సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ముస్లిం సమాజానికి మేలు చేసిన గొప్ప నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా కితాబిచ్చారు.
మంగళవారం జరిగిన శాసన మండలి క్వశ్చన్ అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లింల సంక్షేమానికి రూ. 2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, సీఎం జగన్ నాయకత్వంలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 12,366 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు లెక్కలతో సహా వివరించారు.
గత ప్రభుత్వం హయాంలో ఉర్దూ అకాడమీ నిర్వహణలో రూ. 14 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సీఐడీ విచారణ కూడా జరిగిందన్నారు. ఉర్దూ అకాడమీకి చెందిన 36 కంప్యూటర్ కేంద్రాలను పునరుద్ధరించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో మైనారిటీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని అంజద్‌బాషా వెల్లడించారు.
వర్సిటీ ఖాళీలు త్వరలో భర్తీ: మంత్రి బొత్స
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ఖాళీల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 2019–20 నుంచి 2022–23 వరకు 1,54,50,580 మంది విద్యార్థులు లబ్ధి పొందారని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 6,262.29 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విద్యార్థులకు వారానికి 16 రకాల పదార్థాలను అందిస్తున్నామన్నారు.
ఆర్బీకేల ద్వారా యంత్రసేవా పథకం: మంత్రి కాకాణి
వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా వైఎస్సార్ యంత్రా సేవా పథకాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా రైతులకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. కౌలు రైతులను కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని, కౌలుదారులకు కార్డులు జారీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ (స్పెషల్‌డ్రైవ్) చేపడతామన్నారు.
ప్రతి రూపాయీ సది్వనియోగం: మంత్రి అంబటి
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం జరగడంలేదనే అపోహ వద్దన్నారు. ప్రతి రూపాయిని ఈ ప్రభుత్వం బాధ్యతయుతంగా సద్వినియోగం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందన్నారు. పోలవరం నిర్మాణం జాప్యానికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి కాఫర్ డ్యామ్ పనులు అసంపూర్తిగా చేయడం వల్లే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం వేసిన అంచనాలు మరింత పెరిగాయని, సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదంతో పనులు వేగవంతం చేస్తామని అంబటి స్పష్టం చేశారు.
మండలిలో సభ్యులు వరుదు కళ్యాణి, మొండితోక అరుణ్‌కుమార్, మర్రి రాజశేఖర్, రఘురాజు, కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ షాబ్జీ, అనంత సత్యఉదయభాస్కర్ పలు అంశాలను ప్రస్తావించారు. కాగా, అసెంబ్లీలో ఆమోదం పొందిన 11 బిల్లులను మండలిలో సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టడంతో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment