జూట్ కొరత సాకుతో లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం
రోడ్డున పడిన 2 వేల కార్మిక కుటుంబాలు
అర్ధంతర లాకౌట్‌లతో కార్మికుల ఇబ్బందులు
నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్‌మిల్ మరోసారి మూతపడింది. జూట్ కొరతను కారణంగా చూపి సోమవారం కర్మాగారాన్ని లాకౌట్ చేశారు. ఇటీవల కాలంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మిల్లులో పనిలేక, వేరేపనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడుతున్నారు. జూట్‌మిల్‌లో సుమారు 200 మంది రెగ్యులర్, మరో 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ముడిసరుకు కొరత పేరిట యాజమాన్యం మిల్‌ను అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాల ఆవేదన చెందుతున్నాయి.
కొన్నేళ్లుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందటం లేదు. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదని కార్మికులు చెబుతున్నారు. చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లకుండాపోతున్నాయని రిటైర్డ్ కార్మికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిల్‌ను తెరిపించే ఏర్పాట్లు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.
కార్మికులకు న్యాయం చేయాలి
రిటైర్డ్ కార్మికులకు 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్ యాజమాన్యం చెల్లించలేదు. వారికి చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కులు చెల్లకుండా పోతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కర్మాగారం తెరిపించే ఏర్పాట్లు చేయాలి.
– కిల్లంపల్లి రామారావు, సీపీఎం నాయకుడు, నెల్లిమర్ల
Comments
Please login to add a commentAdd a comment