6, 7, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు  | NCERT Books For Class 6th 7th 9th Classes | Sakshi
Sakshi News home page

6, 7, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు 

Published Sat, May 6 2023 8:34 AM | Last Updated on Sat, May 6 2023 9:07 AM

NCERT Books For Class 6th 7th 9th Classes - Sakshi

సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణలు తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కరిక్యులమ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర విద్యార్థులు మెరుగ్గా రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. సబ్జెక్టు పాఠ్యాంశాల వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో కొనసాగే ప్రైవేట్‌ స్కూళ్లు కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ పుస్తకాలనే అనుసరించాల్సి ఉంటుంది. గత ఏడాది 8వ తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. 

స్కూళ్లు తెరిచేనాటికి కొత్త పాఠ్యపుస్తకాలు రెడీ 
స్కూళ్లు తెరిచే నాటికల్లా కొత్త పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించేలా పాఠశాల విద్యాశాఖ ముద్రణ పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పాఠ్యపుస్తకాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. పేపర్, ముద్రణ నాణ్యమైన రీతిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అట్ట డిజైన్‌తోపాటు లోపలి చిత్రాలు, ఇతర అంశాలను కూడా సీఎం సూచనల మేరకు ముద్రిస్తున్నారు. మే చివరి వారానికల్లా పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తికానుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు 404 టైటిళ్లలో 5.05 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. అన్ని తరగతుల పుస్తకాలను రెండు సెమిస్టర్లుగా ద్విభాషా (బైలింగ్యువల్‌) విధానంలో ముద్రించి ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జూన్‌లో స్కూళ్లు తెరిచిన వెంటనే సెమిస్టర్‌ 1 పుస్తకాలను జగనన్న విద్యాకానుక కిట్లలో అందచేస్తారు. 

తెలుగు, హిందీ, సోషల్‌ సబ్జెక్టులకు ఎస్సీఈఆర్టీ
2023–24 విద్యాసంవత్సరంలో 6, 7, 9వ తరగతుల విద్యార్థులకు కూడా ఎన్సీఈఆర్టీ కరిక్యులమ్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది 6, 7వ తరగతుల్లో ఇంగ్లీషు, గణితం, సైన్స్‌ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. తెలుగు, హిందీ, సోషల్‌  సబ్జెక్టులకు మాత్రం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను అందిస్తారు.

సబ్జెక్టు అంశాల్లో అత్యున్నత సామర్థ్యాలను సమకూర్చడంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడేలా సబ్జెక్టు అంశాల్లో మాత్రమే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇవ్వనున్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ఇతర చారిత్రక అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు వీలుగా ఎస్సీఈఆర్టీ రూపొందించిన సోషల్‌ పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. గత ఏడాది 8వ తరగతిలో ఇంగ్లీషు, మేథ్స్, సైన్సు, సోషల్‌ సబ్జెక్టుల పుస్తకాలు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో ప్రవేశపెట్టారు. 9వ తరగతి విద్యార్ధులకు ఈ విద్యాసంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నారు. మేథ్స్‌ సైన్సు, ఇంగ్లీషుతో పాటు సోషల్, హిందీ సబ్జెక్టు పాఠ్యపుస్తకాలు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పంపిణీ కానున్నాయి. 9వ తరగతి తెలుగు సబ్జెక్టులో ఎస్సీఈఆర్టీ సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను అందించనున్నారు.  

టెన్త్‌ విద్యార్థులకు 2024–25లో ఎన్సీఈఆర్టీ బుక్స్‌ 
పదో తరగతి విద్యార్థులకు 2023–24 విద్యాసంవత్సరానికి గతంలో మాదిరిగానే ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలనే అందించనున్నారు. గత ఏడాది ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను అభ్యసించిన విద్యార్థులు ఈ ఏడాది 9వ తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ పుస్తకాలనే అభ్యసించనున్నారు. వీరు 2024–25లో సీబీఎస్‌ఈ విధానంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను రాయనున్నారు. అందుకు అనుగుణంగా 2024–25లో టెన్త్‌ విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను అందించనున్నారు.  

ప్రైవేట్‌ స్కూళ్లకు అమెజాన్‌ ద్వారా పంపిణీ! 
ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులకు ప్రైవేట్‌ ప్రింటర్ల ద్వారా పుస్తకాల ముద్రణ చేపట్టిన విద్యాశాఖ వాటిని నేరుగా ఆయా స్కూళ్లకు అందించడంపై కసరత్తు చేస్తోంది. అమెజాన్‌ ద్వారా వీటిని పంపిణీ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.విద్యార్థులు/స్కూళ్ల యాజమాన్యాలు అమెజాన్‌లో పాఠ్యపుస్తకాల కోసం ఆర్డర్‌ ఇస్తే నేరుగా ప్రింటర్ల ద్వారా సరఫరా చేయటాన్ని పరిశీలిస్తున్నారు. దీనివల్ల పుస్తకాల పేరుతో తల్లిదండ్రులపై బాదుడుకు తెర పడుతుందని భావిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement