జగన్‌ను దెబ్బతీస్తున్న అతి మంచితనం.. అతి నిజాయితీ.. | Netizens comments went viral on social media | Sakshi
Sakshi News home page

జగన్‌ను దెబ్బతీస్తున్న అతి మంచితనం.. అతి నిజాయితీ..

Published Sat, Oct 26 2024 5:35 AM | Last Updated on Sat, Oct 26 2024 5:35 AM

Netizens comments went viral on social media

పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత, తండ్రి మరణించిన 10 ఏళ్ల తర్వాత ఆస్తులిచ్చే అన్న ఉంటారా? 

తన స్వార్జితమైన కంపెనీలలో చెల్లెలికి 40శాతం వాటా ఇవ్వడానికి ఎవరైనా సిద్దపడతారా? 

ఆ కంపెనీలలో షర్మిల పెట్టుబడిలేదు, శ్రమలేదు, అప్పులు తేలేదు.. అయినా వాటా ఇచ్చారు.. 

పదేళ్ల వ్యవధిలో రూ.200 కోట్లు ఇచ్చినా కనీస కృతజ్ఞత లేని సోదరి 

సొంత అన్నపై కత్తికట్టి... శత్రువులతో కలిసి కుట్రలా.. 

నెటిజన్ల వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

అతి మంచితనం.. అత్యంత నిజాయితీ!!  వైఎస్‌ జగన్‌ను పలుసార్లు దెబ్బ తీస్తున్నవి ఇవే!! నెటిజన్లు, రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు మరోసారి ఇదే చర్చ జోరుగా మొదలైంది!! 

తన దక్షత, ఆసక్తి, చొరవతో రాణించి స్వయంకృషితో నిర్మించుకున్న వ్యాపారాల్లో 40 శాతం ఆస్తులను 25 ఏళ్ల క్రితమే వివాహమైన సోదరికి ఇవ్వటానికి సిద్ధపడ్డారంటే అది జగన్‌ అతి మంచితనం కాదా? ఈ రోజుల్లో ఇలాంటి అన్న ఎంత మందికి ఉంటారు? తన నిజాయితీ చాటుకునేందుకు ఎంవోయూ చేసి మరీ సొంత చెల్లెలి చేతిలోనే ఎదురు దాడికి గురవుతుండటం అతి మంచితనం వల్ల కాదా? చేసిన పనికి కృతజ్ఞత చూపకపోగా రివర్స్‌లో కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసే కుట్రలో భాగస్వామిగా మారిపోయిన చెల్లెమ్మను ఏమనుకోవాలి? అతి మంచితనమే ఆయన్ను ఇబ్బందు­లకు గురి చేస్తోంది. వైఎస్సార్‌ మరణించి పదేళ్లు అవుతోంది. 

ఆయన ఉండగానే కుటుంబ ఆస్తులను పంచి ఇచ్చారు. అయినప్పటికీ చెల్లిపై ప్రేమ, ఆప్యాయతతో సొంత ఆస్తుల్లో వాటా ఇచ్చేందుకు సిద్ధపడటం అతి మంచితనానికి పరా­కాష్ట కాదా? అతి నిజాయితీగా ఉండటం, రాజకీయాల్లో అబద్ధాలకు ఆమడ దూరంలో ఉండటం వల్లే 2014, 2024 ఎన్నికల్లో జగన్‌ ఓటమి పాలయ్యారని, తరచూ సమస్యల్లో చిక్కుకుంటున్నారనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. – సాక్షి, అమరావతి

చెల్లెలిపై ప్రేమ, అభిమానంతోనేగా..? 
షర్మిల వివాహం జరిగిన 20 ఏళ్ల తర్వాత, తన తండ్రి వైఎస్సార్‌ మరణించిన 10 ఏళ్ల తర్వాత 2019 ఆగస్టు 31న.... జగన్‌ తన స్వార్జితమైన ఆస్తులు ఎందుకు ఇవ్వాలనుకున్నారు? చెల్లెలిపై ఎంతో ప్రేమ, అభిమానం గుండెల్లో ఉండబట్టే కదా? ఏ సోదరుడైనా చెల్లెలికి ఇన్ని ఆస్తులు ఇవ్వడానికి సిద్ధపడతారా? 

ఎంఓయూపై షర్మిల కూడా సంతకం చేశారుగా? 
చంద్రబాబుతో అంటకాగటమే అభిమతంలా ప్రవరిస్తున్న షర్మిల మాటలకు– చేతలకు పొంతన ఉంటే ఒట్టు!. జగన్‌ తనకు భవిష్యత్తులో ఇస్తానంటూ ఎంఓయూలో పేర్కొన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులని, వైఎస్సార్‌ జీవించి ఉన్నప్పుడే వాటిలో తనకు వాటా ఇవ్వాలని కుటుంబ మిత్రులతో చెప్పారని అంటున్న షర్మిలకు అవన్నీ జగన్‌ సొంతంగా సంపాదించుకున్న ఆస్తులని తెలియదా? అవన్నీ వైఎస్‌ జగన్‌ సొంతంగా ఆర్జించిన ఆస్తులని, వాటిని కేవలం చెల్లెలిపై ఉన్న ప్రేమాభిమానాలతో భవిష్యత్తులో ఆమెకు బదలాయిస్తానని ఎంఓయూలో స్పష్టంగా పేర్కొన్నారు కదా!. 

ఆ ఎంఓయూపై జగన్‌తో పాటు షర్మిల కూడా సంతకాలు చేశారు కదా? మరి అవన్నీ కుటుంబ ఆస్తులయితే ఆ విషయాన్ని ఎందుకు ఎంఓయూలో పేర్కొనలేదు? దానికి షర్మిల ఎందుకు అడ్డుచెప్పలేదు? పోనీ వైఎస్సార్‌ జీవించి ఉన్నపుడే అలా భావించి ఉంటే... జగన్‌కు సొంత కంపెనీల్లో షర్మిల కుటుంబీకులు ఒక్కరిని కూడా ఎందుకు వాటాదారుగానో, డైరెక్టరుగానో పెట్టలేదు? వేరే పవర్‌ కంపెనీల్లో మాత్రమే షర్మిలను ఎందుకు వాటాదారుగా పెట్టారు? 

ఎందుకంటే జగన్‌ సొంత ఆస్తులతో షర్మిలకు సంబంధం ఉండకూడదని వైఎస్సార్‌ భావించారు కనక. అయినా సరే... ఆయన మరణించి పదేళ్లు గడిచిపోయాక కూడా... చెల్లెలిపై ఉన్న ప్రేమాభిమానాలతో తన నాలుగు ఆస్తుల్లో 40 శాతం వాటా ఇవ్వాలని 
జగన్‌ సంకల్పించారు. 

వైఎస్సార్‌ ఉండగానే ఆస్తుల పంపిణీ జరగలేదా? 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ బతికుండగానే వారసత్వపు ఆస్తుల పంపిణీ జరిగిపోయింది. 2004, 2009 సంవత్సరాలలో వైఎస్సార్‌ ఎన్నికల అఫిడవిట్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది. 2004లో వైఎస్సార్‌ పేరుతో ఉన్న ఆస్తులు ఆ తర్వాత కనిపించవు. అంటే.. వాటిని పిల్లలిద్దరికీ పంచేసినట్లు అర్ధం కావడం లేదూ? 

అపుడు సాక్షి, భారతి సిమెంట్స్‌ లేవా? 
వైఎస్సార్‌ బతికి ఉన్నపుడే సాక్షి ఉంది, భారతి సిమెంట్స్‌ ఉంది. వైఎస్సార్‌ వాటిని ఎందుకు పంచలేదు? అంటే అవి తను సంపాదించిన ఆస్తులు కాదు కాబట్టి. అవి జగన్‌వి కాబట్టి.. 

జగన్‌ కంపెనీలపై హక్కు ఎలా వస్తుంది? 
సాక్షి, భారతి సిమెంట్స్‌ ఇంకా జగన్‌ ప్రారంభించిన కంపెనీల్లో షర్మిల ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు, ఆ కంపెనీలు నడిచేందుకు ఎలాంటి సాయమూ చేయలేదు. రిస్క్‌ తీసుకునే విషయంలో గ్యారెంటర్‌గా సంతకం కూడా చేయలేదు. కంపెనీల కోసం తెచ్చిన రుణాలపై షర్మిలకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ కంపెనీల నష్టాలను షర్మిల పంచుకోలేదు. ఎలాంటి కేసులనూ ఎదు­ర్కోలేదు. మరి వాటిపై హక్కు ఎలా వస్తుంది? 

ఇంతకన్నా ఆధారాలు కావాలా? 
భారతి సిమెంట్స్‌ పేరులోనే జగన్‌ సతీమణి భారతి పేరు ఉంది. జగతి పబ్లికేషన్స్‌ అనేది జగన్, భారతి పేర్లతో కలిపి పెట్టిందనేది అందరకూ తెలుసు. అవి జగన్‌వి అనేందుకు ఇంతకన్నా వేరే ఆధారాలెందుకు? 

రూ. 200 కోట్లు ఇవ్వలేదా? 
తన స్వార్జితమైన ఆస్తులివ్వడానికి ముందే పదేళ్ల వ్యవధిలో షర్మిలకు జగన్‌ రూ.200 కోట్లు ఇచ్చారు. ఆ విషయంలోనూ షర్మిలకు ఎలాంటి కృతజ్ఞతా లేదు. 

డివిడెండ్‌ ఎలా వస్తుంది? 
జగన్‌ కంపెనీలలో షర్మిల వాటాదారు కాదు. ఏ కంపెనీలలోనూ ఆమెకు ఒక్క శాతం కూడా షేరు లేదు. మరి రూ.200 కోట్ల డివిడెండ్‌ ఎలా వస్తుంది? అన్న చేసిన సాయాన్ని ఇలా మార్చి చెప్పడం వంచన కాక మరేమిటి?

ఇలాంటి అన్న ఎక్కడన్నా ఉన్నారా? 
పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల తర్వాత, వారసత్వపు ఆస్తులు పంచేసిన తండ్రి చనిపోయిన 10ఏళ్ల తర్వాత కూడా బాధ్యతగా చెల్లెలికి ఆస్తులిస్తానని ఎంఓయూ చేసే అన్న ఎవరైనా ఉంటారా?  కోర్టు కేసుల తర్వాత ఆ ఆస్తులిస్తానని స్వయంగా సంతకం చేసి ఇచ్చే అన్నను ఎవరన్నా చూశారా? ఆ విషయంలోనూ షర్మిలకు కృతజ్ఞత లేదు. 

అందరితో చెప్పి జగన్‌తో చెప్పలేదెందుకు? 
వైఎస్‌ జగన్‌ సొంతంగా నిర్మించుకున్న వ్యాపారాలు కూడా కుటుంబ ఆస్తులని, వాటిలో తన పిల్లలిద్దరితో సహా మనవలు నలుగురికీ సమాన వాటా ఇవ్వాలని వైఎస్సార్‌ సంకల్పించారని, ఇదే విషయాన్ని బంధువులతో చెప్పారని అంటున్న షర్మిల... ఆ విషయాన్ని జగన్‌తో వైఎస్సార్‌ ఎందుకు చెప్పలేదనే ప్రశ్నకు సమాధానమివ్వగలరా? 

బంధుమిత్రులతో చెప్పిన వైఎస్సార్‌... ఆ వ్యాపారాలను నడిపిస్తున్న సొంత కుమారుడితో చెప్పకుండా ఉంటారా? ఒకవేళ చెప్పి ఉంటే... ఆయన మాటను విస్మరించటమో, కాదనటమో జగన్‌ చేసేవారా? తండ్రి మరణించాక... ఆ విషాదాన్ని తట్టుకోలేక అసువులు బాసిన పలువురు అభిమానులను కలవటానికి ఓదార్పు యాత్ర చేస్తానని పావురాలగుట్ట సాక్షిగా ప్రమాణం చేశారు జగన్‌. ఆ మాటను నిలబెట్టుకోవటానికి కాంగ్రెస్‌ అధిష్టానంతో తలపడటమే కాదు... కేసులు ఎదుర్కొన్నారు. జైలుకూ వెళ్లారు. 

ఆ స్థాయి వ్యక్తికి ఊహల్లో కూడా ఎదురుకానన్ని కష్టాలను భరించారు. అదీ... తండ్రి పట్ల, ప్రజల పట్ల జగన్‌కు ఉన్న కమిట్‌మెంట్‌. అలాంటి జగన్‌పై షర్మిల చేస్తున్న ఈ విమర్శలకు అర్థం ఉందా అసలు? మాట కోసం ఎంత దూరానికైనా వెళ్లే జగన్‌... మాట తప్పారని అనటానికి అసలు నోరెలా వస్తుంది!!. 

మరి షర్మిల కూడబెట్టిన ఆస్తుల మాటేమిటి? 
పెళ్లయిన 25 ఏళ్ల వైవాహిక జీవితంలో షర్మిల కూడా కొన్ని వారసత్వ ఆస్తులను పొందారు. కొన్ని సొంతంగా సంపాదించారు. కొన్ని కంపెనీలమీద రుణాలు తీసుకుని ఆస్తులు కూడబెట్టారు. వ్యాపారాలు చేశారు. వాటిపై ఏనాడైనా జగన్‌ హక్కులు కోరారా? ఆమె సంపాదించుకున్న ఆస్తులు జగన్‌కు ఎలా వస్తాయి? మరి షర్మిలకు కూడా అది వర్తిస్తుంది కదా? 

నాలుగేళ్లుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. 
జగన్‌ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఎందుకంటే రకరకాల కారణాలతో షర్మిల నాలుగేళ్లుగా జగన్‌ను ఇబ్బందిపెడుతున్నారు. ఆయన ప్రత్యర్థులందరితోను చేతులు కలిపారు. అసత్య ఆరోపణలు చేశారు. అయినా సరే... ఆయన క్షమించారు, ఒక్కోసారి రాజకీయంగా విమర్శల్ని తిప్పికొట్టారు తప్ప... ఇంత దారుణంగా చేస్తున్న నీకు ఎంఓయూ ప్రకారం ఆస్తులెందుకు పంచాలని ఒక్కసారి కూడా అడగలేదు. ఎంఓయూ ఊసే బయటపెట్టలేదు.  

కృతజ్ఞత లేకపోగా.. కుట్రలా..? 
‘‘నేనింత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా నువ్వు కనీసం కృతజ్ఞత చూపించటం లేదు. ఆఖరికి నా క్షేమాన్ని కాంక్షించకుండా నువ్వు వరసగా చేస్తున్న పనులు నన్ను తీవ్రంగా బాధపెట్టాయి. రాజకీయంగా వ్యతిరేకించటమే కాదు. బహిరంగంగా నువ్వు చేసిన దారుణమైన అసత్యారోపణలు నా వ్యక్తిగత ప్రతిష్ఠను కూడా దెబ్బతీశాయి. అయినా అవన్నీ నీ విజ్ఞతకే వదిలేశా. నేనైతే చాలా బాధపడ్డా’’ అని ఆమెకు రాసిన తొలి లేఖలో పేర్కొన్నారు. 

కానీ తనను న్యాయపరంగా ఇబ్బంది పెట్టడానికి కుట్రపూరితంగా ఆస్తులు బదలాయించడాన్నే ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఇది ఎంఓయూకు విరుద్ధం కనక.. ఎంఓయూను ఆమె గౌరవించటం లేదు కనక... ఇంకా తానెందుకు ఎంఓయూకు కట్టుబడి ఉండాలని ప్రశ్నించారు. అంతేకాదు! అప్పటికీ ఒక చివరి అవకాశమిస్తూ... చెల్లెలు కనక.. మనసు మార్చుకుని, ప్రవర్తన మార్చుకుంటే భవిష్యత్తులో తన ఎంఓయూను అమలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తానని చెప్పారు. అదీ జగన్‌ వ్యక్తిత్వం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement