ష్మ సేద్యంలో ఏపీకి జాతీయ పురస్కారం  | National Award For AP In Micro Farming | Sakshi
Sakshi News home page

సూక్ష్మ సేద్యంలో ఏపీకి జాతీయ పురస్కారం 

Published Thu, Jun 1 2023 7:42 AM | Last Updated on Thu, Jun 1 2023 7:47 AM

National Award For AP In Micro Farming - Sakshi

సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యం ద్వారా అత్యుత్త­మ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థా­యి పురస్కారం లభించింది. సూక్ష్మ సేద్యం అమలులో ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాలను రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర దక్కించుకున్నాయి. 

బోర్ల కింద వంద శాతం బిందు, తుంపర పరికరాలను అమర్చడంతోపాటు ఉత్తమ యాజమాన్య పద్దతులను పాటిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్న పంచాయతీగా జాతీయ స్థాయిలో వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి ఎంపికైంది. రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం, 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. మరో 28 లక్షల ఎకరాలు అనువైనవిగా గుర్తించగా 2022–23లో రూ.636 కోట్లతో 2.27 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించారు. 2023–24లో రూ.902 కోట్ల అంచనాతో 2.50 లక్షల ఎకరాల్లో విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.  

ఉత్తమ పంచాయతీగా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి 
జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైన వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం ఈ.కొత్తపల్లిలో 630 మంది రైతులకు బోర్ల కింద 1405 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 1,152.50 ఎకరాల్లో బిందు, 252.50 ఎకరాల్లో తుంపర పరికరాల­ను ప్రభుత్వం సమకూర్చింది. వీటి ద్వారా అరటి, కూరగాయలు, వేరుశెనగ పంటలు పండిస్తూ జాతీయ స్థాయిలో అధిక దిగుబడులను సాధిస్తున్న పంచాయతీగా ఈ.కొత్తపల్లి గుర్తింపు సాధించింది. 

‘పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌’పై ఢిల్లీలో బు­ధవారం జరిగిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ కార్యదర్శి మనోజ్‌ ఆహూజా  చేతుల మీదుగా ఏపీ సూక్ష్మ సా­గునీటి పథకం పీవో డాక్టర్‌ సీబీ హరినాథ్‌రెడ్డి, ఈ.కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్‌ బాలనాగప్ర­సా­ద్‌ అవార్డులను అందుకున్నారు. వినూత్న కా­ర్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశానికే ఆద­ర్శంగా నిలుస్తోందని మనోజ్‌ ఆహూజా ప్రశంసించారు. జాతీయ స్థాయిలో 30 మిలియన్‌ హెక్టార్లలో బిందు, తుంపర పరికరాలను రాయితీపై అందించామని, వచ్చే ఏడేళ్లలో 70 మిలియన్‌ హెక్టార్లలో విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కార్యదర్శి అహ్మద్‌ కిద్వాయి, ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్షు, ఎన్‌ఆర్‌ఎం జాతీయ కార్యదర్శి ప్రాంక్లిన్, ఏపీ ఉద్యాన శాఖాధికారులు వెంకటేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, రత్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీఎం జగన్‌ ప్రోత్సాహంతో  సాధించాం..
ఆర్బీకేల ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా నూరు శాతం బిందు, తుంపర పరికరాలను పొందగలిగాం. అధికారులు, 
శాస్త్రవేత్తల సూచ­నలు పాటిస్తూ తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధిస్తూ రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నాం. మా గ్రామానికి జాతీయ స్థాయి పురస్కారం లభించడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రోత్సాహం వల్లే దీన్ని సాధించగలిగాం. 
– బాలనాగప్రసాద్, సర్పంచ్, ఈ.కొత్తపల్లి, వైఎస్సార్‌ జిల్లా 

ప్రభుత్వ కృషి ఫలితం.. 
ఎలాంటి సిఫార్సులు, పైరవీలకు తావు లేకుండా అర్హత కలిగిన వారందరికీ ఆర్బీకేల ద్వారా బిందు, తుంపర సేద్యం పరికరాలను అందిస్తు­న్నాం. సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితా­లను ప్రదర్శిస్తున్నాం. బోర్ల కింద నూరు శాతం సూక్ష్మ సేద్యం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమ­య్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలు జాతీయ స్థా­యిలో టాప్‌ 5లో నిలిచాయి. ప్రభుత్వ కృషి ఫ­లి­తంగా రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. 
 – సీబీ హరినాథ్‌రెడ్డి, పీవో, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement